Begin typing your search above and press return to search.

అమరావతి ఔట్.. రాజధాని ఎక్కడకు?

By:  Tupaki Desk   |   24 Oct 2019 7:58 AM GMT
అమరావతి ఔట్.. రాజధాని ఎక్కడకు?
X
అమరావతి విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం దాదాపుగా కుండబద్దలు కొట్టే దిశగా సాగుతూ ఉంది. రాజధాని హోదా నుంచి అమరావతిని తప్పించేందుకు రంగం సిద్ధం అవుతూ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. రాజధాని రేసు నుంచి అమరావతి ఔటేనని..రాజధాని మరెక్కడ అయినా అనే మాట గట్టిగా వినిపిస్తూ ఉంది.

రాజధానిగా అమరావతి ఎంపిక విషయంలో ఎలాంటి శాస్త్రీయతా లేదనే విషయం అందరికీ తెలిసిందే. అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు అనేది చంద్రబాబు నాయుడి సొంత నిర్ణయం. ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని ఎక్కడ విస్తారించాలని అనుకుంటాడో.. అలా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అని ప్రకటించుకున్నారు. అందులో ఆయన లెక్కలు ఆయనకున్నాయనేది విశ్లేషకులు చెబుతూ వచ్చిన మాట.

అయితే రాజధానిగా అమరావతి ప్రాంతం పనికిరాదు అనే వాదన ఒకటి క్రమక్రమంగా బలంగా మారింది. అక్కడ భారీ భవంతులు నిర్మించే పరిస్థితి లేదని విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. అమరావతి ప్రాంతానికి వరద భయం ఉందని, కృష్ణా నది పొంగితే చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. అదెలా ఉంటుందో సూఛాయగా ఈ ఏడాదే అగుపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్దెకుంటున్న ఇంటిని కృష్ణా నది టచ్ చేసింది.

ఇక అమరావతి ప్రాంతంలో ఏ భవంతి కట్టినా పునాదులు చాలా అడుగుల లోతుకు తీయాలనే అభిప్రాయాలు వినిపించాయి. చిన్నచిన్నగా పునాదులు తీస్తే ఆ భవంతుల మనుగడే ఇబ్బందికరమైనది అని శాస్త్రీయంగా చెబుతూ వచ్చారు. అన్నింటికీ మించి తన ఐదేళ్ల అధికార కాలంలో.. చంద్రబాబు నాయుడు అమరావతిలో ఎలాంటి శాశ్వత భవనాలూ నిర్మించలేదు. కట్టిన రెండు మూడు కూడా తాత్కాలిక భవనాలే అని వారే చెప్పారు. వాటి నాణ్యత ఏపాటితో కూడా అప్పుడే బయటపడింది. ఇలా అమరావతికి పునాదులు బలంగా వేయలేకపోయారు చంద్రబాబు నాయుడు. దీంతో ఇప్పుడు రాజధాని ప్రాంతాన్ని మార్చినా పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు.

తాము రాజధాని విషయంలో నిపుణుల కమిటీని సంప్రదిస్తామని అంటోంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆరు వారాల్లో నిపుణుల కమిటీ నివేదిక అని అంటున్నారు. ఇది వరకూ శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రస్తావిస్తూ ఉన్నారు. మొత్తానికి రాజధాని హోదా నుంచి అమరావతి ఔట్ అయ్యే పరిస్థితి వచ్చిందని, ఇక ఆ హోదా ఏ ప్రాంతానికి అనేదే తదుపరి చర్చ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు అనే అభిప్రాయాలకూ ఆస్కారం ఏర్పడుతూ ఉంది.