Begin typing your search above and press return to search.
అంబటిపై చర్యలు...టీడీపీలోనే అయోమయం
By: Tupaki Desk | 22 Nov 2017 5:29 AM GMTఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి చిత్రమైన సమస్య నెలకొంది. తమ పార్టీకి చెందిన సీనియర్ నేత - రాజ్యాంగబద్ధంగా ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిపై విమర్శలు చేసిన ప్రత్యర్థి పార్టీ నాయకుడిపై అదే రీతిలో స్పందించాలా లేదంటే చూసి చూడనట్లు వదిలేయాలా..చర్యలు తీసుకుంటే రాజ్యాంగ పరంగా తీసుకోవాలా..పార్టీ పరంగా పోరాటం చేయాలా అనే విషయంలో టీడీపీ నేతలు మథనంలో పడుతున్నారు. ఇదంతా శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై మాజీ ఎమ్మెల్యే - గత ఎన్నికల్లో ఆయనపై పోటీచేసి ఓడిన వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కామెంట్ల గురించి.
సత్తెనపల్లిలో జరిగిన ఓ సంఘటనలో ప్రత్యక్షంగా హాజరైన అంబటి స్పీకరునుద్దేశించి వ్యక్తిగత ఆరోపణలు చేశారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై సభలో ప్రత్యేకంగా చర్చనిర్వహించిన అధికార తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా...అంబటికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చేదిశగా మొగ్గు చూపడంలో సఫలం అయింది. అయితే ఈ ప్రతిపాదన తెలుగుదేశం పార్టీ సభ్యుల్లో విభిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. అంబటి కామెంట్లుపై సభలో మాట్లాడిన చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి - బండారు సత్యనారాయణ - తోట త్రిమూర్తులు - గీత - కూన రవికుమార్ - విష్ణుకుమార్ రాజు స్పీకర్ పై పరుష పదజాలం వాడి - స్పీకర్ వ్యవస్థపై దాడి చేసిన అంబటికి సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. ఒకసారి అలాంటి వారికి నోటీసులిస్తే మరొకరు స్పీకర్ వ్యవస్థపై దాడి చేసే సాహసం చేయబోరని సూచించారు. అయితే, తాను సభానాయకుడైన ముఖ్యమంత్రి - సభావ్యవహారాల మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు. ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీలో భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. అంబటికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, దానికంటే పార్టీపరంగానే ఆయనపై ఎదురుదాడి చేయడమే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు జగన్ గురించే మాట్లాడవద్దని, ఆయన గురించి ప్రజలే మర్చిపోతుంటే మనం ఎందుకు మాట్లాడి అతనిని ఎందుకు గుర్తించాలని స్వయంగా చంద్రబాబునాయుడే చెబుతుంటే, జగన్ స్థాయి లేని అంబటిని సభకు పిలిపించడమంటే, ఆయనను జగన్ కంటే పెద్దవాడిని చేయడమేనని కొందరు విశ్లేషిస్తున్నారు.
అంబటి ఆరోపణల్లో కొత్తదనమేమీ లేదని - సత్తెనపల్లిలో గత మూడేళ్ల నుంచి అంబటి రాంబాబు కోడెల కుటుంబంపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని, అటు కోడెల వర్గీయులు కూడా అంబటిపై ప్రత్యారోపణలు చేస్తున్న వైనాన్ని కొందరు తెలుగుదేశం పార్టీ నేతలే గుర్తు చేస్తున్నారు. వాటిపై పార్టీపరంగానో - వ్యక్తిగతంగా కోడెల కుటుంబసభ్యులో అంబటిపై పరువునష్టం దావా వేస్తే సరిపోతుందంటున్నారు. స్పీకర్ కు - సభకు ఉన్న విచక్షాణాధికారాల ప్రకారం తలచుకుంటే ఎవరినైనా జైలుకు పంపించే అవకాశం ఉందని గుర్తు చేస్తున్నారు. అయితే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుత తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ కారు డ్రైవర్ కు 40 రోజులు జైలు శిక్ష విధించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ ఘటన తెలంగాణ సమాజాన్ని బాగా రెచ్చగొట్టడంతోపాటు, వ్యక్తిగతంగా ఈటెలకూ రాజకీయ లబ్ధి చేకూర్చిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే, అంబటి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోకపోతే స్పీకర్ వ్యవస్థ చులకన అయ్యే ప్రమాదం ఉందని మరికొందరు వాదిస్తున్నారు. స్థూలంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేకపోతోందని తెలుస్తోంది.