Begin typing your search above and press return to search.

ముస్లింలు బాబుకి ఎందుకు ఓటేయాలి.?

By:  Tupaki Desk   |   2 Sep 2018 5:35 AM GMT
ముస్లింలు బాబుకి ఎందుకు ఓటేయాలి.?
X
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం అంటే ఇదేనేమో.. అవసరార్థం రాజకీయ పార్టీలు తమ స్టాండ్ మార్చుకుంటాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఇవన్నీ చేస్తుంటాయి. అయితే ఓటు బ్యాంకు కోసం ఏమైనా చేసే రాజకీయ పార్టీలు తాజా పరిణామాలకు అనుగుణంగా మారిపోతుంటాయి. స్టాండ్ మారినప్పుడు ఓ పార్టీకి అనుకూలంగా.. మరో పార్టీకి తేడాగా అనిపించవచ్చు. తాజాగా ఏపీలో ముస్లిం ఓటు బ్యాంకు కోసం తెరలేచిన రాజకీయం పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది.

ఇటీవల గుంటూరులో ముస్లిం మైనారిటీలతో చంద్రబాబు భారీ సమావేశాన్ని నిర్వహించి.. ముస్లింలకు చేరువ కావడానికి ప్రయత్నించారు. కానీ నంద్యాల యువకులు ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నినాదాలు చేయడంతో బాబు గొంతులో పచ్చివెల్లకాయ పడ్డట్టు అయ్యింది. వారిని పోలీసులతో అరెస్ట్ చేయించిన బాబు చిత్రహింసలు పెట్టారు. అది దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఆ సభలో తనను తాను ముస్లింలకు అనుకూలుడిగా చంద్రబాబు ప్రకటించుకున్నారు. అయితే ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించే భారతీయ జనతాపార్టీతో ఇన్నేళ్లుగా బాబు అంటకాగిన విషయాన్ని ముస్లింలు మరిచిపోరు.. బీజేపీపై బాబు ఇప్పుడు నిప్పులు చెరిగినా ముస్లింలు నమ్ము పరిస్థితిలో లేరు. బీజేపీ అంటే ఆది నుంచి పడని ముస్లింలు బాబుపై ఇప్పుడు సానుభూతి చూపిస్తారంటే అది కల్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తాజాగా బాబుకు సంధించిన ప్రశ్నలు టీడీపీలో గుబులు రేపాయి. ‘చంద్రబాబు నాయుడు ముస్లింలను మోసం చేయడం ఇదే తొలిసారి కాదు..బీజేపీతో గత ఐదేళ్లుగా పొత్తుపెట్టుకున్నారు. 1999-2004 వరకు బీజేపీతో అంటకాగిన టీడీపీ.. అధికారం కోల్పోయాక బీజేపీపై దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. ముస్లింల కోసం ఏమైనా చేస్తానంటున్నాడు. వీటిని నమ్మి ముస్లింలు ఓటేస్తారా’ అని అంబటి రాంబాబు నిలదీశారు..

ప్రజలకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. తమకు పడని బీజేపీతో అంటకాగిన బాబును ముస్లింలు నమ్మే పరిస్థితిలో లేరు.. ముస్లింలకు తన కేబినెట్ లో ఒక్క సీటు కూడా ఇవ్వని బాబును ముస్లింలు ఎలా నమ్ముతారు. మొదట్లో అంటే టైట్ గా ఉండేది. బీజేపీ మంత్రులు వైదొలిగాక కూడా ముస్లింలకు మంత్రి పదవిని బాబు ఇవ్వలేదు. ఈ ఒక్క కారణం చాలు బాబుకు ముస్లింలపై ఎంత ప్రేమో.. ఇప్పుడు బీజేపీ మోసం చేసిందని ముసలికన్నీరు కారుస్తున్న బాబును మెజార్టీ ముస్లింలు నమ్మే పరిస్థితి లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అందుకే బాబు ఎంత ముస్లింలకు చేరువ అవుదామని చూస్తున్నా.. వారిలోని పాత పగలు రేగి ఆందోళనకు కారణమవుతున్నాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో ముస్లింల ఓటు బ్యాంకు బాబుకు పడే అవకాశాలైతే కనిపించడం లేదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.