Begin typing your search above and press return to search.

అమెజాన్ అధినేత చేసిన రిస్కు ఆలోచిస్తే.. చెమటలు పట్టాల్సిందే

By:  Tupaki Desk   |   21 July 2021 5:48 AM GMT
అమెజాన్ అధినేత చేసిన రిస్కు ఆలోచిస్తే.. చెమటలు పట్టాల్సిందే
X
ప్రపంచంలో అత్యంత సంపన్నుడు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్. అతగాడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తిరుగులేని వ్యాపారవేత్తగా.. ప్రత్యర్థులకు తన వ్యూహాలతో మింగుడుపడని రీతిలో వ్యవహరించే అతగాడిలో అతి పెద్ద సాహసికుడు ఉన్నాడు. ఎందుకంటే లక్షల కోట్ల ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తి.. తన కోరికను తీర్చుకోవటం కోసం లైఫ్ రిస్కు పెట్టుకోవటం అంత మామూలు విషయం కాదు. అతడి మీద లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఆధారపడి ఉండటమే కాదు.. చిన్న తేడా చోటు చేసుకుంటే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అయినప్పటికీ ఆయన వాటిని లెక్క చేయకుండా వ్యవహరించిన తీరును చూశాక.. అతనని అసలుసిసలు జేమ్స్ బాండ్ అంటే తప్పేముంది?

కాసిన్ని డబ్బులు జేబులోకి.. బ్యాంకు అకౌంట్లోకి చేరిన తర్వాత నుంచి వచ్చే మార్పులు అన్ని ఇన్ని కావు. మొదట్లో పెద్దగా పట్టని చాలామందికి ఆర్థికంగా స్థిరపడిన తర్వాత చాలానే మార్పులు చోటు చేసుకుంటాయి. అల్లరిచిల్లరగా.. ఇష్టారాజ్యంగా తిరిగే ఆకు రౌడీలాంటివాడు సైతం.. ఆర్థికంగా బలపడిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవటం మొదలు పెడతారు. వేసే ప్రతి అడుగులోనే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయన్నది ఆలోచిస్తుంటారు. అలాంటిది.. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం.. అంతకు మించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా వెలిగిపోయే అపర కుబేరుడు.. అంతరిక్ష యానానికి వెళ్లేందుకు సిద్ధం కావటం మాటలు కాదు కదా?

అంతరిక్ష యాత్ర ఇప్పటికి ఒక ప్రసవ వేదనగా చెప్పాలి. ఎంత అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. చిన్న సాంకేతిక లోపం ఊహించలేని భారీ నష్టానికి కారణం కావటమే కాదు.. ప్రాణానికి ప్రమాదంగా మారుతుంది. మిగిలిన యాత్రలకు.. అంతరిక్ష యాత్రకు ఉండే పెద్ద తేడా అది. నూటికి నూరుపాళ్లు సేఫ్ గా తిరిగి వచ్చే వీలు ఉన్నప్పటికి.. ఏదో తెలియని సందేహం.. టెన్షన్ వెంటాడుతుంటుంది. అంతరిక్ష యాత్రను వీక్షించే వారికే ఇంతటి భావోద్వేగం ఉంటే.. స్వయంగా యాత్ర చేసే వారి మానసిక పరిస్థితి మరెలా ఉంటుంది.

అంతా బాగున్నప్పుడు ఆహా.. ఓహో అనేటోళ్లు.. కాస్త తేడా కొడితే ఈ వయసులో అనవసరమైన సాహసాలు అవసరమా? అని తిట్టేయటం ఖాయం. మాటల సంగతి పక్కన పెట్టేయొచ్చు. కానీ.. జరగరానిది ఏమైనా జరిగితే? ఊహే.. ఒళ్లు జలదరించేలా ఉన్నప్పుడు.. దాన్ని స్వయంగా అనుభవించే వారి పరిస్థితి మరెలా ఉంటుంది? ఇదంతా చూసినప్పుడు అంతరిక్ష యానాన్ని చేయటం ద్వారా అమెజాన్ అధినేత చేసిన రిస్కు.. రీల్ లైఫ్ లో జేమ్స్ బాండ్ చేసే దానికి ఏ మాత్రం తీసిపోదని చెప్పక తప్పదు.