Begin typing your search above and press return to search.

జగన్ ఏసుక్రీస్తు మీద అలా ప్రమాణం చేస్తారా?

By:  Tupaki Desk   |   17 Jun 2016 5:05 AM GMT
జగన్ ఏసుక్రీస్తు మీద అలా ప్రమాణం చేస్తారా?
X
‘‘ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20.. 30 కోట్లు పెట్టి చంద్రబాబు నిస్సిగ్గుగా కొనేస్తున్నారు’’ లాంటి మాటలు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి తరచూ వింటుంటాం. దీనికి బలమైన కౌంటర్ ఇచ్చిన తెలుగు తమ్ముడు ఇప్పటివరకూ లేరనే చెప్పాలి. ఆ కొరతను తీరుస్తూ.. తాజాగా సైకిల్ ఎక్కి.. పచ్చ కండువాను మెడలో వేసుకున్న వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి (చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి. డబ్బులు తీసుకొని పార్టీలో చేరినట్లుగా జగన్ పత్రిక సాక్షిలో రాశారన్న ఆయన.. పార్టీ మారిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఘాటుగా ఉండటమేకాదు.. జగన్ ను ఇబ్బంది పెట్టేవిగా ఉండటం గమనార్హం.

తాను డబ్బులు తీసుకొని పార్టీ మారినట్లుగా రాసిన వార్తల మీద స్పందించిన అమర్ నాథ్ రెడ్డి జగన్ మీద ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. తాను డబ్బు తీసుకొని పార్టీ మారినట్లుగా రాసిన వార్తలకు జగనే సమాధానం చెప్పాలన్న అమర్ నాథ్.. తనకున్నది ఒక్కడే బిడ్డ అని డబ్బు తీసుకోలేదని వాడి మీద ప్రమాణం చేసి చెబుతానని చెప్పిన ఆయన జగన్ కు భారీ సవాలునే విసిరారు. ‘‘నేను ప్రమాణం చేసి చెబుతా. మరి.. జగన్ కు ఏసుక్రీస్తు పైన నమ్మకం ఉంటే నేను డబ్బులు తీసుకున్నానని క్రీస్తు దగ్గర తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పమనండి’’ అని అన్నారు.

ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన సవాళ్లతో పోలిస్తే.. ఈ సవాలు కాస్త భిన్నమైనదని చెప్పాలి. ఓ పక్క ఘాటైన సవాలు విసురుతూనే.. జగన్ ఉక్కిరిబిక్కిరి అయ్యే మరికొన్ని వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి రావటం గమనార్హం. తాను డబ్బులు తీసుకొని పార్టీ మారినట్లుగా చెబుతున్న జగన్ పత్రిక చేసిన ఆరోపణల్ని ఖండిస్తూనే.. డబ్బులు తీసుకున్న విధానాన్ని బయటపెట్టాలన్నారు.

రెండున్నరేళ్ల క్రితం టీడీపీ నేతలతో ఉన్న విబేదాలతో తాను పార్టీ మారానని.. మరి.. ఆ రోజుజగన్ తనను ఎంతిచ్చి కొన్నారో చెప్పాలన్నారు. ‘ఆ రోజు ఎమ్మెల్యేగానే వెళ్లాను. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగానే బయటకు వస్తున్నా. నేనీ రోజు రాజీనామా చేసి తిరిగి పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నా. జగన్ కు దమ్మూధైర్యం ఉంటే పోటీకి ముందుకు రావాలి. నేను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకుంటా. ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే.. పార్టీని పూర్తిగా మూసివేస్తావా?’’ అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి విలువ తెలియాలంటే.. ఆ మనిషి దగ్గర లేనప్పుడే ఆ విలువ తెలుస్తుందని.. చంద్రబాబుకు దూరం అయ్యాకే ఆయన విలువ తనకు తెలిసిందంటూ బాబు మనసులో తన ప్రింట్ పడే మాటను చెప్పారు. అమర్ నాథ్ రెడ్డి చేసిన సవాళ్లకు జగన్ పార్టీ నుంచి రియాక్షన్ ఉంటుందా?