Begin typing your search above and press return to search.

ఆ నోబుల్ మేధావి తప్పు పట్టారు

By:  Tupaki Desk   |   27 Nov 2016 9:30 AM GMT
ఆ నోబుల్ మేధావి తప్పు పట్టారు
X
అదేం సిత్రమో అస్సలు అర్థం కాదు. సామాన్యులకు నచ్చిందేదీ..మేధావులకు నచ్చనట్లుగా ఉంటుంది. ఏదైనా విషయం మీద సామాన్యుల ఆలోచనలు ఒకలా.. మేధావుల ఆలోచనలు మరోలా ఉంటాయి. మేధావులన్నాక ఆ మాత్రం తేడా ఉండటంలో తప్పు లేదేమో. కానీ.. మేధావుల్లో వీర మేధావులు వేరయా? అన్నట్లుగా ఉంది నోబుల్ అవార్డు గ్రహీత అమర్త్య సేన్ వ్యాఖ్యలు చూస్తే.

మేధోతనంలో మొనగాడిగా అభివర్ణించే ఈ భారత మూలాలు ఉన్న నోబుల్ విన్నర్ కు.. మోడీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం ఏ మాత్రం నచ్చలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దేశానికి పదేళ్లుగా ప్రధానమంత్రిగా పని చేసిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ లాంటి వాళ్లు సైతం.. పెద్దనోట్ల రద్దును తప్పు పట్టకపోవటం మర్చిపోకూడదు. తాను రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించటం లేదని.. రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు.. కరెన్సీ కొరతతో ప్రజలు పడుతున్న కష్టాల్ని మాత్రమే తాను పరిగణలోకి తీసుకొని మాట్లాడుతున్నట్లుగా మొన్న రాజ్యసభలో ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించటాన్ని మర్చిపోకూడదు.

మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తే నోట్ల రద్దు తప్పు కాదని తేల్చేసిన తర్వాత.. ఎంత మొనగాడు లాంటి మేధావి చెప్పేది అయినా వినాల్సిన అవసరం లేదనే చెప్పాలి. నోబుల్ బహుమతి రావొచ్చు కానీ.. భారతదేశం.. ఇక్కడి ప్రజలు.. ఇక్కడి పరిస్థితులు గురించి అమర్త్యసేన్ కు అవగాహన ఉన్నప్పటికీ.. మన్మోహన్ సింగ్ తో పోలిస్తే మాత్రం తక్కువనే చెప్పాలి. రద్దుపై తాజాగా అమర్త్య సేన్మోడీ తీరును విమర్శించారు. దేశంలో నివసించే ప్రతిఒక్కరి దగ్గర నల్లధనం ఉందని మోడీ ప్రభుత్వం అనుమానిస్తుందంటూ మండిపడ్డ ఆయన.. నోట్ల రద్దు కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారనిచెప్పారు.

ఒక ప్రముఖ ఇంగ్లిషు మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. రద్దు నిర్ణయంతో నల్లధనాన్ని వెనక్కి తీసుకురావటం సాధ్యం కాదని.. ఈ నిర్ణయం అలాంటి వాటికి ఏ మాత్రం సాయం చేయదన్నారు. తాజా చర్యతో ప్రజల్ని హటాత్తుగా సమస్యల్లోకి నెట్టినట్లు అవుతుందని వ్యాఖ్యానించిన అమర్త్యసేన్.. భారత్ లో ఉన్న వారంతా నిజాయితీ లేనివారుగా మోడీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని.. ఇది సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. ఇన్ని మాటలు చెప్పిన పెద్దమనిషి.. నల్లధనాన్ని అరికట్టటం కోసం ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల గురించి.. సలహాలు.. సూచనలు ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు మాత్రంసమాధానం దొరకదు. తప్పులు ఎత్తి చూపే వారంతా.. ఆ తప్పులకు పరిష్కారాలు చూపిస్తే బాగుంటుంది. ఆ పని చేస్తే అసలు సమస్యే ఉండదు కదా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/