Begin typing your search above and press return to search.

ఆంధ్రులే గెలిచారు..అమ‌రావ‌తి రైతులే గెలిచారు..

By:  Tupaki Desk   |   3 March 2022 12:30 PM GMT
ఆంధ్రులే గెలిచారు..అమ‌రావ‌తి రైతులే గెలిచారు..
X
ప‌చ్చ‌ని పంట‌లు పండే నేల‌ల‌కు సరికొత్త అభివృద్ధి వెలుగులు ఇస్తామంటే రైతులు ముందుకు వ‌చ్చారు.భూములిచ్చారు.కానీ ప్ర‌భుత్వం మారిపోగానే నాటి ఒప్పందాలు నాటి ప‌నులు అన్నీ ఆగిపోయాయి. 3 రాజ‌ధానుల నిర్ణ‌యం కార‌ణంగా ఎక్క‌డి ప‌నులు అక్క‌డే స్తంభించిపోయాయి.దీంతో అమ‌రావ‌తి రైతులు హైకోర్టును ఆశ్ర‌యించారు.వాడ‌వాడ‌కూ తిరిగి మ‌ద్ద‌తు సేక‌రించారు.ఆఖ‌రికి ఇవాళ తిరుగులేని విజ‌యం న‌మోదు చేశారు.గెలుపు సాధించారు.

800 రోజుల‌కు పైగా అమ‌రావ‌తి రైతులు చేసిన పోరాటం ఫ‌లించింది. ఎండ‌కూ వాన‌కూ చ‌లికీ వెర‌వ‌క చేసిన పోరాటం దిగ్విజ‌య‌వంతం అయిన ఫ‌లితాలు అందుకుంది.న్యాయ‌పోరాటం ఫ‌లితం ఇవ్వ‌డంతో ఇవాళ అమ‌రావ‌తి రైతులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

ఇదే సంద‌ర్భంలో కోర్టు చెప్పిన విధంగా ప్ర‌భుత్వం న‌డుచుకుని త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి 3 రాజ‌ధానుల గొడ‌వ‌ను త‌లకెత్తుకుంది.అస‌లు అమ‌రావ‌తి అన్న‌ది అభివృద్ధికే నోచుకోలేద‌ని,ఇదంతా ఏడారి అని అంటూ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ లాంటి తీవ్ర‌మ‌యిన వ్యాఖ్య‌లు ఆ రోజు చేశారు.

అమ‌రావ‌తి అన్న‌ది ప్ర‌జా రాజ‌ధాని కానేకాద‌ని కూడా అన్నారు.దీంతో ఆ రోజు తాము భూములు ఇచ్చి, ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించింది కేవ‌లం రాజ‌ధాని నిర్మాణం అవుతుందన్న ఉద్దేశంతోనే అని,అలా కాకుండా ఇవాళ వాటికి విరుద్ధంగా జ‌గ‌న్ స‌ర్కారు మాట్లాడ‌డం ఏమంత స‌బ‌బుగా లేద‌ని రైతులంతా అనేక సార్లు రోడ్లెక్కారు.అనేక నిర‌స‌న‌లు చేప‌ట్టారు.అనేక శాంతియుత ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కూ అనే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టి ఆంక్ష‌ల న‌డుమే త‌మ గొంతుక వినిపించారు. క‌రోనా కాలంలో విపత్క‌ర ప‌రిస్థితుల‌ను సైతం లెక్క చేయ‌క నాడు నిర‌స‌న‌లు చేప‌ట్టారు. రైతులు చేప‌ట్టిన నిర‌స‌న‌ల‌కు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం కొన్ని ప్రాంతాల్లో మ‌ద్ద‌తుగానే నిలిచారు.

న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కూ కార్య‌క్ర‌మానికి నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి నేరుగానే మ‌ద్ద‌తు ఇచ్చి మాన‌వ‌తా దృక్ప‌థంతోనే అమ‌రావ‌తి రైతుల‌ను క‌లిశాన‌ని, త‌న ప్రాంత ప‌రిధిలో రైతులు రావ‌డం, వారికి సంఘీభావం తెల‌ప‌డం అన్న‌ది పూర్తి వ్య‌క్తిగ‌తం అని పేర్కొంటూ, పార్టీ అధిష్టానానికి ఝ‌ల‌క్ ఇచ్చారు.దీంతో పాటు చాలా చోట్ల జ‌రిగిన నిర‌స‌న‌ల‌కు భారీ స్థాయి మ‌ద్ద‌తు ప్ర‌జ‌ల నుంచే వ‌చ్చింది.ఆ

రోజు ఈ ప్రాంతంలో రాజ‌ధానికి ఒప్పుకుని ,అధికారంలోకి రాగానే మాటలు మార్చారంటూ టీడీపీ త‌న గొంతుక వినిపించింది. ఇక్క‌డ ఇన్ సైడ్ ట్రేడింగ్ జ‌ర‌గ‌లేద‌ని నెత్తీ నోరూ కొట్టుకుని చెప్పింది.ఆఖ‌రికి కోర్టు కూడా ఇన్ సైడ్ ట్రేడింగ్ జ‌ర‌గ‌లేద‌ని తేల్చింది.

ఇప్పుడు తీర్పు నేప‌థ్యంలో మ‌ళ్లీ సీఆర్డీఏ యాక్టివిటీస్ ప్రారంభం కానున్నాయి. మూడు పంట‌లు పండే భూములు పోయి రోడ్డున ప‌డిన రైతుల‌ను ఆదుకోకపోతే కోర్టు ధిక్క‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం పాల్ప‌డినట్లే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.ఈ నేప‌థ్యంలో రైతులు త‌మది ప్ర‌జా విజ‌యం అని అంటున్నారు.

తాము ఎన్నో అవ‌స్థ‌లు ప‌డి న్యాయ పోరాటం చేశామ‌ని అందుకు ఫ‌లితమే ఇవాళ (గురువారం) వెలువ‌డిన తీర్పు అని సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అటు జ‌న‌సేన కూడా తీర్పును స్వాగ‌తించింది.ఆంధ్రుల రాజ‌ధాని అమ‌రావ‌తే అని ఆ రోజే ప‌వ‌న్ చెప్పార‌ని,అదే ఇప్పుడు నిజ‌మైంద‌ని జ‌న‌సేన నాయ‌కులు నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు.

అదేవిధంగా టీడీపీ కూడా తీర్పును స్వాగ‌తిస్తూనే,వైసీపీ చ‌ర్య‌ల‌ను మ‌రోసారి తీవ్ర‌త స్థాయిలో త‌ప్పు ప‌ట్టింది.రైతుల విష‌య‌మై ఇవాళ హై కోర్టు ఇచ్చిన తీర్పును తూచ త‌ప్ప‌క అమ‌లు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని చేసింది.