Begin typing your search above and press return to search.

స‌మ‌యం చూసుకుని స‌ర్కారు ఇరుకున‌పెడుతోంది.. అమ‌రావ‌తి రైతుల ఆవేద‌న‌

By:  Tupaki Desk   |   12 Dec 2021 2:30 PM GMT
స‌మ‌యం చూసుకుని స‌ర్కారు ఇరుకున‌పెడుతోంది.. అమ‌రావ‌తి రైతుల ఆవేద‌న‌
X
రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పాద‌యాత్ర మ‌రికొద్ది రోజుల్లోనే పూర్తి కానుంది. ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తిలో కొన‌సాగుతున్న యాత్ర షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 17న పూర్తి కానుంది. ఈ నేప‌థ్యంలో తిరుప‌తిలో శ్రీవారి పాదాల సాక్షిగా భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించాల‌ని.. రైతులు, మ‌హిళ‌లు ముందుగానే నిర్ణ‌యించుకున్నారు. అయితే.. తిరుపతిలో సభకు పోలీసులు అనుమతి ఇవ్వ‌లేదు. దీనిని ఉద్దేశ పూర్వ‌కంగా నే అడ్డుకుంటున్నార‌ని రైతు జేఏసీ నాయకులు చెబుతున్నారు.

ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. సభ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 17న అమరావతి రైతులు తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయిస్తామని రైతులు ప్రకటించారు. అనుమతి కోసం ముందస్తు దరఖాస్తు చేసుకున్నా.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని రైతులు మండిపడ్డారు. శని, ఆదివారాల్లో కోర్టు సెలవు చూసుకుని నిర్ణయం ప్రకటించారని వారు ఆరోపించారు. ఇందుకుగాను తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెప్పారు.

ఈ నెల 15, 16 తేదీల్లో శ్రీవారి దర్శనం కోసం టీటీడీను కోరినట్లు రైతులు తెలిపారు. ఆలయ నిబంధనల మేరకే నడుచుకుంటామని స్పష్టం చేశారు. కొండపై రాజకీయ విమర్శలు, జెండాలు, నినాదాలు చేయమని పేర్కొన్నారు. పాదయాత్ర చేసినవారికి దర్శన భాగ్యం కల్పించాలని కోరారు. ఈ మేర‌కుఅమ‌రావ‌తి రైతుల‌ జేఏసీ నేత‌లు మీడియాతో మాట్లాడారు.

41వ రోజు పాదయాత్ర శ్రీకాళహస్తి నుంచి ప్రారంభించారు. రాయలసీమ ప్రజల నుంచి లభిస్తున్న అపూర్వ మద్దతుతో దాదాపు 17 కిలోమీటర్ల నడక సాగించనున్నారు. శ్రీకాళహస్తి నుంచి మిట్టకండ్రిగ, చెర్లోపల్లే, ఇసుకగుంట, రాచగన్నెరు మేర్లపాక, ఏర్పేడు, సీతారాంపేట మీదుగా అంజిమేడు వరకు యాత్ర కొనసాగనుంది. ప్ర‌స్తుతం స‌భ‌పైనే రైతుల దృష్టి ఉండ‌గా.. దీనిని అడ్డుకోవ‌డంపై ప్ర‌భుత్వం దృష్టి ఉంద‌ని రైతులు ఆరోపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.