Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి ఫ్రీజోన్...బాబు లెక్క‌లు వేరే!

By:  Tupaki Desk   |   3 Jan 2017 7:25 AM GMT
అమ‌రావ‌తి ఫ్రీజోన్...బాబు లెక్క‌లు వేరే!
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమరావతి ఇకనుంచి ఫ్రీజోన్ కానుంది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. త‌ద్వారా అమ‌రావ‌తి అన్ని ప్రాంతాల హక్కు కానుండ‌టంతో కోస్తాంధ్రేతరులు అయిన సీమ - ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు ఇది వరం కానుంది. అయితే ఇన్నాళ్లుగా ఈ విష‌యంలో అన్ని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్న‌ప్ప‌టికీ స్పందించ‌ని బాబు తాజాగా ప్ర‌క‌టించ‌డం వెనుక మ‌త‌ల‌బు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న శాస‌న‌మండలి ఎన్నిక‌ల‌తో పాటు భ‌విష్య‌త్ రాజకీయ వ్యూహం కూడా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తున్నారు.

ఇటీవలి కాలంలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జోన్ల విషయం ఖరారు కాకపోవడం - అన్ని ప్రాజెక్టులనూ కోస్తాంధ్రలోనే నెలకొల్పుతున్న ప్రభుత్వం చివరకు అమరావతి ప్రాంతంలో ఉద్యోగాలను కూడా ఆ మూడు జిల్లాలవాసులకే కల్పిస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. దాంతోపాటు బాబు సీమవాసి అయినా కోస్తాంధ్ర ప్రయోజనాలకే పనిచేస్తున్నారని సీమ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ రాయలసీమ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్న నేతలు - అమరావతిని ఫ్రీజోన్ చేయాలన్న డిమాండ్‌ కు పదునుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. జన్మభూమి గ్రామసభల ప్రారంభం సందర్భంగా సీమ ప్రాంతం వేదికగా అమరావతిని ఫ్రీజోన్‌ గా చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించటం ద్వారా తాను అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేస్తున్నాననే సంకేతం ప్రజల్లోకి పంపించారు. నిజానికి రాజధానిలో ఇప్పటివరకూ ప్రభుత్వోద్యోగాలకు నెల్లూరు - గుంటూరు - ప్రకాశం జిల్లా వాసులకే అవకాశం ఉంది. అంటే అమరావతి జోన్-3లో ఉంది. తాజాగా బాబు నిర్ణయంతో ఇక అమరావతిలో ఎలాంటి ప్రభుత్వోద్యోగానికయినా రాయలసీమ - ఉత్తరాంధ్ర నిరుద్యోగులు కూడా అర్హులవుతారు.

ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఫ్రీజోన్‌పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. దాన్ని తొలగించాలని తెలంగాణ ప్రాంత నేతలు - విద్యార్థులు నాడు డిమాండ్ చేశారు. తాజాగా రాయలసీమ వాసులు కూడా అమరావతిని ఫ్రీజోన్ చేయాలంటూ కొద్దినెలలుగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, బాబు తీసుకున్న నిర్ణయంతో సీమ ఉద్యమానికీ చెక్ పెట్టినట్టయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఫ్రీజోన్ వల్ల అమరావతిపై ఇప్పటివరకూ కొన్ని జిల్లాల పెత్తనానికి తెరపడి ఉత్తరాంధ్ర - రాయలసీమ వాసులకూ అవకాశం ఏర్పడటం ద్వారా అమరావతిలో ఆయా ప్రాంతాల సంస్కృతి - సంప్రదాయాలు కూడా సమ్మిళతమయ్యే అవకాశాలున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఉత్తరాంధ్ర - రాయలసీమ నిరుద్యోగులకు తెలుగుదేశం ప్రభుత్వం చేరువయినట్టయిందని - ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించి వారి అసంతృప్తి తొలగించినందున, ఈ నిర్ణయం అధికారపార్టీకి రాజకీయంగా కూడా లాభిస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ నిర్ణ‌యం వెనుక ఉన్న మ‌రో కీల‌క అంశం త్వ‌ర‌లో రానున్న ప‌ట్ట‌భ‌ధ్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ని చెప్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో విద్యావంతుల ఓట్లు అత్యంత కీల‌కం కాబ‌ట్టి వారిని దూరం చేసుకోకుండా ఉండేందుకు గాను చంద్ర‌బాబు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/