Begin typing your search above and press return to search.

అమరీందర్ కు వర్కవుట్ కాలేదా ?

By:  Tupaki Desk   |   1 Oct 2021 9:11 AM GMT
అమరీందర్ కు వర్కవుట్ కాలేదా ?
X
పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కు వర్కవుట్ అయినట్లు లేదు. గడచిన మూడు నెలలుగా పంజాబ్ లో నెలకొన్న రాజకీయ పరిస్దితులు అందరికీ తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూతో అమరీందర్ తో ఉన్న వివాదాల కారణంగా ప్రభుత్వంలో, పార్టీలో చాలా గొడవలే జరుగుతున్నాయి. సిద్ధూ ర్యాగింగ్ ను తట్టుకోలేకపోయిన 76 ఏళ్ళ కెప్టెన్ వేరేదారి లేక చివరకు ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. రాజీనామా చేసిన దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకపోయినా సిద్ధూకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని మాత్రం బహిరంగంగానే ప్రతిజ్ఞ చేశారు.

వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సిద్ధూ ఎక్కడి నుంచి పోటీ చేసిన ఆయన ఓటమే ధ్యేయంగా పనిచేస్తానంటు శపథం చేశారు. దాంతో కెప్టెన్ రాజకీయ భవిష్యత్తుపై ఒక్కసారిగా ఊహాగానాలు మొదలైపోయాయి. ఈ నేపధ్యంలోనే ఢిల్లీకి చేరుకుని హోంశాఖ మంత్రి అమిత్ షా తో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. దాంతో కెప్టెన్ ఇక బీజేపీలో చేరడం లాంఛనమే అంటూ ప్రచారం హోరెత్తిపోయింది.

అయితే అదంతా కేవలం ప్రచారం మాత్రమే అని ఇప్పటికి తేలిపోయింది. ఇక్కడే అమిత్-కెప్టెన్ మధ్య చర్చల మధ్య ఏమి జరిగుంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీలో చేరడానికి కెప్టెన్ కీలకమైన రెండు షరతులు విధించినట్లు చెబుతున్నారు. అదేమిటంటే నూతన వ్యవసాయ చట్టాల్లో సవరణలు తెస్తే కమలం పార్టీలో చేరటానికి తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారట. అలాగే రాబోయే ఎన్నికల్లో బీజేపీ సారధ్యం తనకే అప్పగించాలని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించాలని షరతులు విధించారట.

పై మూడు షరతుల్లో వ్యవసాయ చట్టాల్లో సవరణలు ఏ రూపంలో చూసినా సాధ్యం కాదని అమిత్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎందుకంటే వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేయాలని స్వయంగా సుప్రీంకోర్టు చెబితేనే నరేంద్ర మోడీ వినలేదు. కొత్త వ్యవసాయ చట్టాల అమలు పంజాబ్ లో పార్టీకి ఇబ్బందులు తెస్తుందని తెలిసినా మోడి పట్టించుకోలేదు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే షరతు పైన కూడా అమిత్ అంతగా సానుకూలంగా స్పందించలేదని సమాచారం.

సో కెప్టెన్ పెట్టిన షరతులు వర్కవుటైనట్లు లేదు. అందుకనే తాను బీజేపీలో చేరటం లేదని కెప్టెనే స్వయంగా ప్రకటించారు. ఇంతకుముందు కూడా తాను బీజేపీలో చేరబోతున్నట్లు కెప్టెన్ ఏమీ ప్రకటించలేదు. కానీ కాంగ్రెస్ లో తనకు అవమానం జరిగిందని భావించిన అమరీందర్ హఠాత్తుగా అమిత్ షా తో భేటీ అయ్యారంటేనే అందరికీ అర్ధమైపోయింది. ఒకపార్టీలో ఇమడలేకపోతే మరో పార్టీలో చేరటం నేతలకు మామూలే. కాబట్టే కెప్టెన్ కూడా బీజేపీలో చేరబోతున్నట్లు సంకేతాలు వచ్చాయి. అయితే చివరకు కెప్టెన్ ప్రయత్నాలు వర్కవుట్ కాలేదని అర్ధమవుతోంది.