Begin typing your search above and press return to search.

అమరావతిలో అప్పుడే లెక్కలు మారాయే

By:  Tupaki Desk   |   27 Dec 2015 4:52 AM GMT
అమరావతిలో అప్పుడే లెక్కలు మారాయే
X
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి కోటి కలలు కనే వాళ్లు ఉన్నట్లే.. సవాలక్ష సందేహాలు వ్యక్తం చేసే వారున్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి నాన్ స్టాప్ గా మాట్లాడేస్తూ.. ఏమేం జరుగుతాయి? అవి ఎలా ఉండనున్నాయని చెప్పే వారు ఎంతమందో.. అసలేం చెబుతున్నారు.. ఏం జరుగుతుందంటూ విమర్శనాత్మకంగా విశ్లేషించే వారికి కొదవ లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా అమరావతి నగర భూమి వినియోగానికి సంబంధించిన తుది ప్లాన్ విడుదల చేయటం తెలిసిందే. అయితే.. ముసాయిదా మాస్టర్ ప్లాన్ కు.. తాజా తుది ప్లాన్ కు మధ్య మారిన లెక్కలు పలు సందేహాలకు కారణం అవుతున్నాయి.

తొలుత అనుకున్నదాని కంటే వివిధ అంశాలకు సంబంధించి కేటాయించే భూమి భారీగా తగ్గటం గమనార్హం. ఎందుకిలా అనే దానికి సమాధానం చెప్పే వారు ఉండటం లేదు. ముసాయిదాకు.. తాజా ప్లాన్ కు మధ్య లెక్క తేడాలు చూస్తే..

ముసాయిదాలో నివాసాలకు 8,060 హెక్టార్లు కేటాయిస్తే.. తుది ప్లాన్ లో 6,910 హెక్టార్లు మాత్రమే కేటాయించారు. అంటే.. మొదట అనుకున్న దాని కంటే ఇది 1150 హెక్టార్లు తక్కువ. ప్రజల సౌకర్యాల కోసం 1300 హెక్టార్లు ముసాయిదా ప్లాన్ లో కేటాయిస్తే.. తుది ప్లాన్ లో 1950 హెక్టార్లకు పెరిగింది. ఈ విభాగంలో మాత్రం ముందు కంటే 650 హెక్టార్లు పెరిగాయి. వాణిజ్య.. పారిశ్రామిక అవసరాల కోసం తొలుత 7,745 హెక్టార్లు అనుకుంటే.. తాజాగా మాత్రం 3,385 హెక్టార్లకు కోత వేశారు. తొలుత అనుకున్న దానికి తాజాకు మధ్య 4,360 హెక్టార్లు తక్కువగా ఉండటం గమనార్హం. ఈ విభాగంలో ముసాయిదా లెక్కకు తుది లెక్క మధ్య అంతరం దాదాపు 60 శాతం మేర తక్కువగా ఉండటం గమనార్హం. ఇక.. పార్కులు.. ఓపెన్ స్పేస్ కు 9,860 హెక్టార్లు కేటాయిస్తే.. తుది ప్లాన్ లో మాత్రం ఈ కేటాయింపులు 6,390కి తగ్గిపోయాయి. ఈ విభాగంలో 3470 హెక్టార్లు తగ్గిపోవటం విశేషం. అంటే.. తొలుత చెప్పినట్లుగా పచ్చటి ప్రకృతి.. వాతావరణ కాలుష్యం అంటూ కనిపించని పరిసరాలు.. ఆహ్లాదంగా ఉండే వాతావరణం లాంటివి ఉండనట్లే.

ముసాయిదాకు.. తుది ప్లాన్ కు మధ్య అంతరమే ఇంత ఎక్కవగా ఉంటే.. ప్రజాభిప్రాయం సేకరించి.. పనులు మొదలై.. అవి పూర్తి అయ్యేసరికి మరెన్ని లెక్కలు తేడా వస్తాయో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముసాయిదాకు.. తుది ప్లాన్ కు మధ్య అంతరం వీలైనంత తక్కువ ఉండాలే కానీ.. మరీ ఎక్కువగా ఉంటే ప్రజల్లో లేనిపోని సందేహాలు పెరిగిపోవటం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది.