Begin typing your search above and press return to search.

వారంలో రూ.2.62ల‌క్ష‌ల కోట్ల విడాకుల డీల్ క్లోజ్!

By:  Tupaki Desk   |   3 July 2019 5:06 AM GMT
వారంలో రూ.2.62ల‌క్ష‌ల కోట్ల విడాకుల డీల్ క్లోజ్!
X
భార్య‌కు విడాకులు ఇచ్చేందుకు భ‌ర‌ణం కోసం భ‌ర్త ఇస్తున్న మొత్తం అక్ష‌రాల రూ.2.62ల‌క్ష‌ల కోట్లు ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన విడాకులుగా మిగిలిపోనున్న ఈ వ్య‌వ‌హారం ఈ వారంలోనే దాదాపుగా పూర్తి కానుంది. ప్ర‌పంచ కుబేరుడు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ త‌న భార్య‌తో కుదుర్చుకున్న విడాకుల ఒప్పందం ఈ వారంలోనే పూర్తి కానుంది.

అమెజాన్ ప్రారంభం కావ‌టానికి ముందే అంటే 1993లోనే మెక్ కెంజీతో బెజోస్ వివాహ‌మైంది. వీరికి న‌లుగురు పిల్ల‌లు ఉన్నారు. 55 ఏళ్ల అమెజాన్ చీఫ్ మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం ఉన్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చినంత‌నే 49 ఏళ్ల మెక్ కెంజీ ఊరుకోలేదు.

భ‌ర్త‌తో విడిపోయేందుకు సిద్ధ‌మ‌య్యారు. అమెజాన్ అధినేత స‌తీమ‌ణిగా ఉన్న‌ప్ప‌టికీ స్వ‌త‌హాగా రైట‌ర్ అయిన ఆమె.. తాను విడిగా ఉండ‌టానికే సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రి మ‌ధ్య విడాకుల డీల్ రూ.2.62ల‌క్ష‌ల కోట్లుగా నిర్ణ‌యించారు. ఇందుకు ఇరువురు ఇష్ట‌ప‌డ్డారు. తాజా డీల్ నేప‌థ్యంలో అమెజాన్ లో ఉన్న ఉమ్మ‌డి షేర్ల‌లో 25 శాతం మెక్ కెంజీకి ద‌క్క‌నున్నాయి. విడాకుల అనంత‌రం ఆమె ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతురాలైన మ‌హిళ‌గా అవ‌త‌రించ‌నున్నారు.

విడాకుల ఒప్పందంలో భాగంగా భార్య‌కు రూ.2.62ల‌క్ష‌ల కోట్ల భ‌ర‌ణాన్ని ఇచ్చిన త‌ర్వాత కూడా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ప్ర‌పంచంలో నెంబ‌ర్ వ‌న్ సంప‌న్నుడిగానే కొన‌సాగ‌నున్నారు. విడాకుల‌కు సంబంధించిన ఒప్పందం గ‌తంలోనే కుదిరినా.. ఈ వారంలో దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు పూర్తి కానున్న‌ట్లు చెబుతున్నారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. త‌న భ‌ర్త ద్వారా భ‌ర‌ణం రూపంలో వ‌స్తున్న భారీ మొత్తంలో యాభై శాతాన్ని వారెన్ బ‌ఫెట్.. బిల్ గేట్స్ స్థాపించిన ది గివింగ్ ఫ్లెడ్జ్ అనే ఎన్జీవోకు ఇచ్చేయ‌నున్నారు. చ‌రిత్ర‌లో నిలిచిపోయే విడాకుల డీల్ గా ఈ వ్య‌వ‌హారాన్ని ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు.