Begin typing your search above and press return to search.

ప్ర‌పంచ సంప‌న్నుడు మారాడోచ్‌

By:  Tupaki Desk   |   2 March 2018 7:08 AM GMT
ప్ర‌పంచ సంప‌న్నుడు మారాడోచ్‌
X
ఏడాదికి ఏడాది సంప‌న్నుల లెక్క‌ల‌కు సంబంధించిన వివ‌రాలు వ‌చ్చేస్తుంటాయి. తాజాగా అలాంటి నివేదిక ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. హురున్ గ్లోబ‌ల్ రిచ్ లిస్ట్ 2018 వివ‌రాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. ప్ర‌పంచ సంప‌న్నుడి హోదాలోకి కొత్త ముఖం వ‌చ్చేసింది. దేశీయంగా చూస్తే.. భారీగా సంపాదిస్తున్న వారు.. కోట్లాది రూపాయిల్ని పోగేస్తున్న కొత్త ముఖాలు వ‌చ్చేశాయి.

తాజాగా విడుద‌లైన నివేదిక ప్ర‌కారం చైనా.. అమెరికా త‌ర్వాత దేశంలోనే ఎక్కువ‌మంది సంప‌న్నులు ఉన్న‌ట్లుగా తేలింది. దేశంలో 100 కోట్ల డాల‌ర్లు అంత‌కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వారి సంఖ్య 131 కాగా.. గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది అద‌నంగా 31 మంది కొత్త‌గా లిస్ట్ లో చేరారు.

స్టాక్ మార్కెట్లో కొన‌సాగిన బూమ్ కార‌ణంగా కొత్త కోటీశ్వ‌రులు వ‌చ్చేసిన‌ట్లుగా నివేదిక తేల్చింది. భార‌త్ లో అత్యంత సంప‌న్నుడిగా ముకేశ్ అంబానీ మ‌రోసారి నిలిచారు. సుమారు రూ.2.92 ల‌క్ష‌ల కోట్ల ఆస్తుల‌తో ఆయ‌న దేశంలోనే అత్యంత ఆస్తిప‌రుడుగా నిలిచారు. ఆయ‌న త‌ర్వాత గౌత‌మ్ ఆదానీ సుమారు రూ.91వేల కోట్ల‌తో రెండో స్థానంలో నిలిచారు. ఏడాదిలో అంబానీ ఆస్తుల విలువ 73 శాతం పెరిగితే.. అదానీల ఆస్తుల విలువ 109 శాతం పెర‌గ‌టం గ‌మ‌నార్హం.

దేశంలో అత్యంత సంప‌న్నుడైన ముకేశ్ అంబానీ ప్రపంచ సంప‌న్నుల్లో 19 స్థానంలో నిలిచారు. అదే స‌మ‌యంలో అదానీ 98వ స్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే దేశంలో బిలీయ‌నీర్ల సంఖ్య పెరుగుతోంది. ప్ర‌వాస భార‌తీయుల‌తో క‌లుపుకుంటే దాదాపు భార‌త బిలియ‌నీర్ల సంఖ్య ఏకంగా 170కు చేరుకోవ‌టం విశేషం.

అంబానీ త‌ర్వాత రెండో అత్యంత సంప‌న్నుడిగా ఎన్ ఆర్ ఐ ల‌క్ష్మీ మిట్ట‌ల్ నిలిచారు. ఇక‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే 123 బిలియ‌న్ డాల‌ర్ల ఆస్తుల‌తో ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్నుడిగా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ నిలిచారు. ఆయ‌న‌ త‌ర్వాతి స్థానంలో వారెన్ బ‌ఫెట్ నిలిచారు. మూడో స్థానంలో మైక్రోసాఫ్ట్ అధినేత గేట్స్ నిలిచారు. ఇక‌.. నాలుగో స్థానంలో ఫేస్ బుక్ అధినేత నిలిచారు.

ఇక‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో 68 దేశాల్లో 100 కోట్ల డాల‌ర్ల కంటే ఎక్కువ సంప‌ద ఉన్న వారు ఏకంగా 2694 మంది ఉన్న‌ట్లుగా తేల్చారు.వీరి ద‌గ్గ‌ర మొత్తం రూ.682.5ల‌క్ష‌ల కోట్లు ఉన్న‌ట్లు లెక్క క‌ట్టారు. ప్ర‌పంచ జీడీపీలో ఇది 13.2 శాతానికి స‌మానం. ఏడాదికాలంలో కుబేరుల సంప‌ద విలువ 31 శాతం పెర‌గ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌పంచంలో న్న బిలియ‌నీర్ల‌లో 819 మంది క‌మ్యూనిస్ట్ చైనాలో ఉంటే.. అమెరికాలో మాత్రం కేవ‌లం 371 మంది మాత్ర‌మే ఉండ‌టం విశేషం. ఇక‌.. ఇండియాలో 131 మంది అయ్యారు. పేరుకుక‌మ్యూనిస్ట్ దేశ‌మే అయినా ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల్ని చైనా ప్ర‌భుత్వం ప్రోత్స‌హించ‌టంతో ఈ స్థాయిలో కుబేరులుగా అవ‌త‌రించారు.