Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆశలకు 'అమెజాన్ - ఫ్లిప్ కార్ట్' బ్రేకులు

By:  Tupaki Desk   |   7 Oct 2015 5:29 AM GMT
కేసీఆర్ ఆశలకు అమెజాన్ - ఫ్లిప్ కార్ట్ బ్రేకులు
X
వెనుకా ముందు చూసుకోకుండా నిర్ణయాలు ప్రకటించటం.. ఎదురు దెబ్బలు తగిలించుకోవటం కేసీఆర్ సర్కారుకు మామూలే. హడావుడి నిర్ణయాలతో ఓ పక్క న్యాయస్థానాల నుంచి అక్షింతలు వేయించుకున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి.

కేసీఆర్ సర్కారు చేతిలో అధికారం ఉండొచ్చు కానీ.. చట్టపరమైన రక్షణ అందరి​కీ ఉంటుందని.. ప్రభుత్వానికి విశేష అధికారాలు ఉన్నా.. వ్యవస్థలో అందరి​కీ హక్కులుంటాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ​ఆ​న్ లైన్ సంస్థలు తెలంగాణ సర్కారు ఆశలకు బ్రేకులు వేశాయి. పెరిగిన ఆన్ లైన్ జోరుతో.. తాము విపరీతమైన ఆదాయాన్ని కోల్పోతున్నామని గ్రహించిన తెలంగాణ సర్కారు.. ఆన్ లైన్ అమ్మకాలకు సంబంధించి తమకు పన్నులు కట్టాలంటూ నోటీసులు జారీ చేసింది.

తమ రాష్ట్రంలో భారీగా అమ్మకాలు సాగిస్తున్న ఆన్ లైన్ సంస్థలు.. తమకు పన్నులు కట్టాలన్న మాటను చెబుతూ.. ప్రముఖ ఆన్ లైన్ సంస్థలు అ​మెజాన్.. ప్లిప్ కార్ట్ లాంటి సంస్థలకు ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆన్ లైన్ సంస్థలు జరిపే అమ్మకాలపై పన్నులు వేస్తే.. భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది తెలంగాణ సర్కారు భావన. అయితే.. కేసీఆర్ సర్కారు ఆశల మీద నీళ్లు జల్లుతూ.. సదరు ఆన్ లైన్ సంస్థలు తాజాగా బదులిచ్చాయి. చట్టంలోని నిబంధనల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని.. అమ్మకాలు జరిపే ఏ రాష్ట్రంలోనూ తాము పన్నులు చెల్లించటం లేదని.. బిల్లు తయారైన రాష్ట్రంలో తాము పన్నులు చెల్లిస్తున్నందున.. తెలంగాణలో జరిపే అమ్మకాలకు ప్రత్యేకంగా పన్ను కట్టాల్సిన అవసరం లేదని తేల్చి​ చెప్పాయి​.

ఇంకాస్త వివరంగా చెప్పాలంటే.. ఆన్ లైన్ సంస్థ రిజిష్టర్ కార్యాలయం ఢిల్లీలో ఉందని అనుకుందాం. సదరు సంస్థ.. తన బిల్లులు మొత్తం ఢిల్లీ కేంద్రంగానే జనరేట్ చేస్తుంది. అంటే.. ఢిల్లీలో ఉన్న ఈ సంస్థ దేశ వ్యాప్తంగా తనకున్న నెట్ వర్క్ ద్వారా అమ్మకాలు సాగిస్తోంది. అంటే.. ఢిల్లీలో ఉన్న సంస్థ దగ్గర వ​స్తువు​ కొంటే.. ఆ అమ్మకం ఢిల్లీ పరిధిలోకి వస్తుందే తప్పించి.. హైదరాబాద్ లోని కొన్నట్లుగా రాదు. మరికాస్త అర్థమయ్యే పాపులర్ భాషలో చెప్పాలంటే.. ఒక హైదరాబాదీ ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ వస్తువు కొన్నాడు. దాన్ని తీసుకొని హైదరాబాద్ వచ్చాడు. ఢిల్లీలో కొనుగోలు చేసిన వస్తువుకు హైదరాబాద్ లో సదరు సంస్థ దగ్గర పన్ను వసూలు చేయటం సాధ్యం కాదు కదా. ఎందుకంటే.. సదరు సంస్థ అమ్మిన వస్తువు ఢిల్లీలో అన్న విషయం మర్చిపోకూడదు. ఇదే రీతిలో.. ఆన్ లైన్ లో ఏ ప్రాంతానికి చెందిన వారు ఆర్డర్ బుక్ చేసినా.. సదరు సంస్థ ఎక్కడ రిజిష్టర్ చేసుకొని ఉంటే.. ఆ రాష్ట్రంలో కొనుగోళ్లు జరిపినట్లు అవుతుంది. దాని డెలివరీ..సదరు వినియోగదారుడి ప్రాంతానికి చేరుస్తారు.

అందుకే.. తాము రిజిష్టర్ అయిన రాష్ట్రంలో తాము చేసే అమ్మకాలకు పన్ను చెల్లిస్తున్న నేపథ్యంలో.. కొత్తగా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆన్ లైన్ సంస్థలు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ఆన్ లైన్ సంస్థలపై పన్నులు వేయటం ద్వారా.. భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న కల.. తాజాగా సదరు సంస్థలు ఇచ్చిన సమాధానంతో కల్లలైందని చెప్పొచ్చు.