Begin typing your search above and press return to search.

బొత్స మాటల ఎఫెక్ట్.. రోడ్లెక్కిన అమరావతి రైతులు

By:  Tupaki Desk   |   26 Aug 2019 8:44 AM GMT
బొత్స మాటల ఎఫెక్ట్.. రోడ్లెక్కిన అమరావతి రైతులు
X
కీలక నిర్ణయాల్ని ఒక పద్దతి ప్రకారం తీసుకోవాలి. అంతకు మించి అమలు చేయాలి. కానీ.. హడావుడి చేయటం కారణంగా అనవసరమైన రచ్చ తప్పించి మరింకేమీ ఉండదు. జగన్ పాలనపై ఏపీ వ్యాప్తంగా సానుకూలత వ్యక్తం కావటమే కాదు.. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని చూస్తున్న పరిస్థితి. ఏపీ బొక్కసాన్ని బోడిగుండు చేసిన బాబు పుణ్యమా అని.. ఇబ్బంది పరిస్థితిని ఎదుర్కొంటున్న వేళ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

ఇలాంటి వేళ.. అనూహ్యంగా మంత్రి బొత్స నోటి నుంచి వచ్చిన ఏపీ రాజధాని అమరావతి మీద వ్యాఖ్యలు కలకలంగా మారాయి. ఇదే సందుగా చేసుకని విపక్షాలు.. వాటి సానుభూతిపరులు సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడి తెలిసిందే. అమరావతిని రాజధానిగా చేయటం వల్ల జరిగే నష్టాల్ని బొత్స ప్రస్తావిస్తే.. మరోవైపు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ లాంటోళ్లు.. ఏపీ రాజధాని అమరావతి కాదు.. మొత్తం నాలుగు ప్రాంతాల్ని రాజధానిగా చేస్తున్నారంటూ చేసిన ప్రకటన.. మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేలా చేస్తోంది.

రాజధాని కోసం వేలాది ఎకరాల భూముల్ని ఇచ్చేసిన రైతులకు సంబంధించి ఏం చేయాలి? వారినేం చేయాలన్న అంశంపై సుదీర్ఘంగా ఆలోచించి.. కీలక నిర్ణయాలు వెల్లడించాల్సింది పోయి.. రాజధాని ఏర్పాటుపై అప్పుడెప్పుడో తయారు చేసిన నివేదికను చూపిస్తూ.. వ్యాఖ్యలు చేయటం తొందరపాటు అవుతుంది. బొత్స ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ.. దానికి సమయం సందర్భం చాలా అవసరం.

జగన్ ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చేందుకు ప్రత్యర్థులు విపరీతంగా ప్రయత్నిస్తున్న వేళ.. తొందరపాటుతో చేసే చిన్న ప్రకటన కూడా ప్రభుత్వానికి చిక్కులు తెచ్చే వీలుంటుంది. తాజాగా రాజధాని గురించి మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు ఆందోళనకు దిగారు. రాజధానిని తరలిస్తే ఆత్మహత్యలు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి.. వీటికి ముఖ్యమంత్రి జగన్ ఎలా చెక్ చెబుతారో చూడాలి.