Begin typing your search above and press return to search.

అమరావతి దెబ్బకు హైదరాబాద్ హోటళ్లు ఖాళీ

By:  Tupaki Desk   |   23 Oct 2015 11:23 AM GMT
అమరావతి దెబ్బకు హైదరాబాద్ హోటళ్లు ఖాళీ
X
హైదరాబాద్ హోటళ్ల రంగం ఆందోళనలో పడింది. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల విభజన నేపథ్యంలో తమ వ్యాపారం తగ్గిపోయిందంటున్న హోటళ్ల యజమానులు.. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి వైపునకు తమ బిజినెస్ తరలిపోతోందని చెబుతున్నారు. పర్యాటకపరంగా ఇంతకుముందు హైదరాబాద్‌ కు డిమాండ్ ఎక్కువగా ఉండేదని, పర్యాటకులు ఇక్కడే బస చేసేవారంటున్న హోటల్ యాజమాన్యాలు.. ఇప్పుడు అమరావతికి పర్యాటకుల తాకిడి పెరిగిపోయిందని, తద్వారా గుంటూరు - విజయవాడ హోటళ్లకు వ్యాపారం పెరిగిపోయిందని పేర్కొంటున్నారు.

అమరావతి రాజధాని నిర్మాణానికి గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాని మోడీతో శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఏర్పాట్లు చేస్తున్నప్పటి నుంచే వాటిని వీక్షించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన కూడా ఇకపై అమరావతి కేంద్రంగానే జరగనుండటం, అధికారులంతా అక్కడి వెళ్తుండటంతో ప్రభుత్వంతో వివిధ పనుల నిమిత్తం వచ్చేవారి ఆతిథ్యం కూడా తాము కోల్పోతున్నామని తెలంగాణ రాష్ట్ర హోటళ్ల యజమానులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ను పదేళ్లపాటు నిర్ణయిస్తూ కేంద్రం విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ సాధ్యమైనంత త్వరగా తమ సొంత రాష్ట్రానికి తరలి వెళ్లాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచన హైదరాబాద్ హోటళ్ల ఆదాయానికి దెబ్బేసింది. విజయవాడ నుంచే ఇకపై ప్రభుత్వ పరిపాలన సాగాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునకు కీలక మంత్రిత్వ శాఖల యంత్రాంగం కదులుతోంది. దీంతో ఆయా శాఖల్లో పనికోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి బసతో ఇప్పటిదాకా కళకళలాడిన హోటళ్లు వెలవెలబోతున్నాయి. మొత్తానికి రాష్ట్ర విభజన ప్రభావం రాష్ట్రాలు విడిపోయిన ఏడాది తర్వాత హైదరాబాద్ హోటళ్ల రంగంపై పడింది.