Begin typing your search above and press return to search.

బీజేపీలో చేరుతున్న చిరు స‌న్నిహితుడు

By:  Tupaki Desk   |   11 Feb 2017 11:48 AM GMT
బీజేపీలో చేరుతున్న చిరు స‌న్నిహితుడు
X
మెగాస్టార్‌, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి స‌న్నిహితుడైన క‌ర్ణాటక రెబ‌ల్ స్టార్ బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేర‌కు క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్దరామయ్య రాష్ట్ర మంత్రి వర్గ ప్ర‌క్షాళ‌నలో భాగంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న రెబల్‌ స్టార్‌ అంబరీష్ ను ప‌దవి నుంచి తొలగించారు. ఈ నిర్ణ‌యం రాజ‌కీయ ప్ర‌కంప‌న‌ల‌కు దారితీసింది. గ‌త ఏడాది జ‌రిగిన మంత్రివ‌ర్గ తొల‌గింపులో స్థానం కోల్పోయిన‌ప్ప‌టి నుంచి అంబ‌రీష్ ఎడ‌మొహం, పెడమొహం అన్న‌ట్లుగా ఉన్నారు. ఇటీవ‌ల ఆయ‌న కాంగ్రెస్ ను వీడాల‌ని నిర్ణ‌యించుకుని భార‌తీయ జ‌న‌త‌పార్టీపై ఆస‌క్తి చూపారు.

పార్టీ మార్పు నిర్ణ‌యం తీసుకున్న అనంత‌రం బీజేపీ పెద్ద‌ల‌తో చ‌ర్చించ‌గా రాజ్య‌స‌భ స్థానం క‌ట్ట‌బెడ‌తామ‌ని హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 2018లో అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌ర్ణాట‌క బీజేపీలో కూడా ప్రాధాన్య పోస్టు కల్పిస్తామ‌ని వారు భ‌రోసా ఇచ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో క‌మ‌లం గూటికి చేరేందుకు అంబ‌రీష్ రెడీ అయిపోయారు. ప్ర‌ముఖ సినీన‌టి సుమ‌లత భ‌ర్త అంబ‌రీష్ అనే సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి అనేక సినిమాల్లో న‌టించిన సుమ‌ల‌తతో పాటుగా అంబ‌రీష్ తో చిరుకు మంచి సంబంధాలు ఉన్నాయి.

కాగా, ఢిల్లీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సిద్ద రామయ్య తన మంత్రి వర్గం నుంచి పద్నాలుగు మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. పదవీచ్యుతులైన వారిలో ఎమ్మెల్యే అంబరీష్ కూడా ఉన్నారు. అయితే తనను పదవి నుంచి తొలగించినందుకు నిరసనగా అంబరీష్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు పంపించారు. కొన్ని రోజుల‌త‌ర్వాత తన మౌనాన్ని వీడారు. స్పీకర్‌తో వ్యక్తిగతంగా మాట్లాడి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. వాడుకున్నంత కాలం వాడుకుని విసిరి పారేసే చెప్పులాంటి వాడిని కాదని వ్యాఖ్యానిస్తూ సిద్ధరామయ్యపై అంబరీష్‌ మండిపడిన సంగతి తెలిసిందే. ఆయనను హిట్లర్‌గా కూడా అంబరీష్‌ అభివర్ణించారు. అంబరీష్‌ వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించిన సిద్ధరామయ్య ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడతానని చెప్పారు. అనంత‌రం ఈ ఇద్ద‌రు నేత‌లు భేటీ అయిన‌ప్ప‌టికీ వారి మ‌ధ్య స‌ఖ్య‌త కుద‌ర‌లేదు.