Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మాట‌లు త‌ప్పైతే..మ‌రి బాబు కామెంట్లు ఏంటో!

By:  Tupaki Desk   |   5 Aug 2017 4:31 AM GMT
జ‌గ‌న్ మాట‌లు త‌ప్పైతే..మ‌రి బాబు కామెంట్లు ఏంటో!
X
గుర్రానికి పచ్చగడ్డి కట్టి పరిగెత్తించినట్లుగా... నంద్యాల ఓటర్లకు అభివృద్ధి ఆశ చూపించి ఓట్లు కాజేయాలని చూస్తున్న వ్య‌క్తి ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు అని వైఎస్‌ ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, చంద్రబాబు నక్కజిత్తులకు, దుర్మార్గానికి, అవినీతికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. నంద్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ...బహిరంగ సభను విజయవంతం చేసిన నంద్యాల ప్రజానికానికి అంబటి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డిని చూసైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలు - చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. శిల్పా చక్రపాణి ఏ విధంగా రాజీనామా చేశారో ఫిరాయింపు దారులు కూడా రాజీనామాలు చేసి ఓట్లు అడిగే విధంగా ప్రజానికం ఒత్తిడి తేవాలన్నారు.

టీడీపీ నేతలు బోండా ఉమా - అచ్చెన్నాయుడు - సోమిరెడ్డి - ఆదినారాయణరెడ్డిలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని అంబటి హెచ్చరించారు. ఫ్యాన్‌ గుర్తుపై గెలిచి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని ఆదినారాయణరెడ్డి అభ్యర్థిస్తున్నారని, అంతకంటే ముందు ఆయన వియ్యంకుడు కేశవరెడ్డి ఎవరెవరి దగ్గర వందల కోట్లు దోచుకున్నాడో ఆ బాధితులకు డబ్బులు ఇప్పించి ఓట్లు అడగాలన్నారు. నైతిక విలువలకు కట్టుబడని ఆదినారాయణరెడ్డిని నిలదీయాల్సిన బాధ్యత కేశవరెడ్డి బాధితులపై ఉందన్నారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మాటలు వింటే దుఖం వస్తుందని అచ్చెన్నాయుడు మాట్లాడడం సిగ్గుచేటని అంబటి రాంబాబు విమర్శించారు. నిండు శాసనసభలో అచ్చెన్నాయుడు - బోండా ఉమా మాట్లాడినప్పుడు విలువలు ఏమయ్యాయన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్‌ జగన్‌ ను ఉద్దేశించి నీ అంతు చూస్తానని అసెంబ్లీలో మాట్లాడినప్పుడు సాంప్రదాయాలు ఏమయ్యాయని నిలదీశారు. టీడీపీ నేతలు దౌర్జన్యంగా సభలో మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ మాట్లాడిన మాటల్లో తప్పేముందన్నారు. ప్రజా సంక్షేమం కోసం - లోక కల్యాణం కోసం నరకాసురిడిని వధించేందుకు ప్రజలు కంకణం కట్టుకొని ముందుకు సాగాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెబితే తప్పా అని మండిపడ్డారు. చంద్రబాబు ఎంత దుర్మార్గుడో ఆయన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వర్‌ రావు పుస్తకమే విడుదల చేశారని అంబటి గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ ను దించినప్పుడు బస్సులు తగలబెట్టాలని చెప్పింది. వంగవీటి మోహనరంగాను అతిదారుణంగా చంపిన ఘనత చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. దివంగత ఎన్టీఆర్‌ చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో వింటే బాబుకు నిద్రపట్టదన్నారు. మా అల్లుడు రాజకీయ బ్రోకర్‌ అని స్వయంగా ఎన్టీఆరే చెప్పారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్న వ్యక్తులు చంద్రబాబు - భూమా నాగిరెడ్డి తప్ప మరెవరూ లేరన్నారు. శిల్పా మోహన్‌ రెడ్డి - చక్రపాణిరెడ్డిలు శాంతి కాములని సాక్షాత్తు నంద్యాల ప్రజలే చెబుతున్నారన్నారు. నంద్యాలలో మూడు సంవత్సరాల కాలంలో చంద్రబాబు ఒక్క అభివృద్ధి అయినా చేయ‌కుండా....గుర్రానికి పచ్చగడ్డి కట్టి పరిగెత్తించినట్లుగా నంద్యాల ఓటర్లకు అభివృద్ధి ఆశ చూపించి ఓట్లు కాజేయాలని చూస్తున్న దుర్మార్గుడు చంద్రబాబు అని ఆరోపించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పెద్ద కంత్రీ అని - ప్రజలను మోసం చేసిన 420 అని - వాగ్ధానాల పేరుతో ప్రజలను బుట్టలో వేసుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న దుర్మార్గుడు అని అంబటి విమర్శించారు.విలువలకు పట్టం కట్టే వైఎస్‌ ఆర్‌ సీపీని ఆశీర్వదించాలని, దుష్టపరిపాలనను అంతం చేయడానికి నంద్యాల నుంచే నాంది పలకాలని కోరారు.