Begin typing your search above and press return to search.

అమరావతి లంక భూములన్నీ ఇద్దరివే

By:  Tupaki Desk   |   26 Dec 2015 5:30 PM GMT
అమరావతి లంక భూములన్నీ ఇద్దరివే
X
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భాగమైన లంక భూములను ఎవరైనా కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. లంక భూములను కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు పిర్యాదు చేసినప్పడు.. వెంటనే ఆయన కలెక్టర్ - ఎస్పీలను పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చారు. లంక భూములను కొనుగోలు చేసేది ఎవరైనా సరే.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఇంతకీ.. ఆ లంక భూములను కొనుగోలు చేస్తున్నది ఎవరో తెలుసా? సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రులేనట. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి - మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలకే అక్కడి లంక భూముల్లో సింహ భాగం వాటా ఉందట.

అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం జరీబు భూములను, మెట్ట భూములను తీసుకుంది. ప్రభుత్వ భూములను కూడా తీసుకుంది. అసైన్డ్ భూములకు కూడా పరిహారంప్రకటించింది. ఇక మిగిలింది లంక భూములు మాత్రమే. కృష్ణా నదిలోని ద్వీపాల్లో వందల ఎకరాల్లో ఈ లంక భూములు ఉన్నాయి. ఇప్పటి వరకు వీటికి పరిహారం ఎంత ఇస్తారో ప్రకటించలేదు. వాస్తవానికి వీటిని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని, రాజధాని నుంచి నేరుగా అక్కడికి విశాలమైన రహదారులను వేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అయితే, భవిష్యత్తులో లంక భూములకు కూడా మంచి రేటు ఉంటుందని తెలిసినా.. పరిహారం ఎంత ఇస్తారో తెలియక మిగిలిన వాళ్లుకొనుగోలు చేయలేకపోతున్నారు. కానీ, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి - మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలు మాత్రం ఇక్కడ వందల ఎకరాల పొలాలను కొంటున్నారనే ప్రచారం రాజధాని గ్రామాల్లో విస్తృతంగా సాగుతోంది. మిగిలిన మంత్రులు కూడా లంక భూములను కొనుగోలు చేస్తున్నా.. వారి వాటా తక్కువేనని, మొత్తంమీద లంక భూములను కేవలం మంత్రులే హస్తగతం చేసుకుంటున్నారని, మరి చంద్రబాబు ఎవరిపై చర్య తీసుకుంటారని కూడా ప్రశ్నిస్తున్నారు.