Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి పేద రైతులు..రూ.1.5 కోట్ల లాయ‌ర్ ఫీజు

By:  Tupaki Desk   |   24 Jan 2020 3:40 PM GMT
అమ‌రావ‌తి పేద రైతులు..రూ.1.5 కోట్ల లాయ‌ర్ ఫీజు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ కేసుల విష‌యంలో విచారణకు ఏపీ సీఎం జ‌గ‌న్ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించి ఆయనకు రూ. 5 కోట్ల‌ ఫీజు చెల్లిస్తోంది. అయితే, దీనిపై భ‌గ్గుమ‌న్న ప‌లువురు తాజా ప‌రిణామాలతో షాక్ తింటున్నారు. రైతులు కేవ‌లం మూడు రోజులకు త‌మ లాయ‌ర్‌ కు రూ.1.15 కోట్లు ఫీజు చెల్లించార‌ట‌.

మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ స‌ర్కారు ముందుకు సాగుతోంద‌ని - ఐదుకోట్ల ఫీజు చెల్లించేందుకు లాయ‌ర్‌ ను మాట్లాడేసింద‌ని ప్ర‌తిప‌క్ష టీడీపీ ఆరోపించింది. త‌మ‌కు ఎదురుదెబ్బ త‌గ‌ల‌వ‌ద్ద‌ని కోరుకుంటూ కోర్టుల్లో ఇలా డ‌బ్బులు త‌గ‌లేస్తూ - పేద రైతుల పొట్ట కొడుతోంద‌ని ఆ పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఆరోపించారు. అయితే, అదే పేద రైతులు అన‌బ‌డే వారు మూడు రోజుల పాటు త‌మ పక్షాన వాదించే న్యాయ‌వాదికి రూ. కోటి 15 ల‌క్ష‌లు చెల్లించార‌నే వార్త ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. రైతుల ప‌క్షాన వాదించిన సీనియ‌ర్ న్యాయ‌వాది అశోక్ భాన్ ఈ మేర‌కు ఆ డ‌బ్బులు ఫీజు రూపంలో పొందిన‌ట్లు స‌మాచారం.

రాజ‌ధాని పేద రైతుల‌కు వ్య‌తిరేకంగా ఫీజు కింద వాదించే న్యాయ‌వాదికి రూ.5 కోట్లు ఇచ్చి ప్ర‌భుత్వ ధ‌నం ముఖ్య‌మంత్రి దుబారా చేస్తున్నార‌ని ఆరోపించిన చంద్ర‌బాబు ఆయ‌న నాయ‌క‌త్వంలోని రైతుల‌చే ఏ విధంగా రూ.కోటి 15 ల‌క్ష‌ల‌ చెల్లించేశార‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. నిజంగా స‌ద‌రు రైతులు పేద‌వారే అయితే, ఇంత భారీ మొత్తం ఎలా చెల్లించ‌గ‌ల‌రు? ఒక‌వేళ‌, వారు చెల్లించ‌క‌పోతే...టీడీపీ వారిప‌క్షాన చెల్లించిందా? అలా జరిగితే ఎందుకు చెల్లించింది? వ‌ంటి ప్ర‌శ్న‌లు స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.