Begin typing your search above and press return to search.

స‌చివాల‌యంలోనూ లీకేజీలు!

By:  Tupaki Desk   |   18 July 2017 10:01 AM GMT
స‌చివాల‌యంలోనూ లీకేజీలు!
X
న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధానిలోని వెల‌గ‌పూడిలో నిర్మించిన‌ తాత్కాలిక స‌చివాల‌యానికి చంద్ర‌బాబు స‌ర్కారు వందల‌ కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు చేసేసింది. ఆ భ‌వంతికి స‌మీపంలోనే తాత్కాలిక అసెంబ్లీని కూడా నిర్మించింది. దీనికి కూడా కోట్లే ఖ‌ర్చ‌మ‌య్యాయి. ఇదంతా బాగానే ఉన్నా... ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షానికి తాత్కాలిక అసెంబ్లీ భ‌వనం బీట‌లు వారగా, విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కేటాయించిన ఛాంబ‌ర్‌లోకి నీళ్లు వ‌చ్చిన విష‌యం క‌ల‌కలం రేగిన సంగ‌తి తెలిసిందే. అయితే భ‌వ‌న నిర్మాణంలో ఎలాంటి లోపం లేద‌ని, అస‌లు భ‌వనం బీట‌లు వార‌లేద‌ని, జ‌గ‌న్ ఛాంబ‌ర్‌ లోకి నీళ్లు రావ‌డానికి కార‌ణం కుట్రేన‌ని అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ తో పాటు టీడీపీ నేత‌లు - మంత్రులు మీడియా స‌మావేశాలు పెట్టి మ‌రీ ఆ వార్త‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అయితే నాడు మీడియా ప్ర‌తినిధుల‌ను తీసుకెళ్లిన ప్ర‌భుత్వం ఒక్క జ‌గ‌న్ ఛాంబ‌ర్‌ ను మాత్ర‌మే చూపింద‌ని, అసెంబ్లీ భ‌వ‌నంలోని మిగిలిన గ‌దుల‌ను ఎందుకు చూపించ‌లేద‌న్న ప్ర‌శ్న‌లు వినిపించినా... అవేవీ త‌న‌కు వినిపించ‌నట్లే ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింది. జ‌గ‌న్ ఛాంబ‌ర్‌లోకి నీళ్లు రావ‌డానికి కార‌ణ‌మైన వారిని వ‌దిలిపెట్టేది లేద‌ని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు స‌ర్కారు... ఆ త‌ర్వాత ఎందుక‌నో ఇప్పుడు దాని ప్రస్తావ‌నే ఎత్త‌డం లేదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే... నాడు అసెంబ్లీ భ‌వ‌నంలో లీకేజీలు క‌ల‌క‌లం రేప‌గా... తాజాగా బాబు స‌ర్కారు అమ‌రావ‌తి ప‌రిధిలో తొలిసారిగా నిర్మించిన క‌ట్ట‌డ‌మైన స‌చివాలయం కూడా లీకేజీల‌కు నెల‌వైంది. స‌చివాలయంలోని దాదాపుగా అన్ని బ్లాకుల్లోని గోడ‌లు బీట‌లు వారాయ‌ని ఇప్ప‌టికే ప‌లువురు గ‌గ్గోలు పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ వార్త‌ల‌ను కొట్టిపారేసిన చంద్ర‌బాబు స‌ర్కారు... అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలున్న కంపెనీలు క‌ట్టిన స‌చివాల‌యం గోడ‌లు దృడంగానే ఉన్నాయ‌ని, ఎలాటి బీట‌లు వార‌లేద‌ని చెప్పింది.

అయితే చంద్ర‌బాబు స‌ర్కారు మాట‌లు వ‌ట్టి మూట‌లేన‌ని చెబుతూ... నిన్న‌టి నుంచి కురుస్తున్న భారీ వ‌ర్షాలు తేల్చి చెబుతున్నాయి. నిన్న ఉద‌యం నుంచి కోస్తాంధ్ర‌లో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కార‌ణంగా స‌చివాల‌యంలోని నాలుగో బ్లాకులోకి నీళ్లు వ‌చ్చేశాయ‌ట‌. అదేదో భారీ వ‌ర్షం కార‌ణంగా రోడ్డుపై పొంగి పొర‌లిన నీరు వ‌చ్చిందేమో అనుకోవ‌డానికి వీల్లేదు. ఎందుకంటే... స‌చివాలయంలోని బ్లాకులోకి చేరిన నీరు ఆ బ్లాకు శ్లాబుల‌కు ప‌డిన చిల్లుల నుంచి వ‌చ్చిన నీటితోనే ఫ్లోర్లు త‌డిసి ముద్ద‌యిపోయాయ‌ట‌. సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో పలు ఛాంబర్లలో వర్షపు నీరు లీక్‌ అవుతోంది.

నాలుగో బ్లాక్ లోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మంత్రి గంటా యాంటీ రూమ్, దేవినేని ఉమ ఛాంబర్ తో పాటు పలుచోట్ల వర్షపు నీరు లోపలికి వచ్చింది. కొన్ని చోట్ల విండో గ్లాస్‌ ల నుంచి, కొన్నిచోట్ల పై ఫ్లోర్ నుంచి వాటర్ లీక్‌ అవుతోంది. గంటా యాంటీ రూమ్‌లో సీలింగ్‌ తడిసి ఊడిపడింది. జలవనరుల శాఖ విభాగంలో చాలా చోట్ల గోడల వెంబడి నీరు వచ్చి చేరుతోంది. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్ లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది. ఇదిలా ఉంటే... స‌చివాల‌యంలోకి వ‌చ్చిన చేరిన నీటిని గ‌మ‌నించిన అక్క‌డి సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి బకెట్లతో వర్షపు నీటిని తోడి బ‌య‌ట పాబ‌బోస్తున్నార‌ట‌.