Begin typing your search above and press return to search.

టీడీపీతో చేతులు కలుపుతామంటున్న అంబటి

By:  Tupaki Desk   |   5 May 2016 9:20 AM GMT
టీడీపీతో చేతులు కలుపుతామంటున్న అంబటి
X
మీరు విన్నది నిజమే. కాకుంటే.. మీరు అనుకున్న విషయంలో కాదు. ఏపీలో ప్రస్తుతం జంపింగ్స్ జోరుగా సాగుతున్న వేళ.. అంబటి నోట ఆ తరహా మాట వచ్చి ఉంటుందనుకుంటే తప్పులో కాలేసినట్లే. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ అమలు విషయంలో కేంద్రం కుదరదన్న విషయాన్ని తేల్చి చెప్పేసిన నేపథ్యంలో.. విపక్ష నేత అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు.

‘‘మన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయినా కలిసి పోరాడదాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీలో కలిసి పోరాడేందుకు మా పార్టీ సిద్ధంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్ర మంత్రివర్గంలో ఉన్న మంత్రులను ఉపసంహరించుకోవాలని.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి.. అసెంబ్లీలో లేని రాజకీయ పార్టీలను కూడా పిలిచి సలహాలు.. సూచనలు చేయాలని అంబటి కోరారు.

కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు.. ఏపీకి ప్రత్యేక హోదా సాధనను ఏపీ ముఖ్యమంత్రి ఉద్యమరూపం చేయాలని సూచించారు. మిగిలిన రాజకీయ అంశాల్ని పక్కన పెడితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధిగా వ్యవహరిస్తున్న అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్లో కీలకాంశాలు ఉన్నాయని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రి ఒక్కడిగా కాక.. ఏపీ లోని అన్ని రాజకీయపార్టీలతో కలిపి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు అధికారపక్షంతో చేతులు కలిపేందుకు సిద్ధమన్న విపక్ష సాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి..ఈ విషయంలో చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? అన్నదే పెద్ద ప్రశ్న.