Begin typing your search above and press return to search.

అమరావతి ఏకైక రాజధాని.. వైసీపీ టీడీపీ బీజేపీ చేతుల్లోనే....?

By:  Tupaki Desk   |   16 Sep 2022 4:30 PM GMT
అమరావతి ఏకైక రాజధాని..  వైసీపీ టీడీపీ బీజేపీ చేతుల్లోనే....?
X
ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితిలో ఆంధ్రులు ఉన్నారు. ఈ విషయంలో విభజన తరువాత వరసగా గద్దెనెక్కిన టీడీపీ వైసీపీ రెండు ప్రభుత్వాలు బాధ్యులే అని అంతా అంటున్నారు. ముందుగా టీడీపీ విషయానికే వస్తే ఏపీ లాంటి 175 సీట్లు కలిగిన రాష్ట్రానికి 53 వేల ఎకరాలతో అంత పెద్ద రాజధాని ఎందుకు అన్నది సూటి ప్రశ్న. రాజధాని అన్నది పాలనాపరమైన వ్యవహారాల కోసం మాత్రమే ఉండాలి. పూర్వకాలంలో రాజధానులు అలాగే ఉండేవి.

ఇక ఇపుడు టెక్నాలజీ పెరిగింది. ఎవరు ఎక్కడ నుంచి అయినా తమ సేవలను అందించే సౌలభ్యం వచ్చింది. అలాంటిది విశాలమైన భవంతులు వేల ఎకరాలతో రాజధాని అని శక్తిని మించిన పనులు చేయడం, ప్రజలను మభ్యపెట్టడం తప్ప మరోటి కాదన్న సంగతి టీడీపీ వారికి మొదట అర్ధం కావాలి. నిజానికి 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలిపించింది మోడీ పవన్ వంటి వారి మాటలు విని మాత్రం కాదు ఆయన అనుభవం చూసే గెలిపించారు.

బాబు వంటి వారు విభజనతో ఏపీకి రాజధాని లేదని, దాన్ని తన హయంలో సాధిస్తారు అని ఆశతోనే అయిదు కోట్ల మంది ఆంధ్రులు నాటికి జగన్ మీద మోజూ క్రేజూ ఉన్నా కూడా తొలి సీఎం గా బాబుకే పట్టం కట్టారు. ఇక్కడ మరిన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. విభజన తరువాత ఏపీకి ఎలాంటి ఆదాయం లేదు. పైగా లక్ష కోట్ల అప్పులతో ఏపీ విడిపోయింది. ఇది ఫక్తు వ్యవసాయ రాష్ట్రం. సర్వీస్ సెక్టార్ కానీ ఐటీ సెక్టార్ కానీ ఏవీ ఏపీలో పెద్దగా లేవు. ఆదాయాలు రావు. పారిశ్రామికంగా ఏపీ ఏమీ కాదు.

ఇలా ఏపీ స్వరూప స్వభావాలు అన్నీ బాగా తెలిసిన చంద్రబాబు వేలాది ఎకరాలను సేకరించి లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం తలపెట్టడమే అతి పెద్ద తప్పు అని అంటున్నారు. బాబుకు అంతగా పెద్ద రాజధాని మీద మోజు ఉంటే ముందుగా ప్రభుత్వం ఏమి చేయగలదో ఆ మేరకు రాజధాని కట్టేసి హంగులు అన్నీ అక్కడ సమకూర్చి మిగిలిన ప్రగతిని కాలానికి వదిలిపెట్టేయాలి. నిజానికి ఎక్కడైనా జరిగేది అదే. హైదారాబాద్ కానీ మరో రాజధాని అయినా ఉన్నఫళంగా వచ్చినవి కావు. కొన్ని వందల ఏళ్ళు అలా ఎదిగి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాయి.

