Begin typing your search above and press return to search.

మరీ అంతలా రెచ్చగొట్టాలా అంబటి?

By:  Tupaki Desk   |   15 Nov 2016 2:12 PM GMT
మరీ అంతలా రెచ్చగొట్టాలా అంబటి?
X
ప్రజలకు కీడు చేసే కన్నా మేలు చేసే రాజకీయ నేతలు ఎంతమంది కనిపిస్తారన్నది వర్తమాన రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది. ప్రజల మనోభావాల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నా.. వారి భావోద్వేగాల్ని కట్టడి చేస్తూ.. వారి చేత శాంతియుతంగా ఉద్యమం చేయించే ఉద్యమ నేతలు చాలా అరుదుగా కనిపిస్తారు. వీలైనంతగా మాటలత మంట పుట్టించటమే కాదు.. తమకింత అన్యాయం జరిగిందా? అని భావోద్వేగంతో మరింత చెలరేగిపోయేలా మాట్లాడే నేతలే ఎక్కువ మంది కనిపిస్తారు.

కాపులను బీసీల్లో వచ్చేలా చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల వేళ హామీ ఇవ్వటం.. ఈ విషయంపై ఇప్పటికే ఇచ్చిన హామీలేమీ అమలు కాని వేళ.. కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్రను స్టార్ట్ చేసేందుకు ముహుర్తం సిద్ధంగా చేశారు. రేపటి నుంచి ఈ పాదయాత్ర షురూకానున్న వేళ.. ఏపీ సర్కారు.. పోలీసు బాస్ ఇద్దరూ పాదయాత్రకు చెక్ పెట్టేలా అనుమతి లేదని చెప్పటం దీనికి ప్రతిగా హైకోర్టు ముద్రగడ చేస్తున్న పాదయాత్రకు ఓకే చెప్పిన వైనం ఏపీ విపక్షాలకు మరింత బలం చేకూరేలా చేసిందని చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ముద్రగడ దీక్ష.. బాబు ఇచ్చిన హామీ అమలు వైఫల్యంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సూదుల్లాంటి మాటలతో విపరీతంగా గుచ్చేసే అలవాటు ఉన్న అంబటి.. ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని హోం మంత్రి.. రాష్ట్ర డీజీపీ అంటున్నారని.. వారు చెబితేనే చట్టాలు మారిపోతాయా? అని ప్రశ్నిస్తున్నారు.

ముద్రగడ పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వటాన్ని ప్రస్తావిస్తూ.. ముద్రగడను అడ్డుకోవాలన్నట్లుగా ఏపీ హోం మంత్రి.. డీజీపీ వ్యవహరిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. ముద్రగడ పాదయాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించటం గమనార్హం. ముద్రగడ చేస్తున్న పాదయాత్రకు 15వేల మంది పోలీసుల్ని మొహరించారని.. ఇది ప్రజాస్వామ్యమా? రాచరికమా? మిలటరీ పాలన సాగుతుందా? అని ప్రశ్నించిన ఆయన.. అంతమంది పోలీసుల్ని పెట్టి బాబు ఏం చేయాలనుకుంటున్నారు? ఎలా పాలించాలని అనుకుంటున్నారు? అంటసూటిగా ప్రశ్నించారు. ఓపక్క ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో ఇప్పటికే వాతావరణం వేడెక్కి ఉన్న వేళ.. బాబుపై చేసి స్పైసీ వ్యాఖ్యలు మరెంత రాజుకునేలా చేస్తాయో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/