Begin typing your search above and press return to search.

గ్రేట్ ఇండియా ఫెస్టివ్ మాదిరే.. నాసాకు అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్

By:  Tupaki Desk   |   27 July 2021 3:30 PM GMT
గ్రేట్ ఇండియా ఫెస్టివ్ మాదిరే.. నాసాకు అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్
X
బిగ్ సేల్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్.. పేర్లు ఏమైతేనేం.. లక్ష్యం మాత్రం కొనిపించటమే. అన్ని మూసుకొని కూర్చున్నా.. కదిలించి మరీ కొనిపించే సత్తా అమెజాన్ సొంతం. భారీ ఆఫర్లు..కళ్లు చెదిరే డిసౌంట్లతో.. ఇప్పుడు కాకపోతే మరెప్పటికి సాధ్యం కాదేమోనని టెంప్టు చేసేలా ఆఫర్లు ఇవ్వటం.. అమెజాన్ అన్నది అలవాటు అయ్యే వరకు ఆఫర్లు ఇచ్చేయటం.. ఆ తర్వాత తన దగ్గర కొనటం అలవాటుగా మారి.. ఆ తర్వాత వ్యసనంగా మారేలా చేసే బిజినెస్ టెక్నిక్ అమెజాన్ సొంతం. మరి.. ఇలాంటి సంస్థ అంతరిక్ష వ్యాపారంలోకి వెళితే? కిరాణ సరుకులైనా.. అంతరిక్ష ప్రయోగమైనా.. బెజోస్ వరకు రెండూ ఒకటి. వస్తువును అమ్మటం.. ప్రత్యర్థులు ఎవరూ తన దరికి చేరకుండా చూసుకోవటం.. వీలైనంత వరకు వారి వ్యాపారాల్ని నాశనం చేసే వరకు నిద్రపోకపోవటం లాంటి ఎత్తులు అమెజాన్ అధిపతి అమ్ముల పొదిలో చాలానే అస్త్రాలు ఉంటాయి.

ఈ మధ్యనే అంతరిక్షంలోకి వెళ్లి.. పది నిమిషాల పదకొండు సెకన్లు గడపటం ద్వారా.. తన కలను సాకారం చేసుకోవటమే కాదు.. అంతరిక్ష వ్యాపారంలోకి అమెజాన్ సంస్థ (అదేనండి బ్లూ ఆరిజన్)ను తిరుగులేని బ్రాండ్ గా చేయటమే లక్ష్యమని చెప్పాలి. ఒకసారి తన కన్ను పడిన తర్వాత.. దాన్ని సొంతం చేసుకోవటం అలవాటు. అందుకోసం ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తారు. తాజాగా నాసా విషయంలో అలాంటి ఎత్తుగడకే తెర తీశారు. 2024లో చంద్రుడి పైకి మానవసహిత యాత్రకు అవసరమైన హ్యూమన్ ల్యాండింగ్ సిస్టంను బ్లూ ఆరిజన్ ద్వారా నిర్మిస్తామని చెబుతున్నారు జెఫ్ బెజోస్.

అయితే.. దీని కోసం నాసా ఏప్రిల్ లోనే ఎలాన్ మాస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ.2.9 బిలియన్ డాలర్లు. ఇంత భారీ వ్యాపార అవకాశాన్ని బెజోస్ ఎందుకు వదులుకుంటాడు చెప్పండి. అందుకే.. తాజాగా భారీ ఆఫర్ ఇవ్వటం ద్వారా నాసాకు పాలుపోని పరిస్థితిని కల్పించాడు. హ్యూమన్ ల్యాండింగ్ సిస్టం డీల్ ను తమకు ఇస్తే.. 2.5 బిలియన్ డాలర్లు కాస్తా 2 బిలియన్ డాలర్లకే అందిస్తామని చెప్పి సంచలనంగా మారారు. అంతే.. డిస్కౌంట్ రూపంలో బెజోస్ ఇస్తానన్న మొత్తం ఏకంగా రూ.15వేల కోట్లు కావటం గమనార్హం.

ఓవైపు భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ఇస్తూనే.. మరోవైపు ఈ ఒప్పందాన్ని స్పేస్ ఎక్స్ కు మాత్రమే ఎందుకు ఇస్తారు? మాకు ఎందుకు అవకాశం ఇవ్వరంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. నాసా ఆడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ కు బెజోస్ తాజాగా ఒక లేఖ రాస్తూ.. తన ప్రతిపాదనకు నాసా ఓకే చెబితే.. దాని నిధుల కొరత తీరుతుందన్నాడు. అంతేకాదు.. తాను ఇస్తానన్న ఆఫర్ వాయిదాల పద్దతిలో కాదని.. ఇన్ స్టెంట్ గా ఇచ్చేస్తానని చెప్పటం ద్వారా.. అర్జెంట్ గా స్పెస్ ఎక్స్ తో ఒప్పందాన్ని పునరాలోచించేలా చేశాడు.

ఈ డీల్ ను ఎలానైనా సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న బెజోస్.. దీనికోసం భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రయోగానికి అవసరమైన నిధుల కేటాయింపునకు సంబంధించిన బిల్లు మీద తాజాగా అమెరికా సెనెట్ లో చర్చ జరుగుతోంది. దీంతో.. అయితే లాబీయింగ్ తో లేదంటే.. భారీ డిస్కౌంట్ ఆఫర్ తో.. ఈ రెండు కాదంటే కోర్టు కేసుతోనైనా ఈ డీల్ తన సొంతం కావాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ డిస్కౌంట్ ఇవ్వటం బెజోస్ కు నష్టం కలిగిస్తుందన్న అనుమానం అక్కర్లేదు.

ఎందుకంటే.. నాసా లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థతో ఒప్పందం అంటే మాటలు కాదు. ప్రస్తుతం అంతరిక్ష యానంలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఫ్యూచర్ లో పర్యాటక యాత్రలుగా మారినప్పుడు నాసాతో కలిసి పని చేయటం.. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సాంకేతికతను అందించిన సంస్థ ఇమేజ్ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ లెక్కలన్ని వేసుకున్న తర్వాతే భారీ డిస్కౌంట్ ను ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి.. ఇన్నిప్రయత్నాలు చేస్తున్న వేళ.. ఈ డీల్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజన్ కు దక్కుతుందా? లేదా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. అమెజాన్ అధిపతా మజాకానా?