అందువల్ల రాజధానికి తమ వద్ద ఎంత డబ్బు ఖర్చు చేయడానికి ఉంది. కేంద్రం ఎంత మేరకు సాయం చేస్తుంది ఇలాంటి లెక్కలను అన్నీ తీసుకుని బాబు రాజధాని నిర్మాణానికి పూనుకుని ఉండాల్సింది. పైగా ప్రభుత్వ భూములు బోలేడు ఉన్నాయి. నూజివీడులో కూడా చాలా అటవీ భూములు ఉన్నాయి. వాటిని తీసుకుని పైసా ఖర్చు లేకుండా రాజధాని నిర్మాణం చేపడితే చంద్రబాబు హయాంలో అమరావతి కోసం ఖర్చు చేసిన అయిదు వేల కోట్లతో అద్భుతమైన రాజధాని నిర్మాణం అయ్యేది.

కానీ బాబు ఏపీ లాంటి చిన్న రాష్ట్రానికి రాజధాని అని భావించలేదు, ప్రపంచ రాజధాని అని ఊహించి తలపెట్టారు. ఒక విధంగా ఇది ఏపీ లాంటి రాష్ట్రానికి శక్తికి మించిన భారమే. నిజంగా చంద్రబాబు 2019 ఎన్నికల్లో మరోమారు అధికారంలోకి వచ్చినా అమరావతి రాజధానికి పూర్తి చేయలేకపోయేవారు. దానికి కారణం ఆయన రాజధాని కోసం వేసిన భారీ డిజైన్లు అలాంటివి. అతి పెద్ద కాన్వాస్ మీద బాబు రాజధాని మొదలెట్టారు.

కానీ బాబు చేతిలో ఉన్న ఇంకు ఒక రెండు గీతలకే సరిపోయింది ఆ మీదట ఆ కాన్వాస్ మీద బొమ్మ పూర్తి అయ్యేది ఎట్లా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇక స్వయం సమృద్ధి కలిగిన రాజధాని అని బాబు అంటున్నారు. కానీ ఏ మాత్రం మౌలిక సదుపాయాలు లేని అమరావతిలో ముందు పెట్టుబడి పెట్టి అంతా అభివృద్ధిని చేస్తే కదా అక్కడ భూమికి విలువ పెరిగేది. దానికి అయ్యే ఖర్చు భారీ స్థాయిలోనే అన్నది నిజమే కదా. ఇలా సెల్ఫ్ ఫైనాన్స్ కాపిటల్ అని మాటలలో చెప్పడానికి బాగుంటుంది కానీ చేతలలో అయ్యే పని కాదనే ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

ఇక వేలాది ఎకరాలు పచ్చని పంటను పండే భూములను తీసుకోవడం కూడా అతి పెద్ద తప్పే. దాని వల్ల ఏపీకి ఆహారోత్పత్తులకు ముందు ముందు సమస్య అవుతుంది. మరో వైపు విజయవాడ, గుంటూరు వంటి జంట నగరాలను కలుపుతూ రాజధాని కోసం అవసరమైన మేరకు స్థలాన్ని తీసుకుని అభివృద్ధి చేసినా బాబు హయాంలోనే అమరావతి రాజధానికి ఒక రూపు వచ్చేది. కానీ ఇపుడు బాబు చేసిన ఈ ప్రయోగం బాహుబలిని మించింది. బడ్జెట్ బాగా పెరిగింది.

ఇంకో వైపు కేంద్రం చూస్తే తమకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా చోద్యం చూస్తోంది. ఇపుడు ఏపీ ఆదాయం విషయానికి వద్దాం. ఏపీ ఆదాయం ఈ రోజుకు డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల రూపాయ్లు మరో రెండేళ్లలో లక్ష కోట్లకు చేరవచ్చు. దాని మీద కేంద్రం నుంచి వచ్చే ఆదాయం మరో ముప్పయి వేల కోట్లు అని తీసుకున్నా ఎట్టి పరిస్థితుల్లో ఏపీ ఆదాయం లక్షా ముప్పయి వేల కోట్లను మించదు. ఏపీ అప్పుల కుప్పగా ఉంది. చంద్రబాబు జగన్ చేసిన అప్పులకు వడ్డీలే 2024 తరువాత ఏటా యాభై నుంచి అరవై వేల కోట్ల దాకా ఉంటాయని ఒక అంచనా వేస్తున్నారు.

మరి ఉద్యోగుల జీతాలు, సంక్షేమ కార్యక్రమాలు ఆభివృద్ధి కోసం ఎక్కడ నుంచి నిధులు వస్తాయి. అలాంటపుడు అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఏటా ఏ వేయి రెండు వేల కోట్లో విదిలిస్తే ఎప్పటికైనా అయ్యే పనేనా. అది ఎపుడు పూర్తి అయ్యేను. ఏమీ కాకుండా అక్కడ భూములు ఎకరా ఇరవై నుంచి పాతిక కోట్లు అంటే కొనేవారు ఎవరుంటారు. ఇవన్నీ ప్రశ్నలే.

ఇక వైసీపీ విషయానికి వస్తే అమరావతి రాజధాని బాబు మార్క్ కాబట్టి అభివృద్ధి చేయను అని పంతం పట్టి కూర్చుంది. అలా కాకుండా అమరావతి రాజధాని సీడ్ ఏరియాలో అయినా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఈపాటికి ఎంతో కొంత రూపు వచ్చేది. ఇక విశాఖ కర్నూల్ లను రాజధాని అన్న పేరు పెట్టకుండా అభివృద్ధి చేస్తే ఎవరు కాదంటారు. అంతే కాదు, ఏపీలో టైర్ టూ సిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అలా తిరుపతి, రాజమండ్రీ సహా చాలా వాటిని అభివృద్ధి చేసి ఏపీకి ఆదాయ మార్గాలని వైసీపీ చూస్తే కాదనేవారు ఎవరు.

కేవలం ఓట్ల రాజకీయం కోసం మూడు రాజధానులు అంటూ కోర్టుల కేసులతో ఈ వివాదాన్ని పెంచుకుంటూ పోవడం వల్ల సమస్యలు తప్ప ఏమైనా పరిష్కారం ఉంటుందా. ఇక కేంద్రాన్ని ఒప్పించి హైకోర్టు బెంచి అటు విశాఖలో ఇటు కర్నూల్ లో ఏర్పాటు చేయడమే కాకుండా మంత్రి వర్గ సమావేశాలు, ఒక్కోసారి అసెంబ్లీ సమావేశాలు ఈ ప్రాంతాలలో నిర్వహిస్తే వైసీపీని ఎవరు కాదంటారు. కానీ అలాంటి వాటిని పక్కన పెట్టేసి మూడు రాజధానులు అని పట్టుబట్టి కూర్చోవడం వల్లనే ఇది రాజకీయ యుధ్ధంగా మారుతోంది అంటున్నారు.

ఇప్పటికైనా రెండు పార్టీలు ఒక మాట మీదకు రావాలి. అమరావతిలో 53 వేల ఎకరాలలో రాజధానికి అవసరం అయినవి ఎన్ని, అలాగే, భవిష్యత్తులో ఎంతవరకూ భూములు అవసరం అవుతాయి అన్న వాటిని తీసి పక్కన పెట్టి మిగిలిన వాటిని వ్యవసాయం చేసుకుంటామంటే ఆయా రైతులకు అప్పగించాలి. అదే టైం లో రాజధాని డిజైన్లను మార్చి ఏపీకి ఎంత అవసరమో అంత మేర మాత్రమే కట్టి మిగిలిన సొమ్ముతో ఇతర నగరాలని అభివృద్ధి చేస్తే ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుంది,

అలా కనుక చేస్తే ఏపీలో మిగిలిన నగరాలు కూడా రాజధాని స్థాయికి చేరుతాయి. ఈ విషయంలో రెండు పార్టీలు అంగీకారానికి రావాల్సిన అవసరం ఉంది. భేషజాలకు పోతే అది వారికే కాదు అయిదు కోట్ల మంది ఆంధ్రులకే ఇబ్బందిగా చివరికి మారుతుంది. ఇక కేంద్రం కూడా నాకేమి పట్టదని చేతులు ముడుచుకుని కూర్చోకుండా తాను రాజధానికి ఎంత ఇస్తానో సూటిగా చెప్పి అమరావతితో పాటు ఇతర నగరాల అభివృద్ధికి ఇతోధికంగా నిధులను ఇవ్వడానికి ఉదారంగా ముందుకు వస్తేనే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.