Begin typing your search above and press return to search.

కొత్త ఫిట్టింగ్ మొదలుపెట్టిన అమరీందర్

By:  Tupaki Desk   |   23 Sep 2021 5:53 AM GMT
కొత్త ఫిట్టింగ్ మొదలుపెట్టిన అమరీందర్
X
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త ఫిట్టింగ్ మొదలుపెట్టారు. తాజాగా ఓ సమావేశంలో మాట్లాడుతు పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూను ఎట్టి పరిస్ధితుల్లోను సీఎంను కానిచ్చేది లేదని భీషణ ప్రతిజ్ఞ చేశారు. సిద్ధూ పోటీచేసే నియోజకవర్గంలో గట్టి ప్రత్యర్ధిని పోటీలోకి దింపబోతున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. అమరీందర్ చేసిన ఈ ప్రకటన పంజాబ్ కాంగ్రెస్ లో సంచలనంగా మారింది. వచ్చే ఏడాది మార్చిలో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.

అమరీందర్ తో మొదలైన గొడవల కారణంగా సిద్ధూ నానా కంపుచేశారు. ఒక విధంగా కాలేజీలో సీనియర్ విద్యార్ధులు జూనియర్లను ర్యాగింగ్ చేసినట్లే సిద్ధూ మాజీసీఎం అమరీందర్ ను ర్యాగింగ్ చేసేశారు. కాకపోతే జూనియర్ అయిన సిద్ధూ ఎంతో సీనియర్ అయిన అమరీందర్ ను ర్యాగింగ్ చేయటమే విచిత్రంగా ఉంది. సిద్ధూ కారణంగానే అమరీందర్ సీఎం పదవికి రాజీనామా చేసి చివరకు మాజీ అయిపోయారు. దాంతో సిద్ధూపై కెప్టెన్ బాగా మండిపోతున్నారు.

బహుశా కాంగ్రెస్ లో కంటిన్యు అయ్యే ఉద్దేశ్యం కెప్టెన్లో ఉన్నట్లు లేదు. శిరోమణి అకాలీదళ్ లోనో లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లోనో చేరినా ఆశ్చర్యంలేదు. లేకపోతే కాంగ్రెస్ లోనే కంటిన్యు అయ్యే ఉద్దేశ్యం ఉంటే సిద్ధూపై బలమైన అభ్యర్ధిని పోటీలోకి దింపబోతున్నట్లు చెప్పరు. ఎందుకంటే సిద్ధూపై ఎవరు పోటీచేయాలనేది ప్రత్యర్ధిపార్టీల ఇష్టం. అంటే పైన చెప్పుకున్నట్లు ఏదో పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ నుండి అమరీందర్ కు ఆహ్వానాలున్నాయి.

ఇదే సమయంలో రాహూల్, ప్రియాంకల పైన కూడా కెప్టెన్ అనుభవంలేని నేతలంటు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ లోనే కంటిన్యు అయ్యే ఉద్దేశ్యం ఉంటే వాళ్ళిద్దరిపైన నోరు పారేసుకునే వారే కాదు. ఎలాగూ వ్యతిరేకమైపోయారు కాబట్టి సిద్ధూ పై కెప్టెన్ నిప్పులు చెరిగారు. మొత్తంమీద వాళ్ళద్దరి మధ్య జరుగుతున్న గొడవల్లో ఇద్దరు బాగానే ఉండచ్చు కానీ మధ్యలో నష్టపోయేది మాత్రం కాంగ్రెస్ పార్టీనే అన్నది వాస్తవం. వీళ్ళద్దరి మధ్య గనుక చక్కటి సమన్వయం ఉండివుంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కాంగ్రెస్ కు ఎక్కువుండేది.

కానీ ఇద్దరి గొడవల మధ్య కాంగ్రెస్ పార్టీ జనాల్లో బాగా పలుచనైపోయింది. అమరీందర్ గనుక కాంగ్రెస్ ను వదిలేసి ప్రతిపక్షపార్టీల్లో చేరితే అంతే సంగతులు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చేస్తే తానొక్కడే రాడు. తన వర్గం మొత్తాన్ని పార్టీలో నుండి బయటకు తెచ్చేస్తాడన్నది వాస్తవం. అప్పుడు శిరోమణి అకాలీదళ్ కానీ లేకపోతే ఆప్ కానీ ఒక్కసారిగా బలోపేతమైపోతుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే కెప్టెన్ ఆప్ లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం కారణంగా కెప్టెన్ బీజేపీలో చేరే అవకాశాలు లేవు. అలాగే ఎన్డీఏలో ఇంకా పార్టనర్ గా ఉన్న కారణంగా అకాలీదళ్ లో కూడా చేరే అవకాశాలు తక్కువే. ఇక మిగిలింది ఒక్క ఆప్ మాత్రమే. పైగా అధికారంలోకి వచ్చేందుకు ఆప్ కు కూడా అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఎలాగూ ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు జనాల్లో మంచి క్లీన్ ఇమేజి ఉంది. కాబట్టి కెప్టెన్ గనుక ఆప్ లో చేరి సీఎం అభ్యర్ధిగా ఫోకస్ అయితే కాంగ్రెస్ కు కష్టకాలం మొదలైనట్లే అనుకోవాలి.