Begin typing your search above and press return to search.

టీఎస్ స‌చివాల‌యానికి అంబేద్క‌ర్ పేరు.. కేసీఆర్ టార్గెట్ ఫ‌లించేనా?

By:  Tupaki Desk   |   15 Sep 2022 4:36 PM GMT
టీఎస్ స‌చివాల‌యానికి అంబేద్క‌ర్ పేరు.. కేసీఆర్ టార్గెట్ ఫ‌లించేనా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌య‌మే తీసుకున్నారని చెప్పాలి. తెలంగాణ‌లో నూతనం గా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు సీఎం ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు.. తెలంగాణ సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరును పెట్ట‌డం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమ‌ని తెలిపారు.

త‌ను తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమ‌న్నారు. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతోందన్నారు. అంబేద్కర్ కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉందన్న కేసీఆర్‌.. ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించబడుతాయనే అంబేద్కర్ స్ఫూర్తి త‌మ‌ను నడిపిస్తోందని చెప్పారు.

దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడడమే నిజమైన భారతీయతగా పేర్కొన్న కేసీఆర్‌.. భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ పేరును పెట్టాలని ఏదో ఆశామాషీకి కోరుకున్నది కాదన్నారు. భారతదేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే, అంబేద్కర్ పేరును మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించామ‌న్న కేసీఆర్‌.. తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టిన విష‌యాన్ని చెప్పుకొచ్చారు.

అయితే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. అస‌లు కేసీఆర్ వ్యూహం ఏంటి?.. జాతీయ స్థాయిలో పార్టీ పెట్ట‌డ‌మో.. లేక‌.. ప్రాంతీయ‌పార్టీల‌ను క‌లుపుకొని పోవ‌డ‌మో చేయ‌డం ద్వారా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని గ‌ద్దె దింపాల‌నేది వ్యూహం. ఈ క్ర‌మంలో ఇప్పుడు.. ఉన్న‌ట్టుండి.. కేసీఆర్ అంబేద్క‌ర్ నామ‌స్మ‌ర‌ణ చేస్తున్నార‌నేది.. రాజ‌కీయ వ‌ర్గాల వాద‌న‌. నిజానికి ఇప్పుడు కేంద్రంలో కొన్ని పార్టీలు.. ఎస్సీ వ‌ర్గాల‌ను మ‌చ్చిక చేసుకుని.. ముందుకు సాగుతున్నాయి.

ఇలాంటి పార్టీల‌ను త‌న‌వైపు తిప్పుకోవాల‌నేది.. కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. అదేస‌మమ‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు.. కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎస్సీ ఓటు బ్యాంకును టార్గెట్ చేసుకుని.. ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. ఆ ఓటు బ్యాంకు.. మోడీకి ద‌క్క‌కుండా.. చేయ‌డ‌మో.. లేక‌.. పోటీ ఇవ్వ‌డ‌మో చేయాల‌నేది కేసీఆర్ ప్ర‌ధాన వ్యూహం.

ఈ నేప‌థ్యంలోనే.. ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ అసెంబ్లీకి అంబేడ్క‌ర్ పేరు పెట్టార‌నేది.. చ‌ర్చ! అయితే.. ఇప్ప‌టికే ఆయ‌న ఎస్సీల‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని మాట‌త‌ప్పిన నేప‌థ్యంలోను.. ద‌ళిత బంధు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపైనా.. విమ‌ర్శ‌లు ఉన్నాయి. మ‌రి ఈ క్ర‌మంలో తాజాగా కేసీఆర్ వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుంద‌నేది.. చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.