Begin typing your search above and press return to search.

సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా : పోలవరం స్కూల్ లో అంబటి...

By:  Tupaki Desk   |   22 July 2022 1:49 AM GMT
సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా : పోలవరం స్కూల్ లో అంబటి...
X
నాకు నీటి పారుదల శాఖ మీద అవగాహన లేదని ప్రతిపక్షాలు హేళన చేయడమేంటి అని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహించారు. నేను పుట్టినప్పటినుంచే డయాఫ్రం వాల్ గురించి తెలుసుకునే పని ఉందా అని ఆయన ప్రశ్నించారు. నేను సంబంధిత శాఖకు మంత్రిగా ఉన్నానని, తనకు కామన్ సెన్స్ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తనకు తెలియకపోతే అధికారులను అడిగి తెలుసుకుంటాను నేర్చుకుంటాను  అని ఆయన చెప్పారు.

ఈ విషయంలో పోలవరం గురించి అంబటికి ఏం తెలుసు అని మాజీ మంత్రి దేవినేని ఉమా అనడమేంటి అని ఆయన నిలదీశారు. అవును పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు సాంకేతికత నాకు తెలియదు. అయితే ఏంటి,  పోర్ట్‌ఫోలియోలో ఉన్న మంత్రి తనకు సంబంధించిన సబ్జెక్ట్‌లో నిపుణుడిగా ఉండాల్సిన అవసరం లేదు కదా అని అంబటి అన్నారు.

అంతే కాదు  దేశంలో బోలెడు మంది ఆరోగ్య మంత్రులు ఉన్నారు. వారంతా కూడా  ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేస్తారా, అది వారికి అవసరమా  అని విపక్ష నేతల విమర్శలపై అంబటి ప్రశ్నించారు. నేను ఏమైనా  కాంట్రాక్టర్‌ని కాదు, ఇంజనీర్‌ను కాను నాకు అన్నీ తెలియడానికి అని ఆయన పేర్కొనడమూ విశేషం.

అయితే తనకు సబ్జెక్ట్ నేర్చుకునే ఇంగితజ్ఞానం చిత్తశుద్ధి ఉందని అంబటి అంటున్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి కారణం ముమ్మాటికీ తెలుగుదేశం ప్రభుత్వమే అని అంబటి మరో మారు ఆరోపించారు. ఈ విషయం మీద నిపుణులతో కలసి చర్చకు సిద్ధమా అని ఆయన టీడీపీకి సవాల్ చేశారు.

ఆనాడు కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ని  నిర్మించారని, దాని వల్ల ఆ తరువాత  వచ్చిన భారీ వరదల్లో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని ఆయన అన్నారు. ఇపుడు అవన్నీ మసిపూసేసి తమ ప్రభుత్వం మీద దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు అని ఆయన ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి రాష్ట్రప్రభుత్వం కారణం అన్న కేంద్రం మాటలను తాను అంగీకరిస్తున్నాను అని అంబటి అన్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం అంటే వైసీపీ మాత్రమే కాదని,  అందులో అయిదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఉందని ఆయన అన్నారు. నాడు తెలుగుదేశం పార్టీ తెలువితక్కువగా డయాఫ్రం వాల్ ని ముందు నిర్మించి నాలుగు వందల కోట్ల రూపాయలు నష్టపోయేలా చేశారని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉండగా వరదలు అయిపోయాయి. ఇపుడు తాపీగా రాజకీయం చేయడానికి చంద్రబాబు  వరద ప్రభావిత ప్రాంతాల్లో టూర్ అని పెట్టుకున్నారని అంబటి అన్నారు. కేవలం ప్రజలను రెచ్చగొట్టేందుకే ఆయన అక్కడికి వెళ్లారని ఆరోపించారు. మొత్తానికి పోలవరం తొందరగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను అని మాత్రమే అంబటి అన్నారు తప్ప ఎప్పుడు పూర్తి అవుతుందో మాత్రం చెప్పలేదు. దీన్ని బట్టి చూస్తే వారి మీద వీరు వీరి మీద వారు విమర్శలు చేసుకోవడం తప్పితే పోలవరం పాపాలకు శాపాలకు ఎవరు బాధ్యులు అన్నది మాత్రం జనాలకు  చెప్పలేకపోతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.