Begin typing your search above and press return to search.

మంత్రి అంబటి లంచం అడిగారంటూ ఆరోపణలు?

By:  Tupaki Desk   |   20 Dec 2022 4:48 AM GMT
మంత్రి అంబటి లంచం అడిగారంటూ ఆరోపణలు?
X
రాజకీయ ప్రత్యర్థులపై విపరీతమైన ఆవేశంతో విరుచుకుపడే ఏపీ మంత్రుల్లో అంబటి ముందు వరుసలో ఉంటారు. మాటలో గంభీరం.. అసలేం చేయకున్నా కూడా అంతా చేసేసినట్లుగా ఉండే తీరు ఆయన సొంతమన్నట్లుగా పేరు ఉంటుంది. తాను నమ్మిన దానికి మూడు కాళ్లే అన్నట్లుగా ఆయన మాటలు ఉంటాయన్న విమర్శ ఉంది. మంత్రి అంబటి మీద ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటు విమర్శలు చేయటమే కాదు.. ఉతికి ఆరేసినంత పని చేశారు. కమిషన్ల కక్కుర్తి ఆయనకు ఎంతన్న విషయాన్ని ఉదాహరణలతో చెప్పిన వైనం సంచలనంగా మారింది.

సాధారణంగా పవన్ కల్యాణ్ మీద విరుచుకుపడేందుకు.. విమర్శలు చేసేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించే అంబటి.. తాజా ఎపిసోడ్ లో మాత్రం ఆయన కామ్ గా ఉన్నారు. ఇదిలాఉంటే.. అంబటి ఆరాచకం ఎంతలా ఉంటుందో తెలుసా? అన్నట్లుగా ఒక కొత్త ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ కుమారుడు చనిపోతే ప్రభుత్వం రూ.5లక్షలు సాయం చేస్తే.. అందులో రూ.2.5 లక్షలు ఇవ్వాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త అడిగారని.. దానికి అంబటి రాంబాబు కూడా వారికి ఆ డబ్బులు ఇవ్వాలని గదమాయించినట్లుగా మరణించిన వ్యక్తి తల్లిదండ్రులు పర్లయ్య.. గంగమ్మలు చెప్పిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఈ దంపతులు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొండలరావు అనే వ్యక్తి మాటతో తమ కుమారుడు హోటల్ కు పనికి వెళ్లాడని.. అక్కడ చనిపోయాడని వీరు పేర్కొన్నారు. దీంతో.. ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల సాయం నాలుగు నెలల తర్వాత వచ్చినట్లుగా మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త సాంబశివరావు ఫోన్ చేసి చెప్పినట్లుగా పేర్కొన్నారు.

ఛైర్ పర్సన్ భర్త వద్దకు వైసీపీ నాయకుడు బాబూరావు తీసుకెళితే తాము వెళ్లామని.. ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.5లక్షల్లో రూ.2.5 లక్షలు ఇవ్వాలని అడిగినట్లుగా చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.5లక్షలతో కుమార్తె పెళ్లి చేయాలని అనుకుంటున్నామని చెప్పినా వినలేదన్నారు. దీంతో న్యాయం చేస్తారని మంత్రి అంబటి రాంబాబు వద్దకు వెళ్లి కలిస్తే.. సాంబశివరావుకు రూ.2.5 లక్షలు ఇవ్వాల్సిందేనని చెప్పారు.

"ఒకవేళ ఆయన వద్దన్నా. నాకు డబ్బులు కావాలి. నేనే ఆ డబ్బులు తీసుకుంటానని చెప్పి మమ్మల్ని గదిమి పంపేవారు. తర్వాత సీఐ దగ్గరకు వెళ్లి చెప్పాం. దానికి ఆయన.. వాళ్లు చెప్పినట్లుగా వినకపోతే.. మీకు పథకాలు రావు. స్టేషన్ చుట్టు తిరగాల్సి వస్తుందని చెప్పారు. దాంతో మేం పురుగులు మందు తాగి చనిపోవాలని అనుకున్నాం. కూతురు దిక్కులేకుండా పోతుందని ఊరుకున్నాం" అని గంగమ్మ వాపోయింది. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. చనిపోయిన వారి కుటుంబానికి వచ్చే డబ్బుల కోసం మంత్రి అంబటి ఆశ పడ్డారా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. మొత్తంగా వరుస రెండు రోజుల్లో అంబటి వారి ఆరాచకం ఇంతనా? అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.