Begin typing your search above and press return to search.

బీజేపీలోకి కెప్టెన్ ?..కాంగ్రెస్ కు షాకేనా ?

By:  Tupaki Desk   |   29 Sep 2021 2:30 PM GMT
బీజేపీలోకి కెప్టెన్ ?..కాంగ్రెస్ కు షాకేనా ?
X
మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయిపోయింది పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్దితి.  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం కేంద్ర హోంశాఖ అమిత్ షా తో భేటీ అవ్వటం సంచలనంగా మారింది. భేటీ గనుక సానుకూలంగా జరిగినట్లయితే కెప్టెన్ కు కేంద్రమంత్రి పదవి ఖాయమని ప్రచారం పెరిగిపోతోంది. ప్రస్తుతం ఎంఎల్ఏగా ఉన్న కెప్టెన్ బీజేపీలో చేరాలంటే కేంద్రమంత్రిపదవిని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

కేంద్రమంత్రి పదవి ఇవ్వటానికి నరేంద్రమోడి అంగీకరిస్తే తర్వాత ఏదో రాష్ట్రం నుండి కెప్టెన్ను రాజ్యసభ ఎంపిగా ఎంపిక చేయాల్సుంటుంది. లేకపోతే కేంద్రమంత్రి పదవి ఇచ్చినా ఉపయోగం ఉండదు. ఈ విషయాలే కెప్టెన్-అమిత్ షా మధ్య చర్చలు జరిగాయని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ఈ చర్చలు గనుక ఒక కొలిక్కి వస్తే అమరీందర్ బీజేపీలో చేరటం దాదాపు ఖాయమైనట్లే ఉంది. లేకపోతే అసలు అమిత్ ను కలవనే కలవరు. పైగా గంటసేపు ఇద్దరి మధ్య భేటీ జరిగటమంటే మామూలు విషయం కాదు.

ప్రస్తుతం కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సంక్షోభానికి అధిష్టానం చేతకానితనమే కారణమని చెప్పాలి. హ్యాపీగా సీఎం పదవిలో  ఉన్న అమరీందర్ ను నవ్ జ్యోత్ సింగ్ సిద్ధు రాచిరంపాన పెట్టారు. ముందు తనకు పీసీసీ పగ్గాలు అప్పగించేంతవరకు ఊరుకోలేదు. తర్వాత సీఎంగా అమరీందర్ తో రాజీనామా చేయించేదాకా నిద్రపోనివ్వలేదు. పోనీ అమరీందర్ రాజీనామా తర్వాత అయినా సిద్ధూ ప్రశాంతంగా ఉన్నారా అంటే లేదు. కొత్తగా సీఎం అయిన చరణ్ సింగ్ చన్నాతో గొడవలు మొదలయ్యాయట.

తనతో సంప్రదించకుండానే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్న కొత్త సీఎంతో సిద్ధూ విభేదించినట్లు ప్రచారం పెరిగిపోతోంది. కారణాలు ఏవైనా హఠాత్తుగా పీసీసీ ప్రెసిడెంట్ గా సిద్ధూ రాజీనామా చేయటం పార్టీలో కలకలం రేపింది. ఎందుకని అమరీందర్ ను ఇబ్బందులు పెట్టారో ? కొత్త సీఎంతో ఎందుకని గొడవలు పెట్టుకున్నారో ? ఎందుకని పీసీసీ పగ్గాలు వదిలేశారో సిద్ధూకే తెలియాలి.

ఏదేమైనా సిద్ధూ అరాచకం వల్ల పంజాబ్  కాంగ్రెస్ సంక్షోభంలోకి కూరుకుపోయింది. తాజాగా అమరీందర్ బీజేపీలో చేరటం దాదాపు ఖాయమైపోయింది. బీజేపీలో చేరిన తర్వాత రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అమరీందరే సారధ్యం వహించినా ఆశ్చర్యపోవక్కర్లేదు. పంజాబ్ లో రాబోయే ఎన్నికల్లో గందరగోళంలో ఉన్న బీజేపీకి అమరీందర్ చేరిక ఒక్కసారిగా ఊతమిస్తుందేమో చూడాలి.