Begin typing your search above and press return to search.

ములాయంకు షాక్‌.. బీజేపీలోకి అమ‌ర్‌సింగ్‌

By:  Tupaki Desk   |   13 Feb 2017 6:08 AM GMT
ములాయంకు షాక్‌.. బీజేపీలోకి అమ‌ర్‌సింగ్‌
X
కుటుంబ క‌ల‌హాల‌తో కుదేలయిపోయి ఇటీవ‌ల చ‌క్క‌బ‌డ్డ స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాద‌వ్‌కు మ‌రో అనూహ్య షాక్ త‌గిలింది. ఆయ‌న ఆప్త‌మిత్రుడు, సమాజ్‌వాది పార్టీ నేత అమర్‌ సింగ్ బీజేపీలో చేర‌నున్నారు. త్వరలోనే కాషాయ‌కండువా క‌ప్పుకోనునున్నట్లు ప‌రోక్షంగా అమ‌ర్ సింగ్ ప్ర‌క‌టించారు. ఓ టీవీ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో అమర్ సింగ్ మాట్లాడుతూ బీజేపీలో చేరాలని నేను ఇంకా నిర్ణయించుకోలేదు. అయితే బీజేపీలో చేరే ఆలోచనలు లేవనీ చెప్పలేను అని తెలిపారు. మోడీ ఆరెస్సెస్‌ ప్రచారక్‌ అయినప్పటికీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారన్నారు. ఆయన బీజేపీకి ప్రధాని కాదని, దేశానికని అమర్‌ తెలిపారు.

మోడీకి కుటుంబం, సంతానమూ లేదని, రాజ వంశం కోసం ఆయన రాజకీయాలు చేయడం లేదని సింగ్‌ పేర్కొన్నారు. తనకు కూడా రాజకీయంగా రాజవంశం లేదన్నారు. తనకు మోడీ ఎంతో ములాయం కూడా అంతేనన్నారు. ఇద్దరికీ ఒకే విధమైన గౌరవం ఇస్తానన్నారు. కాగా, యూపీ సీఎం అఖిలేష్ యాద‌వ్ తన తండ్రి స‌హ‌చ‌రుడు అయిన అమ‌ర్ సింగ్‌తో తీవ్రంగా విబేధిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో క‌ల‌త చెందిన అమ‌ర్‌సింగ్ పార్టీ కార్య‌క్ర‌మాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయ‌న బీజేపీలో చేరడంపై క్లారిటీ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయాల్లో తల పండిన నాయకులు దూరంగా ఉన్నారు. అధికార సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), దాని మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు కూడా దానికి ఒక కారణం. తొలిదశ పోలింగ్ ప్రక్రియ ముగిసిపోగా, మలిదశ పోలింగ్ జరిగే అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సోమవారంతో ప్రచారానికి తెర పడనుంది. పార్టీలో ఆధిపత్య పోరులో ఎస్పీ అధ్యక్షుడిగా సీఎం అఖిలేశ్ ఎన్నికవ్వడంతో ఖిన్నుడైన పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్, అనారోగ్యంతో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. అఖిలేశ్ బాబాయ్ శివ్‌పాల్ కూడా ఎటాలో తాను పోటీచేస్తున్న జస్వంత్ నగర్ సెగ్మెంట్‌కే పరిమితం అయ్యారు. ఇంతకుముందు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ఒక్క సభలోనూ కనిపించలేదు. గత ఎన్నికల్లో ప్రచారంచేసిన బాలీవుడ్ సినీనటుడు, ఎంపీ శత్రఘ్న సిన్హా ప్రచారానికి దూరంగానే ఉన్నారు. అత్రౌలి నుంచి తన మనుమడు సందీప్ సింగ్ పోటీలో ఉన్నా రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ కూడా ప్రచారంలోకి దిగలేదు. బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి కూడా ఎన్నికలకు దూరంగానే ఉన్నారు.