Begin typing your search above and press return to search.

మళ్లీ ఇదేం ట్విస్ట్‌.. గల్లా?

By:  Tupaki Desk   |   13 Dec 2022 4:30 PM GMT
మళ్లీ ఇదేం ట్విస్ట్‌.. గల్లా?
X
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం నుంచి పరిశ్రమలు, కంపెనీలు వేరే రాష్ట్రాలకు తరలివెళ్లిపోతున్నాయని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కు చెందిన అమరరాజా బ్యాటరీస్‌ ను జగన్‌ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని.. అందుకే అమరరాజా చిత్తూరులో స్థాపించాలనుకున్న యూనిట్‌ ను చివరకు తెలంగాణకు తరలించేసిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల రూ.9500 కోట్ల విలువైన యూనిట్‌ ను గల్లా జయదేవ్‌ తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం ప్రతిపక్షాల విమర్శలకు ఊతమిచ్చింది.

ప్రతిపక్షాల విమర్శలకు తగ్గట్టే జగన్‌ ప్రభుత్వం మొదట్లో అమరరాజాను లక్ష్యంగా చేసుకుందన్న విమర్శలు వచ్చాయి. అమరరాజా బ్యాటరీస్‌ విడుదల చేస్తున్న కాలుష్యంతో భూగర్భ,వాయు కాలుష్యాలు విడుదలవుతున్నాయని అంటూ అమరరాజా బ్యాటరీస్‌ కి సీల్‌ వేసింది. అయితే అమరరాజా హైకోర్టును ఆశ్రయించి తనకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకుంది.

ఆ తర్వాత ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న యూనిట్‌ ని తమిళనాడుకు తరలించడానికి ప్రయత్నించింది. అయితే ఏమైందో ఏమో కానీ తెలంగాణలో ఏర్పాటు చేయబోతోంది. జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల వల్లే అమరరాజా వేరే రాష్ట్రానికి తరలిపోయిందని ప్రతిపక్షాలు, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

అయితే ఇంతలోనే మరో కొత్త యూనిట్‌ ను ఏపీలో ఏర్పాటు చేయనున్నట్టు అమరరాజా ప్రకటించింది. దీన్ని గల్లా జయదేవ్‌ సొంత జిల్లా చిత్తూరులో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. అమర రాజా బ్యాటరీస్‌కు అనుబంధ సంస్థ మంగళ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ యూనిట్‌ను చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయనుంది. ఈ పెట్టుబడి విలువ 250 కోట్ల రూపాయలు అని ఆ సంస్థ ప్రకటించింది.

చిత్తూరు జిల్లాలోని తేనేపల్లిలో కొత్త యూనిట్‌ ను నెలకొల్పబోతోన్నట్లు అమరరాజా ప్రకటించింది. 250 కోట్ల రూపాయల మొత్తం పెట్టుబడితో 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యూనిట్‌ ను ఏర్పాటు చేయనుంది.

కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ యూనిట్‌ ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని గల్లా జయదేవ్‌ తెలిపారు. ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా 4,500 మందికి ఈ యూనిట్‌ వల్ల లబ్ధి కలుగుతుందని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.