Begin typing your search above and press return to search.

మాజీ సీఎం కొత్త పార్టీ.. ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   2 Oct 2021 3:30 AM GMT
మాజీ సీఎం కొత్త పార్టీ.. ఎప్పుడంటే?
X
పంజాబ్ సీఎం సీటును వదిలించుకున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజకీయ అడుగులు ఎటువైపు పడుతాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసి బీజేపీలో చేరికపై అమరీందర్ సింగ్ చర్చలు జరిపారు.కానీ బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం సాధ్యం కాదని బీజేపీ చెప్పినట్టుగా ప్రచారం సాగింది.

ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ వైపు కూడా మళ్లిన అమరీందర్ సింగ్ ఇక ఆ పార్టీకి పంజాబ్ లో పెద్దగా స్కోప్ లేకపోవడంతో సొంత పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మరో 15 రోజుల్లో అమరీందర్ సింగ్ కొత్త రాజకీయ పార్టీ స్థాపించే అవకాశాలున్నాయని సమాచారం.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఖరితో విసిగిపోయిన అమరీందర్ సింగ్ పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవల రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసిన అమరీందర్ ఇటీవల ఢిల్లీలో అమిత్ షాతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో సమావేశమయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమరీందర్ కొత్త పార్టీ ఏర్పాటు కోసం తన మద్దతుదారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ప్రస్తుతానికి పంజాబ్ రాష్ట్రానికి చెందిన 12 మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు అమరీందర్ సింగ్ తో టచ్ లో ఉన్నారని సమాచారం. అమరీందర్ పెట్టబోయే కొత్త పార్టీలో అతడి మద్దతుదారులైన కాంగ్రెస్ నేతలు చేరుతారని అంటున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల కొందరు రైతు సంఘం నాయకులను కూడా కలిసే అవకాశం ఉందని అంటున్నారు.

పంజాబ్ పీసీసీ చీఫ్ గా నవజ్యోత్ సింగ్ సిద్ధూ ను నియమించడాన్ని అమరీందర్ సింగ్ వ్యతిరేకించారు. తన మాట వినని కాంగ్రెస్ అధిష్టానం చర్యలకు విసుగుచెందిన పంజాబ్ సీఎం సీటును వదలుకున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన తాజా రాజకీయ పరిణామాలతో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.