Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు పేప‌ర్ పులి:అంబ‌టి రాంబాబు

By:  Tupaki Desk   |   18 Jun 2018 8:01 AM GMT
చంద్ర‌బాబు పేప‌ర్ పులి:అంబ‌టి రాంబాబు
X
ఏపీ ప్ర‌జ‌ల‌కు అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డం.....ప్ర‌గ‌ల్భాలు ప‌ల‌క‌డం.....ప్ర‌చార ఆర్భాటం కోసం లేనివి ఉన్న‌ట్లుగా క‌ల్పించి చెప్పడం....ఇటువంటి ల‌క్ష‌ణాల‌న్నీ ఏపీ సీఎం చంద్ర‌బాబుకు వెన్న‌తో పెట్టిన విద్య‌లు. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ.....త‌న‌కు అనుకూలంగా ఏవిషయాన్న‌యినా మ‌లుచుకొని .....తిమ్మిని బ‌మ్మిని చేసి....మ‌సిపూసి మారేడుగాయ చేయ‌డం బాబుకు మంచినీళ్ల ప్రాయం. తాజాగా, నిన్న జ‌రిగిన నీతి ఆయోగ్ స‌మావేశంలో కూడా చంద్ర‌బాబు త‌న స‌హ‌జ‌సిద్ధ‌మైన శైలిని వ‌దులుకోవ‌డానికి ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌లేదు. ఆ స‌మావేశంలో మోదీతో బాబు ముభావంగా ఉన్నార‌ని... మోదీకి న‌మ‌స్కారం కూడా చేయ‌లేద‌ని....అస‌లు ప్ర‌ధానిని ల‌క్ష్య పెట్ట‌లేద‌ని.....నీతి ఆయోగ్ స‌మావేశంలో బాబు దుమ్ము దులిపార‌ని .....ఎల్లో మీడియా విప‌రీత‌మైన ప్ర‌చారం క‌ల్పిస్తోంది. అయితే, అక్క‌డ జ‌రిగింది అది కాద‌ని, వాస్త‌వం వేర‌ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, చంద్ర‌బాబుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. కేంద్రాన్ని నిగ్గ‌దీసి అడుగుతాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన చంద్ర‌బాబు ప్రధాని మోదీకి వంగివంగి దండాలు పెట్టారని ఎద్దేవా చేశారు.

ఆ సమావేశంలో మోదీని చూసిన చంద్రబాబులో భయం - వినయం కనిపించాయని మండిప‌డ్డారు. ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టి నాటకాలు ఆడార‌ని దుయ్య‌బ‌ట్టారు. చంద్ర‌బాబు పేప‌ర్ పులి అని, అమ‌రావతిలో పులిలా గాంఢ్రించి, ఢిల్లీలో పిల్లిలా చిరునవ్వుతో పలకరింపులు....క‌ర‌చాల‌నాలు చేశార‌ని ఎద్దేవా చేశారు. ఏపీలో అవినీతికి పెద్ద‌పీట వేసిన బాబు నీతి ఆయోగ్ లో ఏం ప్ర‌సంగిస్తార‌ని సెటైర్ వేశారు. త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం ఏపీ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను , హోదా సెంటిమెంట్ ను చంద్ర‌బాబు తాక‌ట్టు పెట్టార‌ని మండిప‌డ్డారు. ఆ స‌మావేశంలో నిర్దేశించిన 7 నిమిషాల కంటే మ‌రో 5 నిమిషాలు మాత్ర‌మే అద‌నంగా చంద్ర‌బాబు మాట్లాడార‌ని,....ఆయ‌న అనుకూల మీడియా మాత్రం 20 నిమిషాల పాటు మాట్లాడినట్లుగా ప్ర‌చారం చేస్తోంద‌ని ఎద్దేవా చేశారు. ప్రధానికి చంద్రబాబు వంగి వంగి దండాలు పెడుతున్న‌ ఫోటోలను రాంబాబు బ‌య‌ట‌పెట్టారు. మోదీని కలిసిన సమయంలో చంద్రబాబు ముఖంలో భయం, పిచ్చినవ్వు కన్పించిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో భూకంపం సృష్టిస్తానన్న చంద్రబాబు ఏం సాధించారో చెప్పాల‌న్నారు. చంద్రబాబు పోరాటాలు చేసే టైప్ కాద‌ని, అందితే జుట్టు, లేకుంటే కాళ్లు పట్టుకునే అవకాశవాది అని ధ్వజమెత్తారు.