Begin typing your search above and press return to search.

అంబానీ బ్రదర్స్ మళ్లీ ఎందుకు కలుస్తున్నారు?

By:  Tupaki Desk   |   1 Oct 2015 6:54 AM GMT
అంబానీ బ్రదర్స్ మళ్లీ ఎందుకు కలుస్తున్నారు?
X
దేశంలో అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీలు విడిపోవటం అప్పట్లో సంచలనం సృష్టించింది. వీరి మధ్య రాజీ చేయటానికి పెద్ద స్థాయిలో ప్రయత్నాలు జరిగినా.. వీరి మధ్యనున్న దూరం మాత్రం తగ్గలేదు. ఉప్పు.. నిప్పులా అన్నట్లుగా వ్యవహరించిన అంబానీ సోదరులు ఇప్పుడు చేయి.. చేయి కలుపుకోవటమే కాదు.. కలిసి పోవటానికి సిద్ధం అవుతున్నారు.

విడిపోయిన అంబానీ సోదరులు ఏకం కావటానికి.. చేతులు కలపటానికి కారణం ఏమిటి? వారిద్దరిని దగ్గరకు చేర్చిన అంశాలేమిటి? అన్నది చూస్తే.. వ్యాపారమే అని చెప్పాలి. ఏ డబ్బు కారణంగా విడిపోయారో.. అదే సంపదను మరింత పెంచేందుకు సోదరులిద్దరూ కలవాలని డిసైడ్ కావటం ఆసక్తికరంగా మారింది.

టెలికం రంగంలో తిరుగులేని శక్తిగా అవతరించాలని భావిస్తున్న అంబానీ బ్రదర్స్.. అదంతా తామిద్దరం కలిస్తే తప్ప సాధ్యం కాదని అర్థం చేసుకున్నారు. ఇప్పటికే ఆర్ కామ్ తో మార్కెట్ లో బలమైన శక్తిగా ఉన్న అనిల్ అంబానీకి.. రిలయన్స్ జియో పేరుతో ముఖేష్ అంబానీ సీన్లోకి రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరికి సంబంధించి బలాలు.. బలహీనతలు ఉన్నాయి.

ఎవరికి వారికి ఉన్న బలహీనతల్ని.. తమకున్న బలాలతో అధిగమించాలన్న ఆలోచనలో ఉన్న అంబానీలు చేతులు కలిపినట్లుగా చెబుతున్నారు. 4జీ సేవలతో పాటు.. స్పెక్ట్రమ్ షేరింగ్ విషయంలో ఇరువురు కలిసిపోవాలని భావిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

అత్యాధునిక టెక్నాలజీతో జియో మార్కెట్ లోకి వస్తున్న వేళ.. అందుకు అవసరమైన టవర్లను తమ్ముడు అనిల్ అంబానీ కంపెనీకి చిందిన వాటిని వినియోగించనున్నారు. భారత టెలికాం వ్యవస్థ రూపురేఖల్ని మార్చేస్తుందని భావిస్తున్న రిలయన్స్ జియోను సూపర్ హిట్ చేసేందుకు.. దాని ద్వారా వచ్చే లాభాన్ని అన్నదమ్ములు ఇరువురు ఎంజాయ్ చేసేందుకు అంబానీ సోదరులిద్దరూ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. మరి.. అంబానీల కలయిక వినియోగదారులకు ఎంత మేరకు లాభం చేకూరుస్తుందో చూడాలి.