Begin typing your search above and press return to search.

విశాఖ కంటే అమరావతే బెటర్... షాకేనా...?

By:  Tupaki Desk   |   21 Feb 2022 1:30 AM GMT
విశాఖ కంటే అమరావతే బెటర్... షాకేనా...?
X
వైసీపీ సర్కార్ ఆలోచనలు ఒకలా ఉంటే జనాల తీరు మరోలా ఉందేమో అన్న డౌట్లు వస్తున్నాయి. అన్ని ప్రాంతాల సమ‌గ్ర అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ అంటూ గంభీరమైన మాటలను వైసీపీ పెద్దలు చెబుతున్నారు కానీ జనాలకు అవి ఎక్కడంలేదనే అనుకోవాలి.

ఇక ఏపీని మూడు రాజధానులుగా చేస్తామని, అందులో విశాఖను పరిపాలనా రాజధానిగా ఉంచి, కర్నూల్ ని న్యాయ రాజధానిగా చేస్తామని వైసీపీ సర్కార్ పెద్దలు చెబుతున్నారు.

అయితే ఈ ప్రతిపాదనకు ఇప్పటిదాకా అమరావతి రాజధాని రైతులతో పాటు, సమీప జిల్లాల ప్రజలు కూడా ఒప్పుకోవడంలేదు అన్న చర్చ ఉంది. రాజధాని అంటే ఒక్కటే కదా, ఒక చోటే ఉండాలి కదా అన్న మాట కూడా మేధావుల నుంచి సామాన్యుడిదాక వస్తోంది.

ఇవన్నీ ఇలా ఉంటే ఒకే చోట కుప్పపోసినట్లుగా ఉండే హైదరాబాద్ అభివృద్ధి మోడల్ ఏపీకి సరిపడదు అని వైసీపీ అంటోంది. అందుకే తాము మూడు ప్రాంతాలకు సమాన న్యాయం చేస్తామని చెబుతున్నారు.

కానీ జగన్ని ఆయన పార్టీని అక్కున చేర్చుకుని ఆదరించే రాయలసీమ జిల్లాలే ఈ ప్రతిపాదన పట్ల విముఖంగా ఉన్నారని ఇప్పటికే అంటూ వచ్చారు. ఇస్తే గిస్తే పాలనా రాజధానిని కర్నూల్ కి ఇవ్వాలన్నది వారు ఆలోచన. కానీ న్యాయ రాజధాని కర్నూల్ కి అని చెప్పి మొత్తం డెవలప్మెంట్ అంతా విశాఖలో చేస్తామంటే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తున్నారు.

ఇక లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి అయితే మూడు రాజధానులు ఏర్పాటు మీద కుండబద్ధలు కొట్టారు. ఇలాంటి ప్రయత్నం చేయడమే మంచిది కాదని సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన పత్రికలకు విడుదల చేసిన ప్రకటన అయితే ఆసక్తికరంగా ఉంది.

విశాఖలో పరిపాలనా రాజధాని అంటే అది రాయలసీమకు పూర్తి అన్యాయం చేసినట్లే అని అంటున్నారు. ఎక్కడో అనంతపురంలో ఉన్న వారికి విశాఖ ఎంత దూరమో తెలుసునా అని కూడా ప్రశ్నించారు. అలా విశాఖను రాజధానిగా చేయాలని అనుకునే బదులు ఇపుడు ఉన్న అమరావతినే రాజధానిగా ఉంచేసే పోలా అని కూడా సలహా ఇస్తున్నారు.

తమకు విశాఖ రాజధాని కావడం అసలు ఏ కోశానా సమ్మతం కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. మరో వైపు వైసీపీ సర్కార్ కర్నూల్ న్యాయ రాజధాని అని అంటున్నా దానికి కేంద్రం కానీ న్యాయ వ్యవస్థ కానీ ఓకే చెబితేనే అయ్యేది అన్న మాటనూ చెబుతున్నారు. రాయలసీమ వెనుకబాటుతనం గురించి ఏ ప్రభుత్వం ఆలోచించడంలేదని కూడా ఆయన దుయ్యబెట్టారు.

ఎన్నో సహజవనరులు ఉన్నా కూడా రాయల‌సీమ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోకపోవడం వెనక పాలకుల నిర్లక్ష్యం మాత్రమే ఉందని ఆయన విమర్శించారు. మొత్తానికి చూస్తే విశాఖ రాజధాని వద్దు అమరావతి ముద్దు అని రాయలసీమలోనే ఒక అభిప్రాయం బలపడుతోంది అంటే వైసీపీ సర్కార్ పెద్దలు ఆలోచించి తీరాల్సిందే.