Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైం.. రిలయన్స్ ఎండీ రేసులో అంబానీ కుటుంబేతరులు

By:  Tupaki Desk   |   13 Jan 2020 5:30 PM GMT
ఫస్ట్ టైం.. రిలయన్స్ ఎండీ రేసులో అంబానీ కుటుంబేతరులు
X
సీఎండీ... చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనే పోస్టు ఇక చెల్లదని సెబీ తేల్చి చెప్పేశాక.. ఏప్రిల్ 1 నుంచి ఆ విధానం అమల్లోకి రావాలని నిర్ణయించేశాక దేశంలోని అనేక కంపెనీల్లో ఎండీ పదవులకు సీనియర్లు సిద్ధమవుతున్నారు. ఏ కంపెనీ కైనా ఛైర్మెన్, ఎండీలుగా వేర్వేరు వ్యక్తులు ఉండాలని సెక్యూరిటీ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) గతంలో సూచించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని పేర్కొంది. ఈ క్రమంలోనే దేశంలోనే అత్యంత పేరున్న సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ కు ఎండీ గా ఎవరు ఉంటారా అనే చర్చ మొదలైంది. సెబీ సూచించిన నిబంధనలను అమలు చేయాల్సి వస్తే ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు సీఎండీగా ఉన్న ముఖేష్ అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్‌ గా వ్యవహరిస్తారు. అంబానీ కుటుంబం నుంచి కాకుండా ఇతరులు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ కు ఎండీగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే రిలయన్స్ చరిత్ర లో అంబానీ కుటుంబం నుంచి కాకుండా మరొకరు ఈ కీలక బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి అవుతుంది.

తాజా పరిణామాల నేపథ్యంలో రిలయన్స్ సంస్థకు ఎవరు ఎండీ అవుతారా అన్నది చర్చనీయం గా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో ఎండీ పోస్టుకు ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నిఖిల్ మెస్వానీ పేరు ప్రధానం గా వినిపిస్తోంది. ఇతనితో పాటు ముఖేష్ అంబానీకి కుడి భుజంగా వ్యవహరిస్తూ సంస్థ కు వర్చువల్ సీఈఓలా ఉన్న మనోజ్ మోదీ పేరు కూడా వినిపిస్తోంది. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీఎంఎస్ ప్రసాద్‌ పేరూ వినిపిస్తోంది.

90వ దశకం నుంచే నిఖిల్ మెస్వాని రిలియన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో ప్రయాణిస్తున్నారు. వీరు ముఖేష్ అంబానీకి బంధువులు కూడా. ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపించినప్పుడు నిఖిల్ మెస్వానీ తండ్రి రసిక్‌లాల్ మెస్వాని కూడా ఒక ఫౌండర్ డైరెక్టర్‌గా ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో మనోజ్ మోడీ అధికారికం గా లేనప్పటికీ రిలయన్స్ సంస్థ ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించారు. లిస్టెడ్ కంపెనీలకు ఛైర్మెన్‌లు ఎండీలు వేర్వేరుగా ఉండాలని సెబీ నిబంధనలను తీసుకొచ్చింది. అంటే ఒకే కుటుంబానికి చెందిన వారు లేదా బంధువులు ఎండీ పదవులు చేపట్టరాదని సూచించింది. 1956 కంపెనీస్ చట్టంలోని సెక్షన్ 6లో బంధువుల కింద ఎవరెవరు వస్తారో స్పష్టమైన నిర్వచనం ఉంది. దీన్ని అనుసరించే నిబంధనలను ఫిక్స్ చేసినట్లు సెబీ పేర్కొంది. ఇందులో దాయుదుల ఉండరాదని ఎక్కడా పేర్కొనలేదు. అంటే నిఖిల్ మెస్వానీ అంబానీ కి దాయాది అవుతారు.