Begin typing your search above and press return to search.

అంబ‌టి స‌వాల్‌ అదిరిపోయిందిగా!

By:  Tupaki Desk   |   17 Jun 2016 8:27 AM GMT
అంబ‌టి స‌వాల్‌ అదిరిపోయిందిగా!
X
తాము ఉప ఎన్నిక‌ల్లో గెలిస్తే వైసీపీని మూసివేస్తారా అంటూ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి - జ‌లీల్‌ ఖాన్ స‌వాల్ విసిరిన నేప‌థ్యంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు లైన్లోకి వ‌చ్చారు. సవాల్ విసిరితే అది తెలుగుదేశం పార్టీకి కూడా వర్తిస్తుందన్న విషయం గుర్తించుకోవాలని అభిప్రాయపడ్డారు. రాజీనామా చేసి గెలిస్తే పార్టీని మూసేస్తారా అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యే భూమన నాగిరెడ్డి విసిరిన‌ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. దమ్ముంటే మాట మీద నిలబడి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పిరాయింపు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని కోరారు. రాజీనామా చేసి గెలిస్తే పార్టీని మూసేసేందుకు సిద్ధమని - అయితే ఓడిపోతే టీడీపీని మూసేస్తారా అని ప్రశ్నించారు. 20 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా ఏమాత్రం చెక్కుచెదరని పార్టీ తమదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

కోట్ల రూపాయలకు ఆశపడి పోయి పార్టీ మూసేసుకుంటారా అని సిగ్గులేకుండా మాట్లాడుతారా..! అంటూ భూమా - జ్యోతుల నెహ్రూ ఇతర ఫిరాయింపుదారులపై అంబటి నిప్పులు చెరిగారు. పెళ్లి ఓ చోట - సంసారం మరో చోట చేస్తూ పచ్చి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని అంబటి వారిపై విరుచుకుపడ్డారు. విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకుంటే చట్టం ఒప్పుకుంటుందా..? పార్టీని వీడితే పదవికి రాజీనామా చేయాలని చట్టం చెబుతుంటే పట్టదా..? అని నిలదీశారు. 67 మందిలో 20మంది వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ వన్నె మరింత పెరిగిందన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు.

#చట్టాలను వ్యతిరేకిస్తారా? అక్కడికి వెళ్లి కునుకుతారా? ముఖ్యమంత్రికి - ఫిరాయింపుదారులకు సిగ్గుగా లేదా? డబ్బులు తీసుకోకుండా టీడీపీలోకి దేనికి వెళ్లారు? బాబు అందం చూసి వెళ్లారా? నైతిక విలువలు లేని మీరా వైయస్ జగన్ గురించి మాట్లాడేది?# అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటలు టైమ్ ఇస్తున్నామని - దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని అంబటి పచ్చకండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు బాబు ఐదు కోట్లు బేరమాడిన చంద్ర‌బాబు అదేవిధంగా ఇక్కడ సైతం డబ్బులతో కొంటున్నారని అంబటి దుయ్యబట్టారు.