Begin typing your search above and press return to search.

ఏపీలో ట్యాక్స్‌ కు లోకేష్ పేరు పెట్టేశారు

By:  Tupaki Desk   |   16 Sep 2016 4:24 PM GMT
ఏపీలో ట్యాక్స్‌ కు లోకేష్ పేరు పెట్టేశారు
X
తెలంగాణలో గ్యాంగ్‌ స్టర్‌ నయీం ట్యాక్స్‌ లా ఏపీలో నారా లోకేష్‌ ట్యాక్స్ వ‌సూలు చేస్తున్నార‌ని వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు ప్రతి అభివృద్ధి పనుల్లో రేట్లు పెంచి లోకేష్‌ కు ట్యాక్స్‌ రూపంలో అప్పగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పనులు ఏమీ లేకపోయినా ట్యాక్స్‌ ల కోసమే పనులు చేసే దిగజారిపోయిన పరిపాలన చంద్రబాబు అందిస్తున్నారని మండిప‌డ్డారు. లోకేష్‌ను రాజకీయ వారసుడిగా తీసుకురావడం కోసం, సీఎంను చేయడమే చంద్రబాబు లక్ష్యమైతే ఆ లక్ష్యం నెరవేదని ఎద్దేవా చేశారు. లోకేష్‌ అంటేనే అవినీతి తప్ప మరొకటి లేదని ప్రజల్లో ఎప్పుడో ముద్రపడిపోయిందన్నారు. నిత్యం నీతి వ్యాఖ్యలు చెప్పే చంద్రబాబు ప్రజలను మోసం చేసే కార్యక్రమాలను మానుకోవాలని హితవుపలికారు.

చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ స్నేహితులందరికీ అక్కడ భూములున్నాయి కాబట్టే రాజధాని అని నిర్ణయం తీసుకున్నారని అంబ‌టి ఆరోపించారు. రాజధానిపై మాట్లాడితే చంద్రబాబు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని త‌ప్పుప‌ట్టారు వైసీపీ ఉంటే రానున్న రోజుల్లో టీడీపీకి పుట్టగతులుండవని బాబు భయపడుతున్నారని అన్నారు. అందరూ ఉన్మాదులు.. బాబు ఒక్కడే సశ్చిలుడు అన్నట్లుగా మాట్లాడటం ఏంట‌ని విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ప్రజారంజక పాలన చేస్తే ప్రజలు చెప్పుకుంటారు కానీ అందుకు భిన్నంగా బాబు రంజక పాలన చేస్తున్నారని చురకంటించారు. నేను ఉత్తమ విద్యార్థిని అని తనకు తాను చెప్పుకునే ప్రబుద్దుడిని దేశ చరిత్రలోనే చూడలేదన్నారు. ఇలాంటి వింత మనుషులను చూడాల్సిన దౌర్భాగ్యం రాష్ట్ర ప్రజలకు పట్టిందని అంబ‌టి వ్యాఖ్యానించారు. నోరు తెరిస్తే అల‌వోక‌గా అబ‌ద్దాలు చెప్పే ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఇష్ట‌మైన వ్యాపార రంగంపై చేసిన కామెంట్లకు క‌ట్టుబ‌డి ఉన్నారా అంటూ అంబ‌టి ప్ర‌శ్నించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో ఏపీది నెంబర్‌–2 స్థానం అని చెప్పిన చంద్రబాబు దాన్ని నిరూపించాల‌ని అంబటి సవాలు విసిరారు. పదవ ర్యాంక్‌లో ఉన్న ఏపీని రెండవ ర్యాంక్‌లో ఉందని చెప్పడం బాబుకే చెల్లింద‌న్నారు. ఈఓడీబీలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణది రెండవ స్థానంలో ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పచ్చిగా రికార్డులు తారుమారు చేసే నీచ స్థాయికి దిగజారారని ధ్వజమెత్తారు. అంకెల గారడీతో మభ్యపెడుతున్న బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా విదేశీ పెట్టుబడులకు సంబంధించి 2015–16లో 954 బిలియన్లు వస్తే దాంట్లో ఏపీకి 15.8 శాతం వచ్చిందని, దేశంలోనే విదేశీ పెట్టబడుల్లో ఏపీ అగ్రస్థానం బాబు గొప్పలు చెప్పడం బాధాకరమన్నారు. 4 శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి ఇంతగొప్ప పెట్టుబడులు వచ్చాయంటే ఆ ఘనత చంద్రబాబుదేనని తనకు తాను చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. వీటిపై రికార్డులు పరిశీలిస్తే 2006–07లో విదేశీ పెట్టుబడులు 2,754 ఉండేవని, అప్పటి నుంచి పెట్టుబడులు తగ్గుముఖం పట్టి 954కు చేరాయని ఆధారాలను బయటపెట్టారు. పెట్టుబడులు ఉమ్మడి రాష్ట్రానికి 15.8 శాతమని నివేదిక ఇస్తే చంద్రబాబు నావల్లే పెరిగాయని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను మరోమారు మోసం చేయడానికి పూనుకున్నారని విరుచుకుపడ్డారు.