Begin typing your search above and press return to search.

అమెజాన్ ఉద్యోగుల‌కు ఊహించని బిజినెస్ ఆఫ‌ర్!

By:  Tupaki Desk   |   14 May 2019 8:21 AM GMT
అమెజాన్ ఉద్యోగుల‌కు ఊహించని బిజినెస్ ఆఫ‌ర్!
X
చిత్ర‌విచిత్ర‌మైన ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తుంటాయి కొన్ని ప్రాశ్చాత్య దేశాల‌కు చెందిన కంపెనీలు. తాజాగా అలాంటి ఆఫ‌ర్ ను త‌న ద‌గ్గ‌ర ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు ప్ర‌క‌టించింది ఆన్ లైన్ మార్కెటింగ్ దిగ్గ‌జం అమెజాన్. త‌న ద‌గ్గ‌ర పని చేసే ఉద్యోగులు ఎవ‌రైనా రిజైన్ చేస్తే భారీ న‌జ‌రానాను ప్ర‌క‌టించింది. అంతేకాదు.. ఊహించ‌ని విధంగా బిజినెస్ ఆఫ‌ర్ ను ఇస్తూ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే ఉద్యోగులు తాము చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి.. డెలివ‌రీ ఏజెన్సీని ప్రారంభిస్తే.. 10వేల డాల‌ర్లు (సుమారు 7ల‌క్ష‌ల రూపాయిల‌కు పైనే) మొత్తాన్ని ఖ‌ర్చుల కింద ఇస్తామ‌ని చెబుతోంది. అంతేకాదు.. రాజీనామా చేసిన ఉద్యోగికి మూడు నెల‌ల శాల‌రీ కూడా ఇస్తామ‌ని చెబుతోంది. ఎందుకిలా? అంటే.. త‌మ కంపెనీ డెలివ‌రీ ఏజెన్సీని మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని భావిస్తున్న కంపెనీ ఈ వినూత్న ఆఫ‌ర్ కు తెర తీసింది.

ప్ర‌స్తుతం అమెజాన్ డెలివ‌రీ స‌మ‌యం రెండు రోజులుగా ఉంది. దాన్ని ఒక రోజులోకి మార్చాల‌న్న ఆలోచ‌న‌లో కంపెనీ ఉంది. అంతేకాదు.. త‌మ వ‌ద్ద డెలివ‌రీ ఏజెన్సీని ప్రారంభించే వారు.. త‌ప్ప‌నిస‌రిగా వ్యాన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దాని మీద అమెజాన్ స్మైలీ బొమ్మ‌ను పెట్టాల్సి ఉంటుంద‌ని చెబుతోంది. ఈ ఆఫ‌ర్ ను ఫుల్ టైమ్ ఉద్యోగుల‌కే కాదు.. పార్ట్ టైం ఉద్యోగుల‌కు ఆఫ‌రిచ్చింది. డెలివ‌రీల విష‌యంలో ఇప్పుడు అనుస‌రిస్తున్న విధానాల‌తో పోలిస్తే.. త‌న ఉద్యోగులే డెలివ‌రీ ఏజెన్సీగా మారితే మ‌రింత బాధ్య‌త‌గా ప‌ని చేస్తార‌ని భావిస్తోంది. అంతేకాదు.. ఈ కార‌ణంతో ఖ‌ర్చు త‌గ్గుతుంద‌ని.. వాహ‌నాలు.. డెలివ‌రీ బాయిస్ కు పెట్టే ఖ‌ర్చుపెద్ద ఎత్తున త‌గ్గే వీలుంద‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఏ వ్యాపార‌మైనా.. ఎంత ఆఫ‌ర్ అయినా ఊరికే రాదు క‌దా. డ‌బ్బులు ఇస్తున్నారంటే.. దాని వెనుక ఏదో ఒక లాభం లేకుండా ఏ కంపెనీ ముందుకు రాదు క‌దా?