Begin typing your search above and press return to search.

టీడీపీ బాధ్యత ఒక్క జూనియర్ కేనా...ఆ బూతులేంటి...?

By:  Tupaki Desk   |   9 Oct 2022 9:30 AM GMT
టీడీపీ బాధ్యత ఒక్క జూనియర్ కేనా...ఆ బూతులేంటి...?
X
తెలుగుదేశం పార్టీ నుంచి జూనియర్ ఎన్టీయార్ ఏమాశించాడు. ఆయన ఏమి పొందాడు. కనీసం సర్పంచ్ పదవి అయినా జూనియర్ ఆ పార్టీ తరఫున అనుభవించాడా. ఇక పోతే ఎన్టీయార్ పెట్టిన పార్టీలో జూనియర్ స్థానం ఏమిటి. కనీసం ఆయన పార్టీ సాధారణ సభ్యుడిగానైనా ఉన్నారా. ఇవేమీ పట్టవు ఎవరికీ. జూనియర్ ఎన్టీయార్ సీనియర్ కి మనవడుట. అందువల్ల పార్టీ ఇబ్బందుల్లో ఉన్నపుడు వచ్చి అండగా నిలబడి కాడె మోసేసి ఆ తరువాత పక్కకు వెళ్లిపోవాలట.

ఇదే మాటను నమ్మి 2009 ఎన్నికలకు ముందు వస్తే జూనియర్ ఎన్టీయార్ అప్పటికి పట్టుమని పాతికేళ్ల వయసు కూడా లేకపోయినా ఎన్నికల రాజకీయాల్లోకి దిగాడు. వంద నియోజకవర్గాలలో ప్రచారం చేసి చివరికి అదే ఎన్నికల ప్రచారంలో ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్నాడు. కానీ ఆ తరువాత ఆయనకు పార్టీలో దక్కిందేంటి. ఇక 2014 ఎన్నికల ముందు టీడీపీకి ఆశావహ వాతావరణం ఉన్నపుడు జూనియర్ ని ఎవరైనా పట్టించుకున్నారా. లోకేష్ ఆనాడు ఏమన్నారు. ఎవరికీ బొట్టు పెట్టి పిలిచేది లేదు. వచ్చిన వాళ్ళు రావచ్చు అని తేలికగా చేసి చూసి అనలేదా.

మరి అదే తేలిక భావం 2009 ఎన్నికల ముందు ఎందుకు లేదు, పిలిచి ప్రచారం చేయించుకున్నారు కదా. కానీ 2014 ఎన్నికల్లో పొత్తులు విజయావకాశాలు కలసి వచ్చేలా ఉండడంతో జూనియర్ అక్కరలేకపోయారు. ఇపుడు చూస్తే 2019 నాటికి టీడీపీ 23 సీట్లకు పడిపోయింది. దాంతో పాటు 2024లో మళ్లీ రావాల్సిన అవసరం ఉంది. చావో రేవో అన్న సీన్ ఉంది.

అందుకే ఇపుడు జూనియర్ అని కలవరిస్తున్నారు. అది కూడా అగ్ర నాయకులు కాదు, మిగిలిన వారి చేత జూనియర్ ని బాధ్యత లేదా, పార్టీ పట్టదా. తాత పెట్టిన పార్టీకి మనవడు చేయాల్సింది ఇందేనా అంటూ దీర్ఘాలు తీస్తారు. లేటెస్ట్ గా అమరావతి రాజధాని చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న పాదయాత్రలో ఒక మహిళ అయితే జూనియర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది.

ఎన్టీయార్ మనవడివైతే రా. లేకపోతే బతికి ఎందుకు అన్నట్లుగా దారుణంగా నిందించింది. తాత ఎన్టీయార్ కి అవమానం జరిగితే రావా అని నిలదీసింది. . మేమే టీడీపీని లాక్కొస్తామని కూడా చెప్పుకుంది. సరే ఆమె మాటలు ఆవేశంతో ఉన్నాయనుకున్నా ఈ విషయంలో జూనియర్ బాధ్యత ఎంతవరకూ ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ ది జగమంత కుటుంబం. అందులో జూనియర్ కూడా ఒకరు మాత్రమే.. ఒక వైపు కొడుకులు ఉన్నారు. కూతుళ్ళు ఉన్నారు. అల్లుళ్ళు ఉన్నారు. వారి పిల్లలు మనవళ్ళు ఉన్నారు.

మరి ఇంతమంది మీద అనని మాటలను జూనియర్ మీద ఎందుకు అంటున్నారు. ఇలా అనమని ఎవరు అనిపిస్తున్నారు అన్నదే చర్చగా ఉంది మరి. జూనియర్ తన తాత‌ ఎన్టీయార్ పెరుని వాడేసుకుని హీరో అయిపోయారని కొందరికి దుగ్ద ఉండవచ్చు. కానీ జూనియర్ ఎన్టీయార్ కెరీర్ ని పూర్తిగా పరిశీలించిన వారికి ఆయన రెక్కల కష్టం తో వచ్చారు తప్ప వారసత్వాన్ని పూర్తిగా ఉపయోగించుకుని కాదు అనే అర్ధమవుతుంది.

అయినా జూనియర్ ని చీటికి మాటికీ విమర్శించడం, ఆయన్ని టార్గెట్ చేయడం మాత్రం అలవాటుగా మారిందని జూనియర్ ఫ్యాన్స్ అంటున్నారు. జూనియర్ కి రాజకీయాలతో సంబంధం లేదు, ఆయన ఏ మంత్రి పదవులూ చేపట్టలేదు, అయినా ఆయన బాధ్యత కల కుటుంబ సభ్యుడిగాతాత‌ ఎన్టీయార్ పేరుకు ఏమైనా జరిగితే స్పందిస్తున్నారు. కానీ జూనియర్ ని బదనాం చేయాలనో లేక తాత నుంచి మనవడిని దూరం చేయాలనో భావించే ఇలాంటివి చేస్తున్నారు అని ఫ్యాన్స్ అనుమానిస్తే తప్పు ఎవరిదో మరి.