Begin typing your search above and press return to search.

చిన్న‌పాటి వ‌ర్షానికే అమ‌రావ‌తి వ‌ణికిందేంటి?

By:  Tupaki Desk   |   7 Jun 2017 7:09 AM GMT
చిన్న‌పాటి వ‌ర్షానికే అమ‌రావ‌తి వ‌ణికిందేంటి?
X
ఇటీవ‌ల కురిసిన వ‌ర్షానికి అమరావతి నగరంలోని తాత్కాలిక సచివాలయ భవనం వణికిపోయింది. వందల కోట్ల రూపాయిల ఖర్చులో నిర్మించిన భవనంలో నీళ్లు కార‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అత్యాధునిక సాంకేతికతో రూపొందించినట్లుగా చెప్పిన సచివాలయం చిన్నపాటి వర్షానికే సినిమా సెట్టింగ్ మాదిరి మారిపోవటం విస్మయానికి గురి చేస్తోంది. ఒక నిర్మాణాన్ని నిర్మిస్తున్నప్పుడు చాలా అంశాల్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. ఎండాకాలం తర్వాత వర్షాకాలం రావటం.. అలాంటి వేళలో ఎదురయ్యే ఇబ్బందులు.. దానికి తగినట్లుగా డిజైన్ ఉందా? లేదా? అన్న విషయాలతో పాటు.. పొలాల్లో నిర్మించిన భవనం.. పెను విపత్తు ఎదురైతే.. భద్రత ఎంత? లాంటి ప్రశ్నలన్నిటికీ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో భ‌వ‌నాలు నిర్మిస్తుంటారు. అయినా ఇలా ఎందుకు జ‌రిగింద‌న్న‌ది తెలియాల్సి ఉంది.

కేవలం 20 నిమిషాల పాటు కురిసిన సాధారణ వర్షానికే కొత్తగా కట్టిన అసెంబ్లీ.. సచివాలయ భవనాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోవటం చూస్తే షాక్ తినాల్సిందే. నిర్మాణం పూర్తి అయి ఏడాది మాత్రమే అయినప్పటికీ.. లీకేజీలు తాజా వర్షంతో బయటకు వచ్చాయి. వర్షపు నీటితో ఛాంబర్లు మడుగుల్లా మారిపోవటం.. ఫైళ్లు.. సోఫాలు..కుర్చీలు తడిచిపోవటంతో పాటు.. గోడల్లో పగుళ్లు కనిపించినట్లుగా చెబుతున్నారు.

ఇక.. వర్ష తీవ్రతతో సచివాలయంలో పాత పెంకుటిల్లలో నీళ్ల ధారలు ఎలా అయితే కారుతుంటాయో.. దాదాపు అలాంటి సన్నివేశాలే ఏపీ సచివాలయంలో కనిపించాయి. సచివాలయంలో పలుచోట్ల వర్షపు నీటి ధారులకు బక్కెట్లు పెట్టాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక.. సచివాలయం వెళ్లే దారంతా బురదమయంగా మారింది.

తాజా వర్షానికి వాననీరు నిలిచిన ప్రాంతాల్లో సీఎం బ్లాక్ కూడా ఉంది. దీంతో పాటు ప్రతిపక్ష నేతకు కేటాయించిన బ్లాక్ లోనూ వర్షపు నీరు వచ్చి నిలిచింది. ఇదే కాకుండా మరో నాలుగు బ్లాకుల్లోనూ వర్షపు నీరు రావటంతో.. వాటిని బక్కెట్లతో ఎత్తిపోయాల్సి వచ్చింది. ఇక.. సచివాలయం బయట సెక్యూరిటీ గేటు వద్ద సందర్శకుల కోసం నిర్మిస్తున్న భవనం మీద నీరు నిలిచిపోయింది. దీంతో.. కొత్త భవనం గోడ నానిపోయి బీటలు వారటంతో.. జేసీబీ సాయంతో గోడను పగలకొట్టేశారు.

సచివాలయం బయట సందర్శకుల కోసం వేసిన టెంట్లు కూలిపోయాయి. సచివాలయ ప్రాంగణంలోని పల్లపు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని మళ్లించేందుకు సచివాలయ సిబ్బంది తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. మొదటిసారి వచ్చిన వర్షంతో భవనంలో ఉన్న లోపాలు తమకు తెలిశాయని చెప్పారు సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/