Begin typing your search above and press return to search.

వాళ్లపై గెలిస్తే ఆళ్ల - అంబటిలకు మంత్రియోగమే..

By:  Tupaki Desk   |   22 May 2019 4:41 AM GMT
వాళ్లపై గెలిస్తే ఆళ్ల - అంబటిలకు మంత్రియోగమే..
X
మరో 24 గంటలు.. ఈరోజు గడిస్తే చాలు రేపు ఉదయం నుంచి ఎన్నికల ఫలితాలు వెల్లువలా వస్తాయి. అప్పుడు ఎవరు గెలుస్తారనేది తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆదివారం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తో కేంద్రంలో బీజేపీ సంబరాలు మొదలు పెట్టేసింది. నిన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీ మిత్రపక్షాలకు విందు కూడా ఇచ్చేసి జోష్ తో ఉన్నారు.

ఇక ఏపీలో మాత్రం మిక్స్ డ్ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. జాతీయ చానల్స్ నాలుగైదు వైసీపీ గెలుస్తుందనగా.. రెండు మూడు టీడీపీ వైపు మొగ్గు చూపాయి. ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి టీడీపీకి జై కొట్టారు.

అయితే వైసీపీకే గెలుపు అవకాశాలున్నాయని ఆ పార్టీలో ధీమా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అందరి సంగతి ఏమో కానీ.. వైసీపీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా రెండు సీట్లలో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారా లేదా అన్నది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అందులో మొదటిది మంగళగిరి.. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి పోటీచేసింది ఇక్కడే. మంగళగిరిలో ఈయనకు ప్రత్యర్థి మామూలోడు కాదు.. చంద్రబాబునే హైకోర్టులలో కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసిన మొనగాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అందుకే ఏపీలోనే అత్యధిక బెట్టింగ్ లు సాగుతున్నది.. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నది మంగళగిరిలో గెలుపు ఎవరిది అనే దానిపైనే..

ఇక వైసీపీ అధికార ప్రతినిధి.. జగన్ కు సన్నిహితుడిగా పేరొందిన అంబటి రాంబాబు.. మరోసారి సత్తెనపల్లి నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోయిన 2014 ఎన్నికల్లో అంబటి.. స్పీకర్ టీడీపీ అభ్యర్థి అయిన కోడెల శివప్రసాద్ చేతిలో ఓడిపోయారు. మరోసారి ఈ ఇద్దరు పోటీపడడం ఆసక్తి రేపుతోంది. నువ్వానేనా అన్నట్టు సాగిన ఈ ఫైట్ లో గెలుపుపై జోరుగా పందాలు, ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు..

ఇక ఈ ఇద్దరు గనుక గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవులు ఖాయమన్న చర్చ వైసీపీ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే లోకేష్ ను ఓడిస్తే ఆళ్లను మంత్రిని చేస్తానని ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు కూడా. ఇక సీనియర్ అయిన అంబటి.. స్పీకర్ కోడెలను ఓడిస్తే మంత్రి పదవి రేసులో ముందుంటారు. ఇలా ఈ ఇద్దరు నేతలు బలమైన టీడీపీ అభ్యర్థులను ఓడిస్తే మంత్రులు కావడం ఖాయమన్న ప్రచారం ఆపార్టీలో సాగుతోంది.