Begin typing your search above and press return to search.

అమ‌రీంద‌ర్ దారెటు!

By:  Tupaki Desk   |   20 Sep 2021 2:39 AM GMT
అమ‌రీంద‌ర్ దారెటు!
X
మూడు ద‌శాబ్దాలకు పైగా రాజ‌కీయ జీవితం.. రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం.. క‌ష్ట కాలంలోనూ పంజాబ్‌లో కాంగ్రెస్‌ను బ‌తికించిన చ‌తుర‌త‌.. ఇలా రాజకీయ కురువృద్ధుడైన కెప్టెన్ అమ‌రీంద‌ర్‌ది గొప్ప ప్ర‌స్ధానం. దేశంలో కాంగ్రెస్ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచిన స‌మ‌యంలోనూ 2017 పంజాబ్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించిన ఘ‌న‌త ఆయ‌న సొంతం. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు పార్టీలో అంత‌ర్గ‌త విభేధాలు.. సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు.. వెర‌సి అధిస్థానం ఆదేశాల‌తో అవ‌మానం భ‌రించ‌లేక అమ‌రీంద‌ర్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు ఆయ‌న రాజకీయ భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతుంద‌నే చ‌ర్చ సాగుతోంది.

దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్ గాంధీ చొర‌వ‌తో అమ‌రీంద‌ర్ కాంగ్రెస్‌లో చేరి త‌న రాజ‌కీయ జీవితాన్ని ఆరంభించారు. 1980లో ప‌టియాలా నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ఆపరేష‌న్ బ్లూ స్టార్‌కు వ్య‌తిరేకంగా 1984లో ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో పాటు కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆ త‌ర్వాత శిరోమ‌ణి అకాలీ ద‌ళ్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఆ త‌ర్వాత ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సొంతంగా పార్టీ పెట్టినా మ‌నుగ‌డ కొన‌సాగించ‌లేక‌పోయారు. దీంతో త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1992, 2002, 2017లో మ‌ళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2002లో తొలిసారి ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించారు. 2017లో రెండో సారి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

అయితే ప్ర‌స్తుతం పార్టీలోని విభేధాలు అంస‌తృప్తుల కార‌ణంగా సీఎం ప‌దవికి రాజీనామా చేయాల్సి వ‌చ్చిన అమ‌రీంద‌ర్ అడుగులు ఎటువైపు ప‌డ‌బోతున్నాయ‌నే ఆస‌క్తి నెల‌కొంది. 79 ఏళ్ల ఆయ‌న ఇప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో అనే చ‌ర్చ సాగుతోంది. సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసిన ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లే విష‌యంపై స్ప‌ష్ట‌త మాత్రం ఇవ్వ‌లేదు. అలాగే కొత్త సీఎంగా మాత్రం న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూను ఎంపిక చేయొద్దంటూ కోరాడు. పాకిస్థాన్ పాల‌కుల‌కు సన్నిహితుడైన సిద్ధూ వ‌ల్ల దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు ఉందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

వ‌చ్చే ఏడాది పంజాబ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అమ‌రీంద‌ర్ ముందు చాలా మార్గాలున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గ‌తంలో కొత్త పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్న ఆయ‌న‌.. ఈ వ‌య‌సులో మ‌ళ్లీ ఆ సాహ‌సం చేసే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. దీంతో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల వ‌ర‌కూ కాంగ్రెస్‌లోనే కొన‌సాగి.. ఆ త‌ర్వాత మెల్ల‌గా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉండే ఆస్కార‌ముంది. లేక‌పోతే మ‌రోసారి శిరోమ‌ణి అకాలీద‌ళ్‌లో చేరి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ విజ‌యం కోసం పాటుప‌డే అవ‌కాశాలు కొట్టిపారేయ‌లేం. అదీ కాకుండా పంజాబ్‌లో పాతుకుపోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. అమ‌రీంద‌ర్‌ను త‌మ పార్టీలోకి ఆహ్వానించిన ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఇక అవ‌కాశం కోసం ఎదురుచూసే బీజేపీ ఆయ‌న విష‌యంలో ఏమైనా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తుందేమో చూడాలి. ఈ నేప‌థ్యంలో అమ‌రీంద‌ర్ ఏ నిర్ణ‌యం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.