Begin typing your search above and press return to search.

అమరావతి ఆందోళనలు అసలైనవేనా?

By:  Tupaki Desk   |   25 Dec 2019 2:30 PM GMT
అమరావతి ఆందోళనలు అసలైనవేనా?
X
ఏపీ సీఎం జగన్ అమరావతిని కాదని 3 రాజధానుల ప్రతిపాదన చేయగానే అమరావతి రాజధాని రైతులు రోడ్డెక్కారు. అమరావతిలోని కొన్ని గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మరి నిజంగా ఇక్కడి రైతులు ఆందోళన చేస్తున్నారా? వారిని ఎవరైనా ముందుండి నడిపిస్తున్నారా? ఎవరి ప్రోద్బలమైనా ఉందా?

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే కేవలం రెండు జిరాక్స్ కేంద్రాలు, నాలుగు టీస్టాల్స్ మాత్రమే వస్తాయని టీడీపీ నేతలు, రైతులు ఇన్నాళ్లు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అక్కడికి మార్చడంపై వ్యతిరేకిస్తున్నారు. నిజానికి అమరావతి రైతుల ఆందోళనల వెనుక టీడీపీ పెట్టుబడిదారులు ఉన్నారని.. వారే ఆందోళనలు చేయిస్తున్నారనే విమర్శలున్నాయి. పెట్టుబడిదారులే దీన్ని అవకాశంగా మలుచుకున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

2015లో చంద్రబాబు అమరావతి రైతుల నుంచి ల్యాండ్ ఫూలింగ్ పేరిట భూములు లాక్కున్నప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. రైతులు - కూలీలు నిరసనలు చేపట్టారు. చంద్రబాబును తిడుతూ శాపాలు పెట్టారు. మా భూమిని అన్యాయంగా లాక్కున్నారని ఆడిపోసుకున్నారు. అయితే అప్పుడు నిరసన తెలిపిన వారు ఎవ్వరూ ఇప్పుడు జగన్ రాజధాని మార్చుతుంటే అస్సలు స్పందించడం లేదు. ఆందోళనలు చేయడం లేదు. చంద్రబాబు దోచుకున్న భూములను జగన్ మళ్లీ రైతులకు పంచుతామనేసరికి వారు ఆనందంగా ఉన్నారు.

కేవలం అమరావతిపై పెట్టుబడి పెట్టిన వారు, టీడీపీ సానుభూతి పరులు, భూములు కొన్న టీడీపీ నేతలే ఈ ఆందోళనల వెనుక ఉన్నారని క్షేత్ర స్థాయి పరిస్థితులను బట్టి తెలుస్తోంది.

అమరావతిలో కనిపించే నిరసనలు, టిడిపి , చంద్రబాబు నాయుడు నాయకత్వానికి మద్దతు ఇచ్చే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రతిబింబిస్తున్నాయి తప్పితే ఎక్కడా అగుపించడం లేదు. దీన్ని బట్టి ఈ ఆందోళనలు పెట్టుబడిదారులు అరువు తెచ్చుకున్న వారితో చేయిస్తున్నవేనని అర్థమవుతోంది.