Begin typing your search above and press return to search.

పవన్ ముహూర్తం 4..జగన్ ముహూర్తం 21!

By:  Tupaki Desk   |   20 Feb 2018 11:03 AM GMT
పవన్ ముహూర్తం 4..జగన్ ముహూర్తం 21!
X
కాలికేస్తే మెడకి.. మెడకేస్తే కాలికి వేసి వినోదించే తీరు తప్ప పవన్ కల్యాణ్ తీరులో వేరే ఉద్దేశం కనిపించడం లేదని పలుకోణాల్లోంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. జగన్ తన ప్రతిపాదనను అంగీకరించినా కూడా.. దానికి మళ్లీ మరో మెలిక పెడుతూ పవన్ ఏదో రీతిగా తప్పించుకునే దురాలోచన చేస్తున్నారనే నిందలు వినిపిస్తున్నాయి. ఆయన నెలాఖరు నాటికి అవిశ్వాసం పెడతాం అని ప్రకటిస్తే.. పవన్ కారణాలు చెప్పకుండానే మార్చి 4 లోగా పెట్టండి మద్దతిస్తా అనడం ఇలాంటి అహంకారానికి నిదర్శనం అనే విమర్శలు వస్తున్నాయి.

మార్చి 5న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత.. తమ పార్టీ సభ్యులు ప్రత్యేకహోదా డిమాండ్ తో సభలో ఆందోళన సాగిస్తారని మార్చి 21న ఖచ్చితంగా అవిశ్వాసం పెట్టి తీరుతారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. వారు అవిశ్వాసానికి సిద్ధపడిన తర్వాత.. ఏప్రిల్ 6న సమావేశాలు ముగిసేలోగా ఓటింగుకు వచ్చేలా తగు వ్యవధితో నోటీసు ఇస్తే సరిపోతుంది. వారి చిత్తశుద్ధికి అదే నిదర్శనం అవుతుంది. ఆ తేదీలు మొత్తం లెక్కలు వేసుకుని.. తదనుగుణమైన వ్యవధిని లెక్కకట్టి.. తాము అసలు పోరాటం చేయకుండానే అవిశ్వాసం పెట్టడం అనేది.. చులకనగా ఉంటుందనే ఉద్దేశంతో.. జగన్ ఒక సిస్టమేటిక్ పద్ధతిలో దీనిని ప్రతిపాదించారు.

అయితే పవన్ ఎలాంటి కారణాలు చెప్పకుండానే.. 4లోగా మీరు అవిశ్వాసం పెడితే.. నేను మద్దతు సమీకరించుకు వస్తా అని చెప్పడం విశేషం. ఇంతకూ ఆయన జగన్ చెప్పిన తేదీని ఎందుకు మారుస్తున్నారు. అందులో ఉన్న మెలిక ఏమిటి? అనేది ఎవ్వరికీ అర్థంకాని సంగతి. జగన్ చెప్పిన తేదీ విషయంలో.. ఏదో ఒక మడతపేచీ.. ముందే చెప్పుకున్నట్లు కాలికేస్తే మెడకి.. మెడకేస్తే కాలికి వేసే తత్వం లాగా పవన్ వ్యవహారం కనిపిస్తోంది గానీ.. పరిణతిగల - రాష్ట్రం కోసం చిత్తశుద్ధి గల నాయకుడి వ్యవహారం లాగా లేనేలేదని పలువురు విమర్శిస్తున్నారు.

అందుకే కాబోలు.. వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్టాడుతూ.. పవన్ కల్యాణ్ మరీ చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తన పార్టనర్ అయిన చంద్రబాబు ను ప్రశ్నించకుండానే.. ఆయన ప్రతిపాదనను అంగీకరించిన జగన్ మీద వ్యాఖ్యలు చేయడం.. పవన్ అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని అంబటి రాంబాబు అంటున్నారు. పవన్ మాటలతో నిమిత్తం లేకుండా.. ఒక ప్రణాళిక ప్రకారం.. పార్లమెంటులో పోరాటం అనంతరం మార్చి 21న అవిశ్వాసం పెట్టడం గ్యారంటీ అని వైకాపా నేత వెల్లడిస్తున్నారు.