Begin typing your search above and press return to search.

అమెజాన్ య‌జ‌మానికి అదిరిపోయే షాకిస్తున్న మ‌న వ్యాపారులు

By:  Tupaki Desk   |   17 Jan 2020 1:30 AM GMT
అమెజాన్ య‌జ‌మానికి అదిరిపోయే షాకిస్తున్న మ‌న వ్యాపారులు
X
ఒకప్పుడు సంప్రదాయ మార్కెట్‌ ను కలిగి ఉన్న భారత్‌ ను.. ఇప్పుడు ఆన్‌ లైన్‌ షాపింగ్‌ శాసిస్తోంది. స్మార్ట్‌ ఫోన్లు అందరికీ అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్‌ చౌకగా లభించడంతో అన్నీ ఆన్‌ లైన్‌ లోనే కొనేస్తున్నారు. ముఖ్యంగా ఆన్‌ లైన్‌ షాపింగ్‌ కు యువత అమితాసక్తిని ప్రదర్శిస్తోంది. ఫలితంగా లాభ‌ప‌డిన వాటిలో ప్ర‌ముఖ‌మైన సంస్థ‌గా `అమెజాన్` ను పేర్కొన‌వ‌చ్చు. అందుకే అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భారత్‌పై క‌న్నేశారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన అమెజాన్ సంభవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇండియాలో 1 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.7,100 కోట్లు పెట్టుబడులు పెడతానని ప్రకటించారు. అయితే, ఈ ప్ర‌క‌ట‌న‌పై ఆయ‌న‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది.

భారత్‌లో భారీ వృద్ధిని నమోదు చేసుకుంటున్న అమెజాన్‌ కు ఇటీవల పలు ట్రేడర్ల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.ఈ-కామర్స్‌ దిగ్గజమైన అమెజాన్ భారీ రాయితీలు ప్రకటించడం, అన్యాయమైన వ్యాపార పద్దతులను అవలంభిస్తున్నాయని విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ-కామర్స్‌ సంస్థల అగడాలను నియంత్రించడానికి గతేడాది కేంద్ర ప్రభుత్వం పలు నిబంధలను కఠిన తరంచేసింది. వీటిలో విదేశీ పెట్టుబడులు కూడా ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ తాజాగా బెజోస్ ఈ పెట్టుబ‌డుల ప్ర‌క‌ట‌న చేశారు. 2025 నాటికి 10 బిలియన్ డాలర్ల విలువ కలిగిన మేకిన్ ఇండియా ఉత్పత్తులను అమెజాన్ ఎగుమతి చేయ‌డం త‌మ లక్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు. తమ వ్యాపారాన్ని పెంచుకోవడంతో పాటు 5,50,000 మంది సెల్లర్స్‌ కు తమ ప్లాట్ ఫాం ద్వారా అవకాశం కల్పిస్తున్నామని అమెజాన్ య‌జ‌మాని ప్ర‌క‌టించారు.

అయితే, జెఫ్ బెజోస్ చేసిన ప్రకటనపై అఖిల భారత వర్తక వ్యాపారుల సమాఖ్య(CAIT) మండిపడింది. జెఫ్ బెజోస్ రాకను నిరసిస్తూ స‌మాఖ్య స‌భ్యులు జెఫ్ బెజోస్ గో బ్యాక్ అంటూ వివిధ ప్రాంతాల్లో నినాదాలు చేశారు. భారీ డిస్కౌంట్ల కారణంగా వినియోగదారులు ఆన్ లైన్ వైపు మొగ్గు చూపుతున్నారని - గత రెండేళ్లలో తమ అమ్మకాలు 15 శాతం కంటే ఎక్కువగా తగ్గాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉండ‌గా - ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఆమెజాన్‌ - ఫ్లిప్‌ కార్ట్‌ పై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా -(సీసీఐ) కన్నెర్ర చేసింది. వస్తు కొనుగోలుదారులకు అమెజాన్‌ - ఫ్లిప్‌ కార్ట్‌ అడ్డగోలుగా రాయితీలు ప్రకటించడంతోపాటు తమ వేదికల ద్వారా అమ్మకాలు జరుపుతున్న కొంతమంది వ్యాపారులతో కుమ్మక్కవుతున్నట్టు ఆరోపణలు రావడంతో ఆ రెండు సంస్థలపై దర్యాప్తునకు ఆదేశించింది. అమ్మకాల చట్టాన్ని ఉల్లంఘించినట్టు తేలితే అమెజాన్‌ - ఫ్లిప్‌ కార్ట్‌ పై కఠిన చర్యలు తప్పవని సీసీఐ హెచ్చరించింది. ఈ-కామర్స్‌ సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తూ ‘ఢిల్లీ వ్యాపార్‌ మహాసంఘ్‌' ఫిర్యాదు చేయడంతో సీసీఐ ఈ చర్య చేపట్టింది.