Begin typing your search above and press return to search.

అక్కడ ఆ పార్టీని మింగేస్తున్న బీజేపీ...?

By:  Tupaki Desk   |   16 Sep 2022 11:07 AM GMT
అక్కడ ఆ పార్టీని మింగేస్తున్న బీజేపీ...?
X
కవిత్వం తీరని దాహమని మహాకవి శ్రీశ్రీ అన్నారు. కానీ రాజకీయాల్లో పదవులు ఒక తీరని దాహమని చెప్పాలి. అధికారం కోసం అంగలార్చడం ఆరాటపడడం ఒక్క చాన్స్ అంటూ గద్దెనెక్కి ఆ మీదట తామే శాశ్వత పాలకులుగా ఉండాలనుకోవడం రాజకీయ జీవులకు ఉన్న పరమ లక్షణం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి దేశంలో తనకు ఎదురులేదు అని చెప్పాలని ఉంది. తన కత్తికి తిరుగులేదు అని కూడా చాటాలని ఉంది.

ఇక బీజేపీ పొలిటికల్ డిక్షనరీలో నచ్చని పదాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రాంతీయ పార్టీ అన్న పదం అసలు నచ్చదు. ఎక్కడైనా ఎవరైనా ఉత్సాహంతో ప్రాంతీయ పార్టీ పెడితే కనుక వారిని తమ వైపు లాగేసుకోవాలన్న తాపత్రయం బీజేపీది అని అంటారు. ఏపీలో జనసేనను ఇలాగే లాగాలని చూసి భంగపడింది అని ప్రచారంలో ఉంది. కారణం పవన్ సినీ నటుడు, రాజకీయంగా చూస్తే ఇంకా యువకుడు. బలమైన సామాజికవర్గం వెనక ఉంది. దాంతో ఆయన తన పోరాటం ఏదో తాను చేసుకుంటున్నారు.

ఇక పంజాబ్ లో ఆ మధ్య జరిగిన ఎన్నికల ముందు కొత్తగా ఒక పార్టీ పుట్టింది. దానికి అధినాయకుడు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. ఆయన గారిని చాలా ఏళ్ళు కాంగ్రెస్ సీఎంగా కొనసాగించి చివరాఖరున తప్పించేసింది. అంతే కోపం వచ్చి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే పంజాబ్ లో ఆప్ వీర లెవెల్లో చేసిన పెర్మార్మెన్స్ కి కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడింది. ఇక అమరీందర్ సింగ్ పెట్టిన పార్టీ పుట్టె కూడా మునిగింది. ఎంతలా అంటే ఆ రాష్ట్రాన్ని సీఎం గా పాలించిన అమరీందర్ సింగ్ కూడా తన సొంత సీట్లో డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు.

ఇంతలా ఘోరంగా ఓడిన అమరీందర్ సింగ్ పార్టీ ఇపుడు ఎలా ఉందో ఏ స్థితిలో ఉందో కూడా తెలియదు. కానీ ఆ పార్టీని కూడా తమతో పాటు లాగేసుకోవాలని బీజేపీ చూసింది. దానికి అమిత్ షా మంత్రాంగం నెరిపారు. ఇంకేముంది అమరీందర్ సింగ్ తొందరలో బీజేపీలో తన పార్టీని విలీనం చేసి బీజేపీ మెంబర్ కానున్నారు. మరి దీని వల్ల ఆయన‌కు ఏంటి లాభం, బీజేపీకి ఏంటి లాభం అంటే బీజేపీ ఇక్కడ తెలివిగానే ఆలోచించింది అని చెప్పాలి. సీఎంగా పనిచేసిన వారు. పైగా కాంగ్రెస్ లో సీనియర్.

ఆప్ దెబ్బకు కకావికలు అయిన కాంగ్రెస్ అక్కడ దిక్కులు చూస్తోంది. అమరీందర్ సింగ్ కి ఉన్న పాత పరిచయాలతో అక్కడ కాంగ్రెస్ ని పూర్తిగా దెబ్బ కొట్టి ఆ పార్టీ బలాన్ని తమ వైపునకు తిప్పుకోవాలన్న వ్యూహంతోనే అమరీందర్ సింగ్ కి కమలం కండువా కప్పుతున్నారు అని అంటున్నారు. ఆయన ఈ పని చేయాలంటే ఒక పదవి ఉండాలి కదా. అలా ఆయనకు ఒక పదవి కట్టబెడతారు అని అంటున్నారు.

అంటే ఇది దాదాపు ఎనిమిది పదుల వయసులో ఉన్న అమరీందర్ సింగ్ కి ఇది ఒక రాజకీయ లాభం. మొత్తానికి చూస్తే ఒక ప్రాంతీయ పార్టీని కబలించేశామన్న తృప్తి కూడా బీజేపీకి కలుగుతుంది. సో ఉభయకుశలోపరిగా ఉన్న ఈ ఒప్పందం మేరకు కెప్టెన్ సాబ్ ఈ నెల 19వ తేదీన దేశ రాజధానిలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువాను కప్పుకోనున్నారని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.