Begin typing your search above and press return to search.

స్పీకర్ సార్.. మీ 'బాబు' భక్తేంటి.?

By:  Tupaki Desk   |   29 Aug 2018 11:59 AM GMT
స్పీకర్ సార్.. మీ బాబు భక్తేంటి.?
X
రాజకీయ నాయకులకు తమ పార్టీల పట్ల భయం.. భక్తి ఉండడం సహజమే.. జన్మనిచ్చిన పార్టీ కోసం ఎంతైనా చేసే నాయకులకు కొదవలేదు. కానీ రాజ్యాంగబద్ద పదవిలో ఉండి కూడా పార్టీ కోసం పాకులాడితే నవ్వులపాలు కాక తప్పదు. ఇప్పుడు ఏపీ శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా విమర్శలపాలవుతున్నారు. ఆయన స్వామిభక్తి.. ఆయన చేపట్టిన రాజ్యాంగ బద్ద పదవికే చేటు తెస్తోందని తాజాగా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ఒకప్పుడు శాసనసభకు స్పీకర్ అంటే ఎంతో గౌరవం ఉండేది. ఏపార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తి అయినా కానీ అధికార, ప్రతిపక్షాలకు సమదూరం పాటిస్తూ ఆ రాజ్యాంగబద్ద పదవికి విలువను తెచ్చేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. విలువలు పోయాయి. పార్టీల కోసం ప్రాణత్యాగాలు చేసే స్పీకర్లు కూడా దేశంలో కనిపిస్తున్నారంటే ఆశ్చర్యపోకతప్పదు..

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వైఖరిపై కూడా ఎన్నో విమర్శలున్నాయి. ఆయన స్పీకర్ గా కంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్పీకరుగా ఉండి తెలుగుదేశం ప్రభుత్వం క్యాబినేట్ మీటింగ్ లో పాల్గొన్న కోడెల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దేశంలోనే ఇలా స్పీకర్ గా ఉండి కేబినెట్ మీటింగ్ లో పాల్గొన్న వ్యక్తిగా కోడెల రికార్డు సృష్టించారు. ఇదే కాదు.. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని.. పచ్చ కండువాలు వేసుకొని.. పార్టీ కార్యకర్తలకు మార్గ నిర్దేశనం చేసిన కోడెల వైఖరి వివాదాస్పదం అయ్యింది..

తాజాగా కోడెల మరో పెద్ద తప్పు చేశాడు. స్పీకర్ గా ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ వ్యవహారం మీడియాలో ప్రముఖంగా రావడంతో టీడీపీ చిక్కుల్లో పడింది. ఇలా చేసిన కోడెల రాజ్యాంగబద్ద పదవిలో ఉండాల్సిన వ్యక్తి కాదని.. ఆ పదవి నుంచి వైదొలగాలని వైసీపీ నాయకుడు.. సత్తెనపల్లిలో కోడెల చేతిలో ఓడిపోయిన అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

ఇలా కోడెల స్పీకర్ పదవికే కలంకం తెచ్చేలా వ్యవహరిస్తున్న తీరు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. దీనిపై ప్రతిపక్ష వైసీపీ నేతలు తూర్పారపడుతున్నా.. ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా ఆయన పంథా మారకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.