Begin typing your search above and press return to search.

అంబానీకి ఏ మాత్రం తగ్గని అదానీ.. కాకుంటే తేడా ఆ ఒక్కటే

By:  Tupaki Desk   |   15 Sep 2022 1:30 PM GMT
అంబానీకి ఏ మాత్రం తగ్గని అదానీ.. కాకుంటే తేడా ఆ ఒక్కటే
X
ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయుడి పేరుంటే వావ్ అని అనుకునే పరిస్థితి. చూస్తుండగానే అంబానీ పుణ్యమా అని టాప్ టెన్ వరకు వచ్చేయగా.. అదానీ దెబ్బకు టాప్ ఫైవ్ లోకి వచ్చేసిన పరిస్థితి. గడిచిన ఎనిమిదేళ్లలో దేశంలో మరే పారిశ్రామిక వేత్తకు సాధ్యం కాని రీతిలో గౌతమ్ అదానీ దూసుకెళుతున్న తీరు చూస్తున్నదే. ఈ మధ్య కాలంలో అదానీ షేర్లు ఓరేంజ్ లో దూసుకెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా అదానీ గ్రూపు మరింత భారీగా విస్తరణ దిశగా పరుగులు తీస్తున్న వైనం బయటకు వచ్చింది.

వంట సరుకుల అమ్మకాల్లో అగ్రగామిగా నిలిచేందుకు అదానీ విల్మర్ ఊవ్విళ్లూరుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని కొనుగోళ్లకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సంస్థ ఖాతాలో ఫార్చూన్.. కోహినూర్ బ్రాండ్లు ఉన్నాయి. వీటితోపాటు మరిన్ని బ్రాండ్లను సొంతం చేసుకునే దిశగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.

తాజాగా బ్లూమ్ బెర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ కంపెనీ సీఈవో ఎండీ అంగ్షూ కీలక విషయాల్ని వెల్లడించారు. మార్చిలోపు మరిన్ని బ్రాండ్లను కొనుగోలు చేసే ఒప్పందాలు ఖరారు అవుతాయని పేర్కొన్నారు.

మరోవైపు రిలయన్స్ సైతం ఈ ఏడాదే ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి వేళలోనే అదానీ విల్మర్ కూడా విస్తరణకు వేగంగా అడుగులు వేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

అంబానీ.. అదానీలను చూస్తే.. ఇటీవల కాలంలో వేర్వేరు బ్రాండ్లను వరుస పెట్టి రిలయన్స్ కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు అదానీ కూడా అదే బాటలో నడుస్తున్నట్లుగా చెప్పాలి. కాకుంటే.. రిలయన్స్ షేర్లు ఒడిదుడుకులకు లోనవుతుండగా.. అదానీ షేర్లు మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకెళుతున్నాయి. దీనికో చక్కని ఉదాహరణ చెప్పాలంటే ఈ ఏడాది ఆరంభంలో అదానీ విల్మార్ పబ్లిష్ ఇష్యూకు వచ్చిన వేళలో.. రూ.230 షేరు ఒక్కటితో మొదలైన ప్రయాణం.. ఈ రోజున ఏకంగా రూ.720 వరకు వచ్చేయటం చూస్తే.. ఆరంభం నుంచి ఇప్పటివరకు 300 శాతం పెరుగుదల కనిపిస్తుంది.

భారత ఆహార ఉత్పత్తి పరిశ్రమ విలువ రూ.31.8 లక్షల కోట్లు. ఈ రంగంలో ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకోవటం కోసం రిలయన్స్.. అదానీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బ్రాండ్లను సొంతం చేసుకుంటున్నాయి. అదానీ.. అంబానీలను చూస్తే.. తాము చేసే వ్యాపారాలకు అదనంగా మరిన్ని వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇవ్వటం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే.. అంబానీతో పోలిస్తే.. అదానీ సంస్థ ఈ మధ్య కాలంలో దూకుడు మరింతగా పెంచిందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